logo

నెరవేరని.. సొంతింటి కల

పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ ఆశయం అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేమితో ఏళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదు.

Updated : 23 Jun 2024 06:13 IST

భాస్కర్‌గడ్డ సమీపంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు

న్యూస్‌టుడే, భూపాలపల్లి: పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ ఆశయం అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేమితో ఏళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదు. జిల్లా కేంద్రంలోని భాస్కర్‌గడ్డ గ్రామ సమీపంలో రూ.22 కోట్ల నిధులతో 462 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి 2019 ఆగస్టు 20న అప్పటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించిన నాటి నుంచి పూర్తి నత్తనడకన కొనసాగాయి. మొత్తం ఇళ్లు రెండేళ్ల క్రితమే పూర్తికాగా.. అర్హులైన పేద కుటుంబాలకు పంపిణీ చేయడంలో తీవ్ర జాప్యమవుతోంది. కొత్తగా నిర్మించిన కొన్ని ఇళ్లల్లో కిటికీలు, వాటర్‌ పైపులు, విద్యుత్తు స్విచ్‌బోర్డులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారు. కొంతమంది ఆకతాయులు కిటికీల అద్దాలను ధ్వంసం చేస్తున్నారు. ఆ ఇళ్ల సముదాయం రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లను ఏడాదిన్నర క్రితమే అర్హులకు పంపిణీ చేస్తే.. పేద కుటుంబాలకు ఇంటి అద్దెలు చెల్లించే భారం తగ్గేదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. అర్హులైన లబ్ధిదారులను అధికారులు గుర్తించి మొదటి విడతలో 392 మందిని ఎంపిక చేసి, గత ఆగస్టు 8న ఇల్లందు క్లబ్‌ హౌజ్‌లో తుది జాబితా రూపొందించారు. అదే నెల 9న మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు భూపాలపల్లిలో పర్యటించిన నేపథ్యంలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించి, ముగ్గురికి పట్టాలు జారీ చేశారు. మిగతా వారికి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్‌ కారణంగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ఇళ్ల కోసం మొత్తం 661 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, కేవలం 178 మంది మాత్రమే అసలైన అర్హులని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. జాబితాలో అనర్హులు ఉన్నారనే కారణంతో పంపిణీలో జాప్యం అవుతోంది.

ఇళ్లలో ప్రవేశాలు కాకముందే ధ్వంసమైన కిటికీ అద్దాలు

మొదలైన వసూళ్ల లొల్లి..

ఇళ్ల పంపిణీ విషయంలో గతంలో అధికారంలో ఉన్న భారాస నేతలు, ప్రస్తుత అధికార పార్టీ నేతలు కొందరు ఇళ్లు ఇప్పిస్తామని పలువురు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఐదుగురు కాంగ్రెస్‌ నాయకులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ కమిటీ సభ్యులు రెండు పడక గదుల ఇళ్ల సముదాయంలో ఇంటి పట్టాలు జారీ చేయాలనే డిమాండ్‌తో ధర్నా చేస్తున్న లబ్ధిదారుల వద్దకు వచ్చి వచ్చే నెల 1వ తేదీ వరకు అర్హులైన అందరికీ పట్టాలు ఇప్పిస్తామని, దీక్షలను విరమించాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైనా ఇళ్ల కోసం డబ్బులు ఇస్తే.. వారి నుంచి తిరిగి వసూలు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ఇళ్లు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. అయితే మళ్లీ అధికార పార్టీ నాయకులు కొందరు అర్హులైన లబ్ధిదారుల జాబితా తీసుకొని.. కొంతమంది లబ్ధిదారుల వద్దకు వెళ్లి డబ్బుల వసూళ్లకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. మీరు డబ్బులు ఇవ్వకుంటే జాబితాలో మీ పేరు ఉండదని చెబుతున్నట్లు సమాచారం. అయితే గతంలో అధికారంలో ఉన్న కొంత మంది నాయకులకు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎవరైనా లబ్ధిదారులు అడిగితే.. మీ పేరు మొదటి జాబితాలో ఉంది కదా.. అని చెప్పి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు వసూలు చేసిన డబ్బులు లబ్ధిదారులకు కొంతమేర తిరిగి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రెండు పార్టీల నేతల మధ్య వసూళ్ల లొల్లి మొదలు కావడంతో అసలైన లబ్ధిదారులు మాత్రం అయోమయానికి గురవుతున్నారు. ఇంటి పట్టాల కోసం పది రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టిన లబ్ధిదారులు ఇంటి పట్టాలు ఎప్పుడు అందుతాయోనని ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌ను సంప్రదించగా.. వచ్చే నెల మొదటి వారంలోగా అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలను స్థానిక ఎమ్మెల్యే జీఎస్సార్, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు