logo

మండల పరిషత్‌ కార్యాలయానికి మహర్దశ

గ్రామాల అభివృద్ధిలో మండల ప్రజా పరిషత్‌ ఎంతో కీలకం.. ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మండలాభివృద్ధికి వివిధ పనులు చేపడుతుంటారు.

Published : 23 Jun 2024 04:10 IST

న్యూస్‌టుడే, చెల్పూర్‌(గణపురం): గ్రామాల అభివృద్ధిలో మండల ప్రజా పరిషత్‌ ఎంతో కీలకం.. ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మండలాభివృద్ధికి వివిధ పనులు చేపడుతుంటారు. కావాల్సిన నిధులన్నీ పరిషత్‌ నుంచే విడుదలవుతుంటాయి. అలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి మండల పరిషత్‌ కార్యాలయాన్ని కొన్నేళ్లుగా పట్టించుకోకపోవడంతో మరమ్మతులకు నోచుకోలేదు. అటు సిబ్బందితో పాటు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఇబ్బందులు పడిన దాఖలాలు ఉన్నాయి. దీంతో మండల పరిషత్‌కు మహర్దశ వచ్చేలా, కార్యాలయం రూపురేఖలు మారిపోయేలా అన్ని మరమ్మతులు చేపట్టాలనే ఉద్దేశంతో రూ.43 లక్షల ఎస్‌ఎఫ్‌సీ నిధులతో పనులు చేపడుతున్నారు.

మారనున్న రూపురేఖలు

2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్‌ఎఫ్‌సీ నిధులతో కార్యాలయ మరమ్మతు చేపడుతున్నారు. ఏదైనా సమావేశం నిర్వహిస్తే కుర్చీలను కూడా అద్దెకు తీసుకునే పరిస్థితి ఉండేది.. అలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యాలయ మరమ్మతులకు తీర్మానం చేయడంతో మండల పరిషత్‌ కార్యాలయం రూపురేఖలు మారనున్నాయి. కార్యాలయం ఎదుట సీసీ రోడ్డు నిర్మాణం, లోపల సిబ్బందికి క్యాబిన్లు, అవసరమైన కంప్యూటర్లతో పాటు సమావేశ మందిరంలో డయాస్‌ ఏర్పాటు, ఏసీలు, అవసరమైన కుర్చీలు, ఎల్‌ఈడీ బల్బు ఏర్పాటు, కార్యాలయ నేమ్‌బోర్డుతో పాటు ఎంపీపీ, ఎంపీడీవో ఛాంబర్‌లో ఏసీలు తదితర పనులు చేపడుతున్నారు.

నెలఖారుకు పూర్తవనున్న పనులు

మండల పరిషత్‌ కార్యాలయంలో చేపడుతున్న పలు మరమ్మతు పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జులై 3వ తేదీతో ముగుస్తున్నందున ఆలోపల పనులు పూర్తిచేసి వారికి ఘనంగా వీడ్కోలు పలకాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నికైన వారు మండల పరిషత్‌ను పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ సమస్యలు అలాగే ఉన్నాయి. ఈసారి ఎన్నికైన వారు మాత్రం తమ పేరు ఎప్పటికీ ఉండిపోయేలా కార్యాలయంలో అన్ని హంగులతో మరమ్మతు చేపట్టడం హర్షణీయమని ప్రజలు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని