logo

క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రణాళికలు రూపొందించాలి

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు.

Published : 23 Jun 2024 04:06 IST

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధనసరి సీతక్క. చిత్రంలో వరుసగా డీఎఫ్‌వో విశాల్, కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీనాయక్, ప్రభుత్వ విప్, డాక్టర్‌ రాంచంద్రునాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్య, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, పురపాలక సంఘం ఛైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి

మహబూబాబాద్, న్యూస్‌టుడే: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లా కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రగతిపై సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత  ప్రజాపాలన, ఆరు గ్యారంటీ పథకాల్లో కొన్ని అమలు చేసుకుంటున్నామన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రావడంతో అభివృద్ధి కార్యక్రమాల్లో మూడు నెలలు వెనకబడ్డామన్నారు. ఈక్రమంలో పనులను మూడు నెలల్లో పూర్తి చేసేలా పరుగులెత్తాలన్నారు.  మొదటి సమావేశం నిర్వహిస్తున్నందున చిన్న చిన్న సమస్యలు వదిలేస్తామని మరోసారి నిర్వహించే సమావేశంలో మాత్రం నిర్లక్ష్యం చేసిన అధికారులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందేవిధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థానిక వనరులను ఉపయోగిస్తూ అభివృద్ధిలో జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని ఆమె కోరారు. ఎంపీ పోరిక బలరాంనాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానాకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన సేవలందించాలన్నారు.  ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ మాట్లాడుతూ విద్యుత్తు అధికారులు ప్రమాదాలు జరగకుండా విద్యుత్‌ తీగలను సరి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు లాభసాటి పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు.  ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. భూ ఆక్రమణదారులు, రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్యా మురళీనాయక్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో ప్రజలకు అవసరమైన పనులను  చేపట్టాలన్నారు. హరితహారంలో పండ్ల మొక్కలు నాటేలా చూడాలన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమై మందులను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్, డీఎఫ్‌వో బత్తిని విశాల్, అదనపు ఎస్పీ చెన్నయ్య, జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో నర్మద, జిల్లా సంక్షేమ శాఖాధికారి వరలక్ష్మి, పీఆర్‌ ఈఈ సురేష్, పురపాలక సంఘం ఛైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

భూకబ్జాదారుల ఆటలు ఇక సాగవు

జిల్లాలో భూ కబ్జాదారుల ఆటలు సాగవని, కఠిన చర్యలు తీసుకుంటామని  మంత్రి సీతక్క హెచ్చరించారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుంచి వచ్చిన పలువురు భూ బాధితులు తమ గోడును మంత్రికి విన్నవించుకున్నారు. భారాస ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పేదల భూములను ఆక్రమించుకున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకొని ధరణిలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆ సమస్యలకు ఈ ప్రభుత్వంలో పరిష్కారం లభిస్తుందన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, వివిధ ప్రాంతాల ప్రజలు వినతులు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని