logo

ధరణి సమస్యలపై నజర్‌!

ధరణి పెండింగ్‌ సమస్యల పరిష్కారాలపై జిల్లా రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. గత మార్చిలో నిర్దేశిత సమయంలోగా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.

Updated : 23 Jun 2024 06:15 IST

కలెక్టరేట్‌లోని ధరణి కేంద్రం వద్ద అర్జీదారులు (పాతచిత్రం)

ధరణి పెండింగ్‌ సమస్యల పరిష్కారాలపై జిల్లా రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. గత మార్చిలో నిర్దేశిత సమయంలోగా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. అయితే కొద్దిరోజులకే పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో.. అర్జీల పరిశీలన నిలిచిపోయింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన నేపథ్యంలో తిరిగి జిల్లాలోని ధరణి పెండింగ్‌ సమస్యలపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలని ఇటీవల సీసీఎల్‌ఏ (చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులకు సూచించారు. దీంతో అపరిష్కృతంగా ఉన్న ధరణి అర్జీలు పరిష్కారం కానున్నాయి. 

న్యూస్‌టుడే, వరంగల్‌ కలెక్టరేట్‌

అధికారాల విభజనతో..

భూ సమస్యలు పరిష్కరించేందుకు పారదర్శకంగా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దినా.. వివిధ దశల్లో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరిగింది. దీంతో జిల్లా పరిధిలో వేల సంఖ్యలో భూ సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఈక్రమంలో ధరణి దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌కు మాత్రమే ఉన్న అధికారాలను విభజించారు. మండలాల వారీగా స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టి తహసీల్దార్లు నాలుగు రకాల మాడ్యుళ్లకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరించనున్నారు. అసైన్డ్‌ భూములతో పాటు అన్నిరకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు, భూ సమస్యలకు సంబంధించిన వినతులు, తదితర సమస్యలను తహసీల్దార్లు పరిశీలించనున్నారు. టీఎం-7 పాసు పుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి, టీఎం-16 భూసేకరణకు సంబంధించిన సమస్యలు, టీఎం-20 ప్రవాసీయులకు చెందిన భూసమస్యలు, టీఎం-26 కోర్టు కేసులు, టీఎం-33 పాసుపుస్తకాల్లో తప్పులు నమోదైనవి తదితర భూ సమస్యలు ఆర్డీఓ పరిశీలించి పరిష్కరించనున్నారు. అయితే తప్పనిసరిగా తహసీల్దార్లు సమర్పించిన విచారణ నివేదిక ఉండాల్సిందే.

జిల్లా పరిధిలో 2,771 పెండింగ్‌..

ధరణి పోర్టల్‌కు సంబంధించి జిల్లాలో మ్యుటేషన్‌లు, వారసత్వ సమస్యలు, నాలా కన్వర్షన్, సక్సెషన్, పీవోబీ సమస్యలు, పాసుపుస్తకాల్లో సవరణలు, కొత్త పాసుపుస్తకాల జారీలకు సంబంధించి 2,771 పెండింగ్‌ సమస్యలున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా ఖిలావరంగల్‌ మండలంలో 546, నెక్కొండలో 400 పెండింగ్‌ సమస్యలున్నాయి. పాసు పుస్తకాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. నమోదైన చిన్న తప్పిదాల సవరణలకూ అర్జీదారులు ఏళ్లుగా ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం పాసుపుస్తకాల్లో పేర్లు, చిరునామాల్లో మార్పులు వంటి తదితర చిన్న సమస్యలకు తహసీల్దార్ల పరిధిలోనే పరిష్కరించనున్నారు. రూ.5 లక్షల విలువ గల భూ సమస్యలు ఆర్డీఓ పరిధిలో, రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల్లోపు విలువైన భూ సమస్యలను కలెక్టర్, ఆపైన విలువైన భూ సమస్యలను సీసీఎల్‌ఏ పరిధిలో పరిశీలించనున్నారు.   

జిల్లాలో వివరాలు..

  • గ్రీవెన్స్‌ దరఖాస్తులు 501
  • మ్యుటేషన్‌ 259
  • వారసత్వ సమస్యలు 292
  • పాసుపుస్తకాలు లేని నాలా 100
  • కోర్టు కేసులు- పాసు పుస్తకాలు 369
  • ఖాతా మెర్జింగ్‌ 12
  • పాసుపుస్తకాలు నాలా 36
  • పాసుపుస్తకాల్లో సవరణలు 895
  • నిషేధిత భూములవి 280
  • ఇతర సమస్యలు 27

రైతుబంధు నిలిచిపోయింది..

- భానుప్రసాద్, రామగోపాలపురం, ఖిలావరంగల్‌

 గ్రామ శివారులో 282/బి2/1 సర్వే నంబరులో 18.5 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి పట్టా పాసుపుస్తకం ఉంది. ఏడాది క్రితం వరకు రైతుబంధు బ్యాంకు ఖాతాలో పడేది. భూమి నిషేధిత జాబితాలో పడటంతో.. ప్రస్తుతం నిలిచిపోయింది. విచారణ జరిపి నిషేధిత జాబితా నుంచి మా భూమిని తొలగించాలని ఏడాదికాలంగా స్థానిక తహసీల్దార్‌ చుట్టూ తిరుగుతున్నాం.

సమీక్షలు నిర్వహిస్తున్నాం..

- సంధ్యారాణి, జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)

జిల్లాలో ధరణి పెండింగ్‌ సమస్యలకు సంబంధించి నిషేధిత భూములు, పాసు పుస్తకాల్లో సవరణలు, వారసత్వ సమస్యలు, మ్యుటేషన్లు తదితర సంబంధిత కేసులున్నాయి. ఎప్పటికప్పుడు మండలస్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ల ద్వారా ధరణి సమస్యలపై చర్చిస్తున్నాం. ధరణి పెండింగ్‌ సమస్యలను వారంలోగా పరిష్కరించేందుకు.. నిరంతరం సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు