logo

ఆసనాలతో ఆరోగ్య‘యోగ’ం

ఉరుకుల పరుగుల జీవితంలో మానవుడు తన ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. వయసు తారతమ్యాలు లేకుండా చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Updated : 21 Jun 2024 05:34 IST

ఉరుకుల పరుగుల జీవితంలో మానవుడు తన ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. వయసు తారతమ్యాలు లేకుండా చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దల సూక్తి నిజం చేయాలంటే ఆహారపు అలవాట్లతోపాటు యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి యోగా ఒక చక్కటి మార్గం. ఏకాగ్రత, జీవన నాణ్యత, విజ్ఞత, మనసు ప్రశాంతత చేకూరుతాయి. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం..

వరంగల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే 

శాంతి మార్గం యోగాతోనే సాధ్యం 

యోగా అనేది ఒక ఎక్సర్‌సైజ్‌ కాదు.. అది మన మనస్సును, ఆత్మను, శరీరాన్ని ఏకం చేసే ఒక మహోన్నత సాధనం

యోగా చేస్తే ఒత్తిడి నుంచి బయటపడటమే కాదు.. మెరుగైన ఏకాగ్రత కూడా సాధించొచ్చు..

వెన్నునొప్పి, తిమ్మిర్లు తగ్గాయి

బండారు భార్గవి, డైరెక్టర్, అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు, వరంగల్‌ 

నాకు వెన్ను నొప్పి, తరచూ తిమ్మిర్లు సమస్య ఎక్కువగా ఉండేది. ఒకసారి హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు యోగా, ధ్యానంతో మందులు లేకుండా తగ్గించుకోవచ్చని సలహా ఇచ్చారు. మా కుటుంబ సభ్యులందరం ఒక యోగా టీచర్‌తో నెలరోజుల పాటు అందరం యోగాసనాలు నేర్చుకున్నాం. అప్పటి నుంచి నా వెన్నెముక బలంగా మారింది. కాళ్లతిమ్మిర్లు తగ్గాయి. అప్పటి నుంచి యోగాసనాలు ఆపలేదు. 20 ఏళ్లుగా ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగాసనాలు వేస్తున్నా.

సమస్య పరిష్కారమైంది..

- పవిత్ర, హంటర్‌రోడ్డు, వరంగల్‌

 నాకు 2015లో సయాటిక సమస్య వచ్చింది. కుడికాలు ఒకవైపు లాగడం, తిమ్మిర్లు, భరించలేని నొప్పి ఉండేది. ఆసుపత్రికి వెళితే ఆపరేషన్‌ చేయాలన్నారు. ఈక్రమంలో హంటర్‌రోడ్డులోని కాకతీయ నేచర్‌కేర్‌కు వెళ్లగా.. శస్త్రచికిత్స లేకుండా, యోగాసనాలతో సయాటిక నొప్పి తగ్గించారు.

నాన్న పక్షవాతం నయమైంది..

కాజీపేటకు చెందిన కొదిరిపాక సంగీత మాధురి యోగాలో ఎంఎస్సీ, డిప్లొమా కోర్సులు పూర్తి చేశారు. జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లి జిల్లా పరిషత్‌ సెంకటరీ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పాఠశాల విద్యార్థులతో అరగంట యోగాసనాలు చేయిస్తారు. యోగాసనాల ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని బలంగా నమ్ముతారు. తండ్రికి 90శాతం పక్షవాతం వచ్చి మంచానికే పరిమితం అయ్యారు. అప్పుడు సంగీత మాధురి తండ్రితో యోగాసనాలు సాధన చేయించారు. ఇలా క్రమం తప్పకుండా సాధన చేయడంతో ఆయన కేవలం 40 రోజుల్లో పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. పలువురికి యోగాలో ఉచితంగా శిక్షణ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మహిళలకు అనేక ప్రయోజనాలు

- డాక్టర్‌ నిర్మల, స్త్రీ వైద్యనిపుణురాలు, సూపరింటెండెంట్, సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి

 మహిళలు సాధారణ సమయాల్లో ఎంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ నెలసరి సమయాల్లో చిరాకు, విసుగ్గా ఉంటారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల పీరియడ్స్‌ కారణంగా వచ్చే నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులు తగ్గుతాయి. ధనురాసనం అవయవాలను ఉత్తేజపరుస్తుంది. తిమ్మిరిని తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సేతు బంధాసనం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. రక్తపోటును నియంత్రించవచ్చు. గర్భిణులు యోగాసనాలు చేయడం ద్వారా సుఖ ప్రసవం అవుతుంది. నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకొని నిత్యం అవలంభించాలి.

శస్త్రచికిత్స తప్పింది 

నర్సంపేట: సంగెం మండలం మొండ్రాయికి చెందిన తీగారపు సాయికుమార్‌కు 2020లో ముక్కులో మాంసం పెరగడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వైద్యులను సంప్రదిస్తే శస్త్రచికిత్స చేయాలని, అందుకు రూ.30వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఖర్చును భరించే ఆర్థిక స్తోమత ఆయనకు లేకపోవడంతో నర్సంపేటకు చెందిన యోగా శిక్షకుడు సదానందం బాపూజీని సంప్రదించారు. ఆయన సూచనతో యోగాలోని క్రియలను సాధన చేయడంతో సమస్య పరిష్కారమైంది. మూడేళ్ల నుంచి ఆరోగ్యంగా ఉన్నానని, నిత్యం యోగా సాధన చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని సాయికుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన వడోదరలో ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. 

నిరంతర సేవలో శ్రీనివాస్‌ గురూజీ

గోపాలపూర్‌: ఆరోగ్య సమాజ నిర్మాణంలో తనవంతు భాగస్వామ్యం ఉండాలనే తపనతో వరంగల్‌ జిల్లా ఇల్లంద గ్రామానికి చెందిన యోగా గురువు పోశాల శ్రీనివాస్‌ ఉచితంగా యోగా శిబిరాలు నిర్వహిస్తూ సేవలందిస్తున్నారు. యోగాలో డిప్లోమా పూర్తి చేసిన శ్రీనివాస్‌ 25 ఏళ్ల నుంచి యోగా ప్రాధాన్యతను వివరిస్తూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 160 గ్రామాల్లో యోగా శిక్షణ తరగతులను నిర్వహించారు. 2.50 లక్షల మందికి యోగా నేర్పించారు. ఉచిత యోగా శిక్షణ తరగతుల నిర్వహణతో జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్నారు. 2016లో వేయి స్తంభాల దేవాలయంలో వెయ్యి మంది విద్యార్థులతో యోగా వేడుకలు నిర్వహించినందుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డులను అందుకున్నారు.

జనామోదం.. 

యోగా గురించి అవగాహన ఏమేరకు ఉందో తెలుసుకోవడానికి ‘న్యూస్‌టుడే’ 100 మందితో ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరూ గుర్తిస్తున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని