logo

యువతి ఆత్మహత్యకు కారణమైన ఒకరికి పదేళ్ల జైలు

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన యువతిని ప్రేమించి మోసం చేసి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ మహబూబాబాద్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్‌ గురువారం తీర్పునిచ్చారు.

Published : 21 Jun 2024 02:39 IST

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన యువతిని ప్రేమించి మోసం చేసి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ మహబూబాబాద్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్‌ గురువారం తీర్పునిచ్చారు. కోర్టు డ్యూటీ అధికారి రవీందర్‌ తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని సిగ్నల్‌ కాలనీకి చెందిన శ్యామల కార్తీక్‌ ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశారు. దీంతో ఆమె 2017 డిసెంబర్‌ 22న  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కార్తీక్‌ మోసం చేయడం వల్లనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతురాలి తల్లి పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు అప్పటి పట్టణ ఎస్సైలు నర్సయ్య, సీహెచ్‌. రమేష్‌బాబు కేసు నమోదు విచారణ చేపట్టి కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ప్రస్తుత సీఐ పెండ్యాల దేవేందర్‌ ఆధ్వర్యంలో పది మంది సాక్షులను ప్రవేశపెట్టగా పీపీ చిలుకమారి వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్‌ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. అప్పటి పట్టణ ఎస్సైలు నర్సయ్య, రమేష్‌బాబు, ప్రస్తుత సీఐ, కోర్టు డ్యూటీ అధికారిని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అభినందించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని