logo

ఆహారశుద్ధి.. ఉద్యోగాల వృద్ధి

హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ముప్పారం శివారులో   సుమారు 120 ఎకరాల ప్రభుత్వ స్థలం ఇది. మొదట ఇక్కడ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలనుకున్నారు. తర్వాత ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదించారు.

Published : 21 Jun 2024 02:54 IST

ఉమ్మడి జిల్లాలో ఎన్నో సానుకూలతలు

హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ముప్పారం శివారులో   సుమారు 120 ఎకరాల ప్రభుత్వ స్థలం ఇది. మొదట ఇక్కడ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలనుకున్నారు. తర్వాత ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇది నిర్ణయించి మూడేళ్లు కావొస్తుంది. తాజాగా ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ఆశలు చిగురించాయి. 

పంట ఉత్పత్తులకు విలువలు జోడిస్తే రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.  నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం జిల్లాల వారీగా సాగవుతున్న పంటలకు అనుగుణమైన ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 

ఈనాడు, మహబూబాబాద్‌: ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఏయే పంటలకు సంబంధించిన పరిశ్రమలు  ఏర్పాటు చేయవచ్చు అనేది వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు నివేదికలను సిద్ధం చేశారు. భూసేకరణ చేసిన చోట పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించాలని.. మిగిలిన చోట భూములు సేకరించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. 

జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలనుకుంటున్న పరిశ్రమలు 

అడ్డంకులు తొలగితేనే 

2021లో జిల్లాల వారీగా ఆహారశుద్ధి మండళ్ల ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం భూసేకరణకు ఆదేశాలు ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల్లో స్థల సేకరణకు కసరత్తు చేశారు. చాలా చోట్ల అసైన్డ్‌ భూముల్లో ఏర్పాటు చేయాలని భావించారు. కొన్ని చోట్ల అప్పటికే ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. 

  • మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం రాజోల్‌ ప్రాంతంలో 200 ఎకరాల అసైన్డ్‌ భూమిని గుర్తించారు. ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది. దాంతో తొర్రూరు మండలం మడిపల్లి వద్ద జాతీయ రహదారికి సమీపంలోని 80 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా అనుకూలతలున్నాయి. 
  • ములుగు జిల్లా ఇంచెర్ల శివారులో 20 ఎకరాలను గుర్తించారు. ఇప్పుడు ఆ స్థలంలో గుడిసెలు వెలిసినట్లు తెలిసింది.  

అన్నదాతలకు వరం: ఉమ్మడి జిల్లాలో 4,33,118 మంది రైతులు సుమారు 17 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, పసుపు పండిస్తారు. ఉద్యానపంటల్లో కూరగాయలతో పాటు పండ్ల సాగులో మామిడి, జామ ఉన్నాయి.  

మహిళలకు అవకాశం

ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనలో మహిళలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలు కానున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల్లో సుమారు 7 లక్షల మంది వనితలున్నారు. ఇప్పటికే వీరిలో కొందరు మహిళలు చిరుధాన్యాలతో ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించడం, పిండిమిల్లులను, దుకాణాలను ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారు. ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోళ్లు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 

మిర్చి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుంది. ఇప్పుడు 1.25 లక్షల ఎకరాలకే పరిమితమైంది. పంటను విపణిలో విక్రయించే సమయంలో వ్యాపారుల చేతుల్లో రైతులు దగా పడుతున్నారు. ఆశించిన ధర దక్కక నష్టపోతున్నారు. అందుకే సాగు విస్తీర్ణం తగ్గింది. ఆహారశుద్ధి పరిశ్రమలను అందుబాటులోకి తెస్తే రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది. సాగు విస్తీర్ణం పెరుగుతుంది. 

పసుపు

ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్ల కిందట దాదాపు 30 వేల ఎకరాల్లో సాగయ్యేది. గిట్టుబాటు ధర లభించక.. చీడపీడలతో నష్టాలు రావడంతో క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గింది. 2023లో ఆరు వేల ఎకరాలకే పరిమితమైంది. ప్రస్తుతం విపణిలో క్వింటాకు రూ.10 వేల పైనే ధర ఉండడంతో ఈసారి సాగువిస్తీర్ణం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  వరంగల్‌ జిల్లాలో పసుపు పంటకు సంబంధించిన ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. 

ఇవి కూడా

  • ఉమ్మడి జిల్లాలో మామిడి 40 వేలు, జామ 400 ఎకరాల్లో సాగవుతున్నాయి. అరటి, నిమ్మ లాంటి ఉద్యాన పంటలు పండిస్తున్నారు. వీటికి సంబంధించిన ఆహారశుద్ధి పరిశ్రమను మహబూబాబాద్‌లో స్థాపించాలనుకుంటున్నారు. 
  • ఉమ్మడి జిల్లాలో 1.08 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. అత్యధికంగా మహబూబాబాద్, వరంగల్‌ జిల్లాల్లో పండిస్తారు. దీనికి సంబంధించిన పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేస్తే మేలు. 
  • జనగామ జిల్లాలో బంగాళదుంపకు సంబంధించిన ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ పంటను జనగామ సహా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా పండించడం లేదు. 

రైతులకు ప్రయోజనం:

మోతె కర్ణాకర్‌రెడ్డి, నర్సంపేట

న్యూస్‌టుడే, నర్సంపేట: 26 ఏళ్ల నుంచి ఎకరంన్నర భూమిలో పసుపు సాగు చేస్తున్నాను. రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుంది. పంట ఉత్పత్తులను మద్దతు ధరకు నేరుగా కొనుగోలు చేయాలి.  పంటల ప్రాసెసింగ్‌పై అన్నదాతలకు శిక్షణ ఇచ్చి వారితోనే తయారు చేయించాలి. 

గిట్టుబాటు ధర వస్తుందని ఆశ: 

-అల్వాల నవీన్, నర్సింహులపేట

న్యూస్‌టుడే, నర్సింహులపేట: ఏటా ఎనిమిది ఎకరాల్లో మిర్చి సాగు చేస్తాను. మార్కెట్‌లో దళారులు, వ్యాపారులు చెప్పిన ధరకే పంటను విక్రయించాల్సి వస్తోంది. ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఆశించిన ధర దక్కుతుందని ఆశ ఉంది.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని