logo

బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం..

సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదకరంగా మారిన బొగ్గు గనుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అడ్డుకుంటామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు తెలిపారు.

Updated : 23 Jun 2024 06:16 IST

మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదకరంగా మారిన బొగ్గు గనుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అడ్డుకుంటామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు తెలిపారు. సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాక్‌ల వేలం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలి ప్రాంతంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ సర్కారు దేశ వ్యాప్తంగా 67 బొగ్గు బ్లాక్‌లను వేలం వేయడానికి సిద్ధమైందని చెప్పారు. కార్పొరేట్‌ సంస్థలకు బొగ్గు గనులను అప్పగించకుండా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగించాలని, సింగరేణి కార్మికులు, ఒప్పంద కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రాంతంలోని మందమర్రి ప్రాంతంలోని శ్రావణ్‌పల్లి బొగ్గుబ్లాక్‌ను కార్పొరేట్‌ సంస్థకు అప్పగించడానికే వేలం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి వేలం అడ్డుకోవాలని, నూతన గనుల తవ్వకాలకు సింగరేణి యాజమాన్యానికి ఎలాంటి షరతులు లేకుండా అనుమతులు తీసుకొచ్చే బాధ్యత కిషన్‌రెడ్డిపై ఉందన్నారు. గతంలో కేంద్రమంత్రి కోల్‌బెల్ట్‌ ఏరియాలో పర్యటించిన సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే భాజపా ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి రక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, రవికుమార్, బాబు, సాంబయ్య, ప్రభాకర్, ఐద్వా, వంగాల లక్ష్మి, శేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని