logo

పారిశుద్ధ్యం.. అధ్వానం

ఓ మోస్తరు వర్షాలకే జనగామ పట్టణంలోని ప్రధాన రహదారులు, పలు కాలనీలు వరద, మురుగునీటి ముంపునకు గురవుతున్నాయి.

Published : 23 Jun 2024 04:15 IST

దేవిథియేటర్‌ కూడలిలో పేరుకుపోయిన వ్యర్థాలు..

జనగామ, న్యూస్‌టుడే: ఓ మోస్తరు వర్షాలకే జనగామ పట్టణంలోని ప్రధాన రహదారులు, పలు కాలనీలు వరద, మురుగునీటి ముంపునకు గురవుతున్నాయి. పట్టణంలో ప్రజారోగ్యమే లక్ష్యంగా పారిశుద్ధ్య పరిరక్షణకు ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా, నిర్వహణ గాడిలో పడటం లేదు. వర్షాకాలం ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజా భాగస్వామ్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపాల్టీలను పురపాలక శాఖ అప్రమత్తం చేస్తూ, ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. ప్రజలతో పాటు, అధికారులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను గుర్తు చేస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టం చేసింది. ఎజెండాలో బిల్లుల చెల్లింపులకు ప్రాధాన్యమిచ్చిన కౌన్సిల్‌ బాధ్యులు పురపాలక శాఖ ఆదేశాల గురించి సభ్యులకు సమాచారాన్ని ఇవ్వలేదు. బుధవారం జరిగిన సమావేశంలో కనీసం చర్చ జరపలేదు. పట్టణంలో ప్రస్తుత పారిశుద్ధ్య పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ శుక్రవారం పరిశీలన జరిగింది.

చెత్తసేకరణలో విఫలం

ఖాళీ ప్లాట్లు చెత్తకుండీలుగా, రద్దీ అధికంగా లేని దారులు డంపుయార్డులుగా మారుతున్నాయి. ఉదాహరణకి స్థానిక పాత కబేలా నుంచి పాలకేంద్రం వెనుక 60 అడుగుల దారి పొడవునా నిర్మాణ వ్యర్థాలు, చెత్తకుప్పలు పోగయ్యాయి. మూడురంగుల చెత్తబకెట్లు నిండి పరిసరాలు డంప్‌యార్డు మాదిరి దర్శనమిస్తున్నాయి. కొత్త కుర్మవాడ, పరిణయగార్డెన్‌ కాలనీ, బాలాజీనగర్, కొత్త కాలనీల్లో అనేక చోట్ల ఇదే పరిస్థితి. ప్రతి రోజు ఇంటింటి చెత్తసేకరణ జరగకపోవడంతో ఈ దుస్థితి నెలకొంటోంది.

చెత్తబుట్టలున్నా.. చెత్తకుండీలా పాలకేంద్రం దారి..

పూడుకుపోయిన కాల్వలు

అనేక వార్డుల్లో పాత కాల్వలు ధ్వంసమయ్యాయి. రూ.కోట్లు పోసి హైదరాబాద్‌ ప్రధాన రహదారి వెంట నిర్మించిన కాల్వలు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మట్టితో పూడుకున్నాయి. కాల్వలపై మెట్లు, కప్పులు వేయడంతో రోజువారీగా శుభ్రం చేయడం లేదు. రంగప్పచెరువు వరదనీరు వచ్చే ఆర్వోబీ పక్కన, కుర్మవాడ కూడలిలో కాల్వలు వ్యర్థాలతో నిండాయి. భారీ వర్షాలు కురిస్తే పొంగే ప్రమాదం ఉంది. రూ.9.10 కోట్ల వరదనీటి నివారణ పథకం పనులు 10 మాసాలుగా నిలిచిపోయాయి. ఇప్పటికే మలేరియా, డెంగ్యూ కేసులు నమోదైనట్లు జడ్పీ సమావేశంలో జిల్లా వైద్యాధికారి ప్రకటించడం గమనార్హం.

పురపాలిక శాఖ ఆదేశాలిలా..

దోమల నివారణ, విషజ్వరాలు ప్రబలకుండా ప్రజాప్రతినిధులను, ఇతరులను భాగస్వాములను చేసి, ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఫ్రైడే, డ్రైడేను ముఖ్య అధికారులు పర్యవేక్షించాలి. గుంతల పూడ్చివేత, నీరు నిల్వకుండా చూడాలి. భారీ వర్షాలు కురిసిన వెంటనే వరద నీరు తరలేలా చూడాలి. ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ వందశాతం జరగాలి. విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ప్రజలను అప్రమత్తం చేయాలని పురపాలిక శాఖ పలు సూచనలు చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలపై ప్రచారం, కార్యాచరణ ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు ఫాగింగ్, దోమల మందు పిచికారీ కూడా జరగలేదు.

ప్రజల సహకారం అవసరం..

- వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌

వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక పనులు ప్రారంభించాం. కచ్చా కాల్వలను శుభ్రం చేస్తున్నాం. ఆక్రమణలు, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో పూడుకుంటున్నాయి. కాల్వలను, దారులను, ఖాళీ స్థలాలను చెత్తకుండీలుగా మార్చవద్దని ప్రజలకు విజ్ఞప్తి.

పట్టణ జనాభా- 52408 (2011ను అనుసరించి), ప్రస్తుతం 65వేలు అంచనా

కుటుంబాలు - 16 వేలు
వార్డులు - 30
పట్టణ విస్తీర్ణం- 17 చ.కి.మీ
పారిశుద్ధ్య కార్మికులు-155
వాహనాలు-15
నిర్వహణకు ఏటా వ్యయం-రూ.4.50 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని