logo

అనుబంధ కళాశాలల బలోపేతంపై దృష్టి

అనుబంధ కళాశాలల బలోపేతం, బోధన, శిక్షణ, పరిశోధనలపై దృష్టి పెట్టాలని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య పి.మల్లారెడ్డి అన్నారు.

Published : 23 Jun 2024 04:16 IST

సమావేశానికి హాజరైన వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు

విద్యానగర్, న్యూస్‌టుడే: అనుబంధ కళాశాలల బలోపేతం, బోధన, శిక్షణ, పరిశోధనలపై దృష్టి పెట్టాలని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య పి.మల్లారెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో వర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయం ఎంపిక చేసిన ప్రభుత్వ కళాశాలలకు పరిశోధన కేంద్రాలుగా అనుమతి వచ్చిందని చెప్పారు. వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ కళాశాలల సిబ్బంది పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో పాల్గొనాలని, విద్యార్థుల్లో విజ్ఞానం పెంచడానికి కృషి చేయాలని చెప్పారు. కేయూ పరిధిలో 297 కళాశాలలు ఉంటే కేవలం 197 కళాశాలల బోధనా సిబ్బంది వివరాలు మాత్రమే నమోదు చేశారని గుర్తు చేశారు. సభాధ్యక్షత వహించిన అకడమిక్‌ ఆడిట్ డీన్‌ ఆచార్య  జి.హనుమంతు మాట్లాడుతూ.. దోస్త్‌ ప్రకారం మొదటి సెమిస్టర్‌ తరగతులు జులై 1 నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు. వర్సిటీకి చెల్లించాల్సిన ఫీజులను కళాశాలలు సకాలంలో చెల్లించాలని అన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహాచారి మాట్లాడుతూ.. అంతర్గత, వర్సిటీ పరీక్షలు, ప్రయోగ పరీక్షలు కచ్చితంగా సమయానికి నిర్వహించాలని చెప్పారు. అకడమిక్‌ సహాయ రిజిస్ట్రార్‌ కోలా శంకర్, ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయ అధికారి ఈసం నారాయణ, స్పోర్ట్స్‌ బోర్డ్‌ కార్యదర్శి ఆచార్య వై.వెంకయ్య, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ఎం.తిరుమలాదేవి మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాలు, క్రీడల నిర్వహణ, సకాలంలో సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ, సిబ్బంది వివరాల నమోదు తదితర అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్‌ వందన సమర్పణ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని