logo

అడిగేవారు లేక.. ఐటీడీఏలో అక్రమాలు!

ఏటూరునాగారం ఐటీడీఏలో పనిచేసే కొందరు అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఆర్వో పాంట్ల మరమ్మతుల పేరుతో అడవి బిడ్డల సొమ్మును స్వాహా చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులను గుడ్డిగా నమ్మించి ఇష్టంవచ్చినట్లు బిల్లులు రాసి అందినకాడికి దండుకున్నారు.

Published : 21 Jun 2024 02:48 IST

ఆర్వో ప్లాంట్ల మరమ్మతుల పేరుతో నిధుల స్వాహా 

 

చల్వాయి హాస్టల్‌ ఆర్వో ప్లాంటుమరమ్మతులకు సంబంధించిన బిల్లు 

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఏటూరునాగారం ఐటీడీఏలో పనిచేసే కొందరు అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఆర్వో పాంట్ల మరమ్మతుల పేరుతో అడవి బిడ్డల సొమ్మును స్వాహా చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులను గుడ్డిగా నమ్మించి ఇష్టంవచ్చినట్లు బిల్లులు రాసి అందినకాడికి దండుకున్నారు. పై అధికారికి పర్సనల్‌ వ్యక్తిని అంటూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అడిగేవారు లేకపోవడంతో అవసరం లేకున్నా.. ఉన్నట్లుగా నమ్మించి మరమ్మతులు చేయకుండానే బిల్లులు పెట్టారు. ఈ తతంగానికి ఐటీడీఏలోని ఓ అధికారి చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది. రెండేళ్ల కిందట ఏటూరునాగారం ఐటీడీఏకి వచ్చిన ఆయనది ఉన్నతాధికారులను నమ్మించడంలో అందెవేసిన చేయిగా చర్చించుకుంటున్నారు. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల ఆర్వో ప్లాంట్ల మరమ్మతులకు 2023లో రూ.55 లక్షలు మంజూరయ్యాయి. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల వార్డెన్ల ప్రతిపాదన మేరకు పనులు చేపట్టారు. టెండరు నిర్వహించకుండానే కొన్నిచోట్ల పనులు ప్రారంభించారు. అధికారులు ఇప్పటి వరకు రూ.41 లక్షల బిల్లులు సైతం చెల్లించారు. 

ఇష్టారాజ్యంగా బిల్లులు.. 

  • ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయి బాలుర వసతి గృహం ఆర్వో ప్లాంటు మరమ్మతుల్లో 4040 మెంబ్రేన్స్‌ ఒకదానికి రూ.13,500 కొన్నట్లు చూపించారు. కానీ రెండింటి ధర రూ.27 వేలు వేశారు. 
  • కార్బన్‌ బ్యాగ్స్‌ ధర ఒకదానికి రూ.2,250 కాగా.. రెండు కొన్నట్లు చూపించారు. 
  • ఈ ఆర్వో ప్లాంటు మరమ్మతులకు తొమ్మిది వస్తువులు కొని ఎస్‌జీఎస్టీ, సీజీఎస్టీతో కలిపి మొత్తం రూ.74,816 వెచ్చించారు. 

ఈ విషయంపై చల్వాయి బాలుర వసతిగృహ వార్డెన్‌ నాగరాజును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. 2023 ఏప్రిల్‌లో ఎలాంటి మరమ్మతులు చేయలేదన్నారు. ఈ ఆర్వో ప్లాంటు మరమ్మతులకు వాడిన వస్తువులను 11 ఏప్రిల్‌ 2023న కొన్నట్లుగా బిల్లు తీసుకున్నారు.

ధరల్లో తేడా ఇలా.. 

మరమ్మతుల ఖర్చులో 40 నుంచి 45 శాతం అధికంగా బిల్లులు చూపించారు. బిల్లుల్లో చూపించిన ధరల్లోనూ పొంతన లేకుండాపోయింది. ఒకే వస్తువుకు వేర్వేరు ధరలు వేశారు. ఒక బడిలో ఒక రకంగా ఉంటే మరో బడిలో మరో రకంగా ఉంది. 0.5 హెచ్‌పీ వాటర్‌ పంపు రూ.4 వేలు వెచ్చిస్తే.. సీఆర్‌ఐ కంపెనీ వస్తుందని, సాధారమైన కంపెనీదైతే రూ.1,200 ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అలాంటిది చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువగా చూపించారు. అవసరం లేకున్నా.. స్పేర్‌ పార్ట్స్‌ కొనుగోలు చేశారు. ఒక్కో ప్లాంటుకు రూ.1.65 లక్షలు వెచ్చించినట్లు చూపించారు. ఇంత ఖర్చు ఉండదని, కావాలని ఎక్కువ చెల్లించినట్లు  తెలుస్తోంది. స్పేర్‌పార్ట్స్‌ను కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ డిస్ట్రిబ్యూటర్‌ వద్ద కొనుగోలు చేసినట్లు చూపారు. ప్రతి బిల్లులో అధిక ధరలను రాశారు. ఉన్నతాధికారులు విచారణ జరిపితే నిధులు ఏమేరకు స్వాహా అయ్యాయో  తెలుస్తుంది.

పాఠశాల వారీగా చెల్లించిన బిల్లులు 

ఇదేలా సాధ్యమో వారికే తెలియాలి.. 

  • వర్ధన్నపేట ఎస్టీ బాలికల వసతి గృహం ఆర్వో ప్లాంటుకు చూపించిన బిల్లులో ఒక కార్బన్‌ బ్యాగు ధరను రూ.2,500 చూపించారు. కానీ రూ.5 వేలు చెల్లించారు. కొత్తగూడ బాలికల ఆశ్రమ జూనియర్‌ కళాశాల ఆర్వో ప్లాంటుకు బిగించిన కార్బన్‌ బ్యాగులు ఒక్కోటి రూ.2,250 చొప్పున రెండు కొనుగోలు చేసినట్లు చూపించారు. మొత్తం రూ.4,500 కావాల్సి ఉండగా.. రూ.2500 చెల్లించినట్లు బిల్లులో చూపించడం గమనార్హం.. 
  • మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర పోస్టు మెట్రిక్‌ వసతి గృహంలోని ఆర్వో ప్లాంటు మరమ్మతుల్లో శాండ్‌ బ్యాగులు రూ.2500 చొప్పున రెండు తీసుకున్నట్లు బిల్లులో ఉంది. రెండింటికి కలిపి రూ.2,500 చెల్లించినట్లు బిల్లులో ఉంది. 

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం :

- ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా

మేడారం జాతర సమయంలో ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు తీసుకున్నా. ఆశ్రమ పాఠశాలల్లోని ఆర్వో ప్లాంట్ల మరమ్మతుల విషయంలో సంబంధిత దస్త్రాలు తెప్పించుకుని పరిశీలిస్తాం. ఆర్‌వో ప్లాంట్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లులు పరిశీలిస్తాం. కొనుగోళ్లలో తేడాలుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని