logo

ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి

గిరిజనుల కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్‌ పని చేస్తోందని కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌ నాయక్‌ అన్నారు.

Published : 23 Jun 2024 04:17 IST

సమావేశంలో మాట్లాడుతున్న హుస్సేన్‌ నాయక్‌ 

హనుమకొండ కలెక్టరేట్, న్యూస్‌టుడే : గిరిజనుల కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్‌ పని చేస్తోందని కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌ నాయక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వైద్యారోగ్య, గిరిజన శాఖల అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌ బారిన పడినవారి కోసం కేంద్రం ప్రత్యేక పథకాన్ని తెచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా వారికి రూ.15 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తుందని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్య, వైద్యం, గిరిజన వసతిగృహాల నిర్వహణ అంశాలపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, వెంకట్‌రెడ్డి, ఆర్‌డీవో వెంకటేష్, కేఎంసీ ప్రిన్సిపల్‌ డా.మోహన్‌దాస్, డీటీడబ్ల్యూవో ప్రేమకళ, ఆర్‌సీవో వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

గిరిజన భవన్‌ సందర్శన..

ఎన్జీవోస్‌కాలనీ: హనుమకొండలోని గిరిజన భవన్‌ను జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ సందర్శించారు. ఈ సందర్భంగా బంజార సంక్షేమ సంఘం నాయకులు పుష్పగుచ్ఛం అందించారు. భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా కనీస వసతులు లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్పీడీసీఎల్‌ భవన్‌లో సమావేశం

బాలసముద్రం : జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ నక్కలగుట్టలోని విద్యుత్తు భవన్‌ను సందర్శించగా.. ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. వాలు నాయక్, అజ్మీరా శ్రీరామ్‌ నాయక్, రాజశేఖర్, రాజేందర్, స్వామి నాయక్‌ పాల్గొన్నారు.

ఎస్టీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: పెండింగ్‌లో ఉన్న ఎస్టీ కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ అన్నారు. శనివారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు వచ్చిన ఆయన్ను పరిపాలన అదనపు డీసీపీ రవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని