logo

ధాన్యం కొనుగోళ్లు ముగిశాయ్‌!

జిల్లా వ్యాప్తంగా 189 కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం సేకరణ పూర్తయింది.. ఈ సారి అకాల వర్షాలు, సరైన నాణ్యతా ప్రమాణాలు లేవనే కారణంతో అధిక మొత్తంలో తరుగు తదితర కారణాలతో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు.

Published : 21 Jun 2024 02:35 IST

ధాన్యం బస్తాలను లారీలోకి ఎక్కిస్తున్న హమాలీలు(పాత చిత్రం)

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా 189 కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం సేకరణ పూర్తయింది.. ఈ సారి అకాల వర్షాలు, సరైన నాణ్యతా ప్రమాణాలు లేవనే కారణంతో అధిక మొత్తంలో తరుగు తదితర కారణాలతో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ధాన్యం విక్రయించి వారాలు గడుస్తున్నా నగదు జమ చేయడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో యాసంగి సీజన్‌కు సంబంధించి 189 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మహిళా సంఘాల నుంచి 8, సహకార సంఘాల నుంచి 164, గిరిజన కోఆపరేటివ్‌ సొసైటీల నుంచి 4, ఇతరులకు 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ అంచనా వేశారు. అందుకు భిన్నంగా 77 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 10 వేల మంది అన్నదాతల నుంచి 77 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటికి రూ.128.37 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయగా ఇంకా రూ.42.94 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం విక్రయించిన అన్నదాతలకు నగదు చెల్లించడంలో కొంత జాప్యం ఏర్పడుతోంది. రైతులు ధాన్యం అమ్మిన తర్వాత వారి ఖాతాలో రెండు రోజుల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా కొన్ని సాంకేతిక కారణాలు, సంబంధిత కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సరైన సమయంలో రైతుల వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయడంలో జాప్యం చేయడం.. తదితర కారణాలతో అన్నదాతల ఖాతాలో నగదు జమ చేయడంలో ఆలస్యం అవుతోంది. దీంతో వానాకాలం పంటల సాగు, పెట్టుబడికి నగదు ధాన్యం విక్రయించిన డబ్బులు అవసరమవుతాయని భావించిన రైతన్నలకు కొంతమేర ఎదురుచూపులు తప్పడం లేదు.

అన్నదాతలకు తప్పని ఇబ్బందులు : జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించడంలో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. వానాకాలంలో అధికంగా వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. అందులో భాగంగానే దిగుబడి పెరుగుతుందని అంచనా వేసిన అధికారులు అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు తేమ శాతం ఉండాల్సి రావడం, అకాల వర్షాలతో ధాన్యం తడవడంతో సరైన తేమ వచ్చేవరకు ధాన్యం కాంటా వేయకపోవడంతో రోజుల తరబడి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. కాంటా వేసినా మిల్లులో ధాన్యం బస్తాలు దిగుమతయ్యే వరకు రైతులదే బాధ్యతని నిర్వాహకులు తెలపడంతో మిల్లులకు చేరే వరకు కళ్లల్లో వత్తులు వేసుకొని అన్నదాతలు జాగారం చేశారు.

జిల్లాలో వివరాలు ఇవీ..

  • కొనుగోలు కేంద్రాలు : 189
  • ధాన్యం సేకరణ అంచనా : 1.20 లక్షల మె.ట
  • కొనుగోలు చేసింది : 77996.240 మె.ట
  • ధాన్యం విక్రయించిన రైతుల సంఖ్య : 11580
  • కొనుగోలు చేసిన ధాన్యం విలువ : రూ.150.06  కోట్లు
  • నగదు జమైన రైతుల సంఖ్య : 9699
  • చెల్లించిన నగదు : రూ.128.37 కోట్లు
  • ఇంకా నగదు జమకాని రైతుల సంఖ్య : 1881
  • చెల్లించాల్సిన నగదు : రూ.42.94 కోట్లు  

రేపటిలోగా నగదు జమ చేస్తాం 

రాఘవేందర్, పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ 

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వంద శాతం పూర్తయింది. అన్నదాతల ఖాతాలో వేగవంతంగా నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రేపటిలోగా(శనివారం) నగదు జమ చేయడం పూర్తవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని