logo

ఇదేం చెత్త.. నగరవాసికి ఎందుకీ శిక్ష

‘వరంగల్‌ ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసిన చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. వ్యర్థాల తరలింపులో జాప్యమెందుకు?, అవసరం అయితే క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులపై చర్యలు తీసుకోండి.’

Published : 20 Jun 2024 05:36 IST

హంటర్‌రోడ్‌ సంతోషిమాత కాలనీ మలుపు వద్ద..

‘వరంగల్‌ ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసిన చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. వ్యర్థాల తరలింపులో జాప్యమెందుకు?, అవసరం అయితే క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులపై చర్యలు తీసుకోండి.’

 మంత్రి కొండా సురేఖ


నగరంలోని 66 డివిజన్లలో పారిశుద్ధ్య పనులు సరిగా లేకపోతే స్థానిక శానిటరీ ఇన్‌స్పెక్టర్, జవాన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటా. ఇంటింటా చెత్త సేకరణ, కాలనీల్లో చెత్త తరలింపు ముమ్మరం చేయాలి.

అశ్విని తానాజీ వాకడే, కమిషనర్, గ్రేటర్‌ వరంగల్‌


వరంగల్‌ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 3 వేల మందికిపైగా ఉన్న ఒప్పంద, తాత్కాలిక కార్మికులతో పనులు చేయించాల్సిన ప్రజారోగ్య విభాగం పూర్తిగా విఫలమవుతోంది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై  ‘న్యూస్‌టుడే బృందం’ పలు డివిజన్లలో  పరిశీలన నిర్వహించింది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, కాల్వల్లో నిలిచిన మురుగు దర్శనమిచ్చింది.

 న్యూస్‌టుడే, కార్పొరేషన్‌


గుర్తించిన అంశాలు..

 • కొందరు శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో తిరగడం లేదు. కాలనీల్లో పనులు చేయించడం లేదు.
 • కొందరు జవాన్లు నెలవారీ మామూళ్లు పుచ్చుకొని కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నా పట్టించుకోవడం లేదు.
 • కిందిస్థాయి ఉద్యోగుల పనితీరును పరిశీలించాల్సిన ముఖ్య అధికారి, ఉప కమిషనర్లు సర్కిల్‌ కార్యాలయాలకే పరిమితమవుతున్నారు.

  మేయర్‌ ఇలాకాలో..

రామన్నపేట గాంధీ విగ్రహం వీధిలో చెత్త

రామన్నపేట: గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న 29 డివిజన్‌లోని కాలనీల్లో అపరిశుభ్రత నెలకొంది. పక్కనే ఉన్న 28వ డివిజన్‌లో సైతం ఇదే పరిస్థితి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హోల్‌సేల్‌ అనాజ్, కిరాణా వ్యాపార కూడలిలో ఎక్కడ చూసినా దుర్గంధమే.. మురుగు కాలువల నిండా వ్యర్థాలున్నాయి. ఇంటింటా చెత్తసేకరణ క్రమం తప్పింది. మేయర్‌ క్యాంపు కార్యాలయం భవనం ముందే చెత్త పేరుకుపోయింది.

మేయర్‌ ఇంటి సమీపంలోని రామన్నపేట రాజీవ్‌గాంధీ విగ్రహం ముందు..

రెండురోజులకోసారి: ప్రతిరోజూ ఇంటింటా చెత్త సేకరణ జరుగుతోందని ప్రజారోగ్య విభాగం లెక్కలు చెబుతున్నాయి. రామన్నపేట, గంగపుత్ర వీధి, బీసీ కాలనీ, గాంధీ విగ్రహం గల్లీ, పాపయ్యపేట, ఓఎస్‌నగర్, రఘునాథ్‌ కాలనీ, బీసీ కాలనీల్లో దినం విడిచి దినం స్వచ్ఛ ఆటో వస్తుంది. కొన్ని కాలనీలకు వారానికి రెండుసార్లే వస్తుందని ప్రజలంటున్నారు.

మురుగు కాలువలు ఇలా: వాన పడితే చాలు పాత బీటుబజారు, రైల్వేగేటు రహదారి బురదమయం అవుతోంది. రామన్నపేట, హంటర్‌రోడ్‌ సంతోషిమాత కాలనీ, పాపయ్యపేట, రఘునాథ్‌ కాలనీల్లో మురుగు కాలువలు వారానికోసారైనా తీయడం లేదని ప్రజలంటున్నారు.


రోడ్ల మీదే పడేస్తున్నారు..

41వ డివిజన్‌ రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతి గదుల పక్కన వ్యర్థాలు

37, 41వ డివిజన్ల పరిధిలోని రంగశాయిపేట, శంభునిపేట, గిరిప్రసాద్‌నగర్‌ కాలనీ పరిధిలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. నాయుడు పెట్రోల్‌పంపు కూడలి నుంచి ఆర్టీవో కార్యాలయం మీదుగా నిర్మించనున్న 200 అడుగుల అంతర వలయ రహదారిపై మూడు చెత్త కుండీలు ఏర్పాటు చేసినా.. వ్యర్థాలు రోడ్డుపైనే పేరుకుపోయి కనిపిస్తున్నాయి. రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం తరగతి గదులు ఆనుకొని స్థానిక ప్రజలు ఇష్టారాజ్యంగా చెత్తను పడేస్తున్నారు.

 37వ డివిజన్‌ గిరిప్రసాద్‌నగర్‌లోని అంతరవలయ రహదారి పక్కన..

 న్యూస్‌టుడే, రంగశాయిపేట


అడుగడుగునా నిర్లక్ష్యం..

గీసుకొండ మండలం మొగిలిచెర్లలో.. 

గీసుకొండ: గీసుకొండ మండలం 15వ డివిజన్‌ పరిధిలో అతిపెద్ద గ్రామమైన మొగిలిచెర్లలో 10 వేల జనాభా ఉంటుంది. పలు వీధుల్లో మురుగు కాలువలు సక్రమంగా లేవు. ఉన్నవి శుభ్రం చేయడం లేదు. రెండు మూడు రోజులకోసారి స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. చెత్తను రాంపురం లేదా ఉర్సుగుట్ట వద్ద ఉన్న డంపింగ్‌యార్డుకు తరలించాల్సి ఉండగా.. పడమటి చెరువు శివారులోని శ్మశాన వాటికలో పడేస్తున్నారు.

రోగాల బెడద..:

మా గ్రామంలో మురికి కాలువలను సిబ్బంది సక్రమంగా తీయడం లేదు. మా వీధులన్నీ ఈగలు, దోమలకు నిలయాలుగా మారి.. రోగాలబారిన పడుతున్నాం. రెండునెలల కిందట  జ్వరంతో లక్ష్మి అనే మహిళ మృతిచెందారు.

 రాయరాకుల విజయ, మొగిలిచెర్ల

బురదతో ఇబ్బందులు

పాత బీటుబజారు నుంచి రైల్వేగేటు వరకు ప్రధాన రహదారిలో నిత్యం బురదే ఉంటోంది. మురుగు కాలువలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వర్షం పడితే అంతే సంగతులు.

 మిట్టపల్లి మృహేశ్, కొబ్బరికాయల వ్యాపారి, బీటుబజారు

నాలుగురోజులకు ఓసారి శుభ్రం

భూపేష్‌నగర్‌ కాలనీలో నాలుగు రోజులకు ఒకసారి కాలువలు శుభ్రం చేస్తున్నారు. చెత్త వాహనం రెండురోజులకు ఒకసారి వస్తుంది. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. ఎందుకు చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

 భవాని, భూపేష్‌నగర్‌

వివరాలు.

 • నగర విస్తీర్ణం 406 చదరపు కిలో మీటర్లు
 • నగర జనాభా 12 లక్షలు,  66 డివిజన్లు
 • 3 వేల మంది ఒప్పంద, తాత్కాలిక కార్మికులు
 • రోజూ 2500-2600 విధులకు వస్తారని అంచనా
 • చెత్తను తరలించే వాహనాలు 280
 • ఇంటింటా చెత్త సేకరణ స్వచ్ఛ ఆటోలు 450

40వ డివిజన్‌ కరీమాబాద్‌ సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ విగ్రహం నుంచి కరీమాబాద్‌ వాటర్‌ట్యాంకు వెళ్లే రోడ్డులో చెత్తకుప్పలు తొలగించలేదు. దారిపొడవునా వ్యర్థాలు ఉన్నాయి. బల్దియా సిబ్బంది నాలుగు రోజులకు ఒకసారి వచ్చి శుభ్రం చేస్తున్నారని స్థానికులు తెలిపారు.

 కరీమాబాద్, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని