logo

ఆరోగ్య యోగం.. ఆనంద మార్గం

ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతోమంది పని ఒత్తిడితో వారి జీవితంలో సుఖ సంతోషాలకు దూరమవుతున్నారు. మానసిక ఆలసటకు లోనై అసహనానికి గురవుతున్నారు. వీరికి ఉపశమనంగా యోగా ఎంతో మేలు చేస్తుంది.

Published : 21 Jun 2024 02:32 IST

విద్యార్థులతో సాధన చేయిస్తున్న గురువు రాంబాబు

ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతోమంది పని ఒత్తిడితో వారి జీవితంలో సుఖ సంతోషాలకు దూరమవుతున్నారు. మానసిక ఆలసటకు లోనై అసహనానికి గురవుతున్నారు. వీరికి ఉపశమనంగా యోగా ఎంతో మేలు చేస్తుంది. యోగాభ్యాసంతో దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్‌ పెట్టొచ్చని యోగా గురువులు చెబుతున్నారు. జీవితంలో యోగాను ఓ భాగంగా చేర్చుకుంటే మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యవంతులుగా మారొచ్చు. భావిపౌరులు నిత్యం ఆచరిస్తే మేధో వికాసవంతులుగా రూపాంతరం చెందొచ్చు. నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 

న్యూస్‌టుడే, వెంకటాపురం 

యోగా చేస్తే ఒత్తిడి నుంచి బయటపడటమే కాదు.. మెరుగైన ఏకాగ్రత కూడా  సాధించొచ్చు..

శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు.. శాంతి మార్గం యోగాతోనే సాధ్యం

యోగా అనేది ఒక ఎక్సర్‌సైజ్‌ కాదు.. అది మన మనస్సును, ఆత్మను, శరీరాన్ని ఏకం చేసే ఒక మహోన్నత సాధనం

20 ఏళ్లుగా ..

నిత్య జీవితంలో యోగాను వృత్తిగా చేసుకున్నారు యర్రంకని రాంబాబు, యోగా గురువు. 20 ఏళ్లుగా విద్యార్థులు, యువకులు, వృద్ధులు, పెద్దలకు నేర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామకృష్ణ యోగా మఠంలో రెండేళ్ల పాటు సాధన చేసి ప్రస్తుతం శిక్షకుడిగా మారారు. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏల పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని అనేక విద్యాలయాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చారు. యోగాతో ఆనందం, ఆరోగ్యం, ఆత్మజ్ఞానాలను పొందొచ్చని, విశ్వ ఐక్యతకు సూత్రంగా భావించి దినచర్యగా అభ్యాసం చేయాలని సూచిస్తున్నారు. 

శరీర ఆకృతిని కాపాడుతుంది

డాక్టర్‌ అప్పయ్య, డీఎంహెచ్‌వో, ములుగు

శరీర ఆకృతిని కాపాడటంలో యోగా ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాయామంతో పాటు యోగాసనాలు వేస్తా. ఆసుపత్రుల తనిఖీకి వెళ్లిన సమయంలో రోగులకు కూడా యోగా చేయాలని సూచిస్తుంటా. మన మనస్సు మన ఆధీనంలో ఉండటంతో పాటు రోగాలు రావు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం కేటాయిస్తే.. అనారోగ్యం దరిచేరదు 

అనారోగ్యం అంటే తెలియదు

- ఏ.స్వామిరెడ్డి, ఏడీఈ, విద్యుత్తు శాఖ, వెంకటాపురం

రెండు దశాబ్ధాలుగా సాధన చేస్తున్నా.. అనారోగ్యం అంటే తెలియదు. స్వస్థలమైన హనుమకొండలో కాకతీయ కళాశాల ప్రొఫెసర్‌ వద్ద, విజయవాడలోని సత్యసాయి యోగా ట్రస్టులో శిక్షణ పొందా. 2000 సంవత్సరం నుంచి సాధన చేయడంతో పాటు తాను విధులు నిర్వహించిన రఘునాథపాలెం, హనుమకొండ, వెంకటాపురంలో సన్నిహితులకు ఉచితంగాసే శిక్షణ ఇచ్చా. 59 ఏళ్లు నేను ఏ నాడు అస్వస్థతకు గురికాలేదు. ఆత్మస్థైర్యం పెంపొండంతో పాటు మనసు ఎప్పుడూ ఆధీనంలోనే ఉంటుంది. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇలా ప్రతీ రోజు రెండు గంటల పాటు సాధన చేస్తా.

ప్రయోజనాలు ఇవీ..: 

  • మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది.
  • ప్రజ్ఞ, శక్తి, చైతన్యం లభిస్తుంది.
  • ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, చురుకుదనం, ఉత్సాహం, వాక్‌ శక్తి, స్వీయ నియంత్రణ ఉంటుంది.
  • ఆయుష్షు ప్రమాణాన్ని పెంచుతుంది.
  • మధుమేహం, రక్తపోటు లాంటి ధీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించొచ్చు. 

జనామోదం.. 

వరంగల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: యోగా గురించి అవగాహన ఏ మేరకు ఉందో తెలుసుకోవడానికి ‘న్యూస్‌టుడే’ 100 మందితో ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరూ గుర్తిస్తున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 

విద్యార్థి దశ నుంచే ఆసనాలు 

ప్రస్తుతం విద్యార్థి దశ నుంచే యోగాను అలవాటు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు గురుకుల విద్యాలయాల్లో క్రమం తప్పకుండా విద్యార్థులు యోగాసనాలు నేర్పిస్తూ.. నిత్యం చేయాలని సూచిస్తున్నారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి రోజు యోగా సాధనకు కొంత సమయం కేటాయిస్తున్నారు.

సింధు నాగరికత నుంచే ఆనవాళ్లు

సింధు నాగరికత నాటికే యోగా ఆనవాళ్లు బయటపడ్డాయి. రుగ్వేదంలో యోగా ప్రాధాన్యతను పొందుపర్చగా, దాని నుంచి పతంజలి మహర్షి అష్టాంగ రాజయోగం(యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహర, ధారణ, ధ్యానం, సమాధి) వెలుగులోకి తెచ్చారు.

యోగా ప్రారంభించడానికి ముందు ఓంకార నాధాన్ని స్మరిస్తారు. 11 లేదా, 21, 41 సార్లు జపిస్తారు. దీనిని రాగ, భావయుక్తంగా ఉచ్ఛరిస్తే శరీరంలోని నాడులన్నీ ఉత్తేజమవుతాయి. సూక్ష్మ వ్యాయామాలు (వార్మప్‌) సాధన చేసినవాళ్లమవుతాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని