logo

పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపడేదెట్లా?

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహబూబాబాద్‌ పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగు పడడంలేదు.

Published : 23 Jun 2024 04:05 IST

పట్టణంలోని హన్మంతునిగడ్డ ప్రాంతంలో  ఇలా..

మహబూబాబాద్, న్యూస్‌టుడే: ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహబూబాబాద్‌ పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగు పడడంలేదు. అరకొరగా ఉన్న పారిశుద్ధ్య సిబ్బందితో కేవలం ప్రధాన రహదారులు, మురుగు కాలువలు శుభ్రం చేస్తున్నారు. శివారు కాలనీల్లో మాత్రం కొంతమంది సిబ్బంది పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించలేకపోతున్నారు. అంతర్గత రహదారులు అధ్వానంగా ఉండడం, మురుగు కాలువలు లేక రహదారులపై నీరు ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొంది. వానాకాలం ప్రారంభం కావడంతో పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజలకు అనారోగ్య సమస్యల ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటీవల పురపాలక సంఘం అధికారులు పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. 16 మందితో రెండు బృందాలను ఏర్పాటు చేసి వార్డులవారీగా ఇద్దరు చొప్పున పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. సిబ్బంది కొరత, అత్యవసరమైన పరికరాలు మూలన పడి ఉండడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు ఏ ప్రాంతంలోనూ ఫాగింగ్‌ చేయలేదు. పురపాలక సంఘంలో ఆరు ఫాగింగ్‌ మిషన్లు ఉండగా పని చేయకుండా మూలన పడేశారు. ఏ వార్డుకు ఆ వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. బుధవారం ‘న్యూస్‌టుడే’ వివిధ ప్రాంతాలను పరిశీలించి అందిస్తున్న కథనం..

ఆ ప్రాంతమంతా అపరిశుభ్రతే..

మహబూబాబాద్‌ పట్టణంలోని హన్మంతుని గడ్డ, గోగుల మల్లయ్య బజార్‌ ప్రాంతం నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశం చెత్త చెదారంతో అపరిశుభ్రంగా మారింది. మురుగు కాలువ నిండిపోయి ఈ నీరు అంతా రహదారిపైకి వచ్చి మురికి కూపంగా దీంతో దీంతో పందులు సంచరిస్తూ ఆ ప్రాంతాన్ని మరింత అపరిశుభ్రం చేస్తున్నాయి.

వాహనాలు ఇలా..

పురపాలక సంఘంలో 27 ఆటోలు, 9 ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నారు. ఆసుపత్రులు, కల్యాణ మండపాలు, కూరగాయల మార్కెట్‌ నుంచి సుమారు 30-32 టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది. సిబ్బంది, వాహనాల డ్రైవర్ల కొరతతో ఆశించిన మేర  పనులు జరగడం లేదు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన జేసీబీ ఆపరేటర్, స్వీపింగ్‌ మిషన్, డీసిల్టింగ్‌ మిషన్‌ నడిపే నిపుణులైన డ్రైవర్లు లేకపోవడంతో వాహనాలు మూలనపడ్డాయి. అదనంగా మరో 40 నుంచి 50 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది.

రహదారిపై నిలిచిన నీరు

సిగ్నల్‌ కాలనీతో పాటు కొత్త బజార్‌ నుంచి పాత బజార్‌కు వెళ్లే మార్గంలో మురుగు నీటి కాలువ నిర్మించకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా రహదారిపై నీరు ఇలా నిలిచిపోతుంది. కాలువను తిరిగి నిర్మిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

సౌకర్యాలు కల్పించాలి

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించి   సౌకర్యాలు కల్పించాలి. మూడు నెలలుగా  వేతనాలు చెల్లించలేదు. ఏడాది కిందట  యూనిఫామ్‌ పంపిణీ చేశారు.  అవసరమైన ఆయిల్, సబ్బులు, బూట్లు, ఆఫ్రాన్‌  ఇవ్వడం లేదు.  వైద్య శిబిరాలను నిర్వహించి వారికి  మందులను అందజేయాలి.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం

- నోముల రవీందర్, కమిషనర్, పురపాలక సంఘం

పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. కాలువల్లో పూడిక తీయడంతో పాటు చెట్ల పొదలను తొలగిస్తున్నాం. మురికినీటి గుంతల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయిస్తున్నాం. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లిస్తున్నాం. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రజలు కూడా తమ సహకారం అందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని