logo

ఆర్టీఏలో ఇష్టారాజ్యంగా సీసీల జారీ

ఇటీవల పలు రవాణాశాఖ కార్యాలయాల్లో అనిశా(అవినీతి నిరోధక శాఖ) అధికారులు ఆకస్మిక దాడులు చేసినా.. సిబ్బందిలో మార్పు రావడం లేదు.

Published : 23 Jun 2024 04:04 IST

పత్రాలతో సురేందర్‌

రంగశాయిపేట, న్యూస్‌టుడే: ఇటీవల పలు రవాణాశాఖ కార్యాలయాల్లో అనిశా(అవినీతి నిరోధక శాఖ) అధికారులు ఆకస్మిక దాడులు చేసినా.. సిబ్బందిలో మార్పు రావడం లేదు. వరంగల్‌ జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో దళారులతో చేతులు కలిపిన కొందరు సిబ్బంది సీసీ(క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌)లు ఇష్టారాజ్యంగా ఇస్తూ అందినంత దండుకుంటున్నారు. వాహనం ఇతర జిల్లాలకు అమ్మిన సమయంలో ఇచ్చే ఈ అనుమతి పత్రాలు యజమానికి తెలియకుండా ఇతరులకు ఇవ్వడం తాజాగా వివాదాస్పదమైంది.

వరంగల్‌ జిల్లా కొత్తవాడకు చెందిన సిరంగి సురేందర్‌ తన లారీ (టీఎస్‌03 యూసీ 0339) విక్రయించారు. కొనుగోలు సమయంలో సీసీ ఇచ్చాక పూర్తి డబ్బులు ఇస్తామని కొంత మొత్తం ఆపారు. గతనెల 30న యజమాని తగిన రుసుం చెల్లించి ఫొటో దిగి ఇతర నిబంధనలు పూర్తి చేసి వరంగల్‌ నుంచి సిద్దిపేటకు సీసీ పొందారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని కోరగా.. క్రయవిక్రయాల సమయంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి తనకు సీసీ పత్రాలు ఇచ్చారని, అతనికి డబ్బులు ఇచ్చినట్లు లారీ కొనుగోలు చేసిన వ్యక్తి చెప్పడంతో కంగుతిన్న యజమాని ఆర్టీఏ కార్యాలయంలో ఆరా తీశారు. అదేనెల 31న మరోమారు సీసీ పత్రాలు ముద్రించి ఇచ్చినట్లు తేలింది. దీంతో యజమాని సిబ్బందిపై మండిపడ్డారు. అసలు యజమాని దరఖాస్తు చేసుకుంటే మూడురోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టి సీసీ పత్రాలు ఇచ్చిన సిబ్బంది.. మరుసటి రోజే అదే పత్రాలను మరోమారు ముద్రించి ఎలా ఇతరులకు ఇస్తారంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై ఏఓ, ఎంవీఐలకు ఫిర్యాదు చేశారు. వెంటనే తేరుకున్న సిబ్బంది తమ తప్పు సరిదిద్దుకునేందుకు నానా తంటాలు పడ్డారు. యజమానికి న్యాయం చేస్తామంటూ బతిమిలాడారు. చివరకు ప్రస్తుతం లారీ కొన్న యజమాని పేరుమార్పు జరగకుండా సీసీ రద్దు చేసేందుకు తగిన రుసుములు ఆర్టీఏ సిబ్బందే చెల్లించి ఆన్‌లైన్‌లో ఫ్రీజింగ్‌లో ఉంచారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నా.. బాధితులు ప్రశ్నిస్తేనే సిబ్బంది వ్యవహారం బయటపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని