logo

అమ్మ చేతి వంటలా.. పోషకాలు మెండుగా!

పాఠశాలకు వెళ్తున్న తమ పిల్లలకు మధ్యాహ్న భోజనం (లంచ్‌ బాక్స్‌) ఏం సిద్ధం చేయాలనేది తల్లులకు పెద్ద సమస్య.. కొన్ని సందర్భాల్లో పిల్లలకు ఇష్టం లేని.. పోషకాలు లేని ఆహారాన్ని అప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తారు.

Updated : 23 Jun 2024 06:13 IST

పిల్లల మధ్యాహ్న భోజనం తయారీలో జాగ్రత్తలు అవసరం

పాఠశాలకు వెళ్తున్న తమ పిల్లలకు మధ్యాహ్న భోజనం (లంచ్‌ బాక్స్‌) ఏం సిద్ధం చేయాలనేది తల్లులకు పెద్ద సమస్య.. కొన్ని సందర్భాల్లో పిల్లలకు ఇష్టం లేని.. పోషకాలు లేని ఆహారాన్ని అప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తారు. దాంతో ఆ రోజు పిల్లలు ఇష్టంగా తినకపోగా తరగతి గదిలో పాఠాలు సైతం సరిగా వినలేరు.. మరోవైపు రోజువారీగా సమపాళ్లలో అందాల్సిన పోషకాలు దూరమవుతాయి. పిల్లల మంచి భవిష్యత్తే కాదు.. వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని లంచ్‌బాక్స్‌ సిద్ధం చేయాలి. 

ఈనాడు, మహబూబాబాద్‌

మధ్యాహ్న భోజనం చేసి అరటిపండును తింటున్న ఈ విద్యార్థి మహబూబాబాద్‌ పట్టణంలోని ఏకశిల ఏంజెల్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ప్రీతమ్‌.  రోజుకో పండును పాఠశాలకు తెచ్చుకుంటాడు. యాపిల్, జామ, కమలా, దానిమ్మ, ద్రాక్ష, అరటి పండ్లతో పాటు డ్రైఫ్రూట్స్‌ ఉండేలా  మా అమ్మ లంచ్‌బాక్స్‌ను సిద్ధం చేస్తుంది అని చెప్పాడు.

కలిసి తింటే ఆనందం..

మహబూబాబాద్‌లోని ఓ పాఠశాలలో కలిసి భోజనం చేస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థులు.. ఒంటరిగా కాకుండా తోటి మిత్రులతో కలిసి భోజనం చేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. దీంతో వారి మధ్య స్నేహబంధం  బలపడుతుంది. కబుర్లు చెప్పుకొంటూ భోజనం ఇష్టంగా తింటారు.

ఇవి తప్పనిసరిగా ఉండాలి..

ఎదుగుతున్న పిల్లలకు పోషకాహారం ఎంతో ముఖ్యం. తల్లిదండ్రులు వాటి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుని ఇంట్లోనే స్వయంగా తయారుచేయాలి. ప్రొటీన్‌ పదార్థాలకు పెద్దపీట వేయాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు  పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి..

ఉడికించిన గుడ్డు

రోజుకో ఉడికించిన గుడ్డును అందించాలి. దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఉడికించింది ఇష్టం లేనప్పుడు చపాతీలోకి కూర చేసి పంపించాలి.

చిరు ధాన్యాలతో

బీన్స్‌ కర్రీతో రోటీలు, దోశ, ఇడ్లీలు, లెమన్‌ రైస్, టమాట రైస్, చిరుధాన్యాలతో దోశ, ఇడ్లీ, పొంగల్, కిచిడీ పెట్టాలి.

పప్పులు

వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజుకో రకంగా చేసి పెట్టాలి. కొన్ని సార్లు ఆకుకూరలు, మరికొన్ని సార్లు టమాట, బీర, సొరకాయ లాంటి కూరగాయలతో కలిపి అందించాలి.

పీచు ఉండే పదార్థాలు

ఆహారంలో పీచు ఉండే కూరగాయలు, ఆకుకూరలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. క్యారెట్, బీన్స్, పల్లీలు, బఠాణీ ఇలా రోజుకో రకంగా పిల్లలకు ఇష్టం ఉన్న వాటిని తయారు చేసి పెట్టాలి. పెరుగన్నం కూడా పంపించాలి.

పండ్లు

తాజా పండ్లను ఇవ్వాలి. విరామ సమయంలో తినేందుకు పల్లీపట్టి, డ్రైఫ్రూట్స్, వివిధ రకాల గింజలతో చేసిన లడ్డూలు పెడితే మంచిది.

ఉపాధ్యాయులు పరిశీలిస్తే మేలు..

పిల్లలు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో వారందరూ పుష్టిగా.. ఇష్టంగా తింటున్నారా..లేదా.. అని ఉపాధ్యాయులు పరిశీలించాలి. ఆ సమయంలో వారు తెచ్చుకుంటున్న ఆహారపదార్థాల్లో పోషకాలు ఉన్నాయా.. లేదా  చూడాలి. తెచ్చుకున్న భోజనాన్ని పూర్తిగా తినేలా ప్రోత్సహించాలి.

వీటికి అనుమతి లేదు..

పిల్లలను ఆకర్షించే జంక్‌ఫుడ్‌లో శరీరానికి హాని చేసే క్యాలరీలే ఎక్కువగా ఉంటాయి. అందులో ఉండే మసాలా, ఉప్పు చాలా ప్రమాదం. చిన్న వయసులోనే వ్యాధులు చుట్టుముడుతాయి. ఉమ్మడి జిల్లాలోని కొన్ని పాఠశాలల నిర్వాహకులు విద్యార్థులు బడి ఆవరణలోకి అడుగు పెట్టిన వెంటనే వారి వద్ద బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ఇంకా జంక్‌ఫుడ్‌ వంటివి ఉన్నాయా పరిశీలిస్తున్నారు. పిల్లల ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలను పంపించొద్దంటూ తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని కొన్ని పాఠశాలల వారు పిల్లల డైరీల్లో రోజు వారీ హోంవర్క్‌తో పాటు పోషక విలువలతో కూడిన ఆహారం, విరామ సమయంలో తినడానికి పండ్లు ఉండేలా చూసుకోవాలని రాసి పంపిస్తున్నారు.

3,433 ప్రభుత్వ పాఠశాలలు.. 1.89 లక్షల మంది విద్యార్థులు: ఉమ్మడి జిల్లాలో 3,433 ప్రభుత్వ పాఠశాలల్లో 1,89,761 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ప్రతి రోజు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వమే అందిస్తోంది. వారంలో మూడు సార్లు ఉడికించిన గుడ్డు ఇస్తున్నారు. కొన్ని చోట్ల వారంలో ఒకరోజు గుడ్డుకు బదులు అరటి పండు అందిస్తున్నారు.


ఆకు కూరలు మేలు..

- శ్రీధర్, డోర్నకల్‌

మా పాప సువిధ 4వ తరగతి చదువుతోంది. నేనే మధ్యాహ్న భోజనం పట్టుకొస్తా.  ఆకు కూరల భోజనం అంటే మా పాపకు చాలా ఇష్టం. నెలలో రెండు రోజులు మాంసాహారంతో తినిపిస్తా.  పోషక విలువలు కలిగిన ఆకు కూరలతో కూడిన భోజనం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవు.


‘స్టీల్‌’ సామగ్రినే ఉపయోగిస్తాం

- మోనికాజైన్, గృహిణి, డోర్నకల్‌

మా పిల్లలకు ప్రతి రోజు పోషకాలతో కూడిన ఆహారాన్ని పంపిస్తున్నాం. విరామ సమయంలో తినడానికి పండ్లు జతచేస్తున్నాం.  ఆహారం కోసం ‘స్టీల్‌’ టిఫిన్‌ బాక్సులు, తాగునీటికి స్టీల్‌ సీసాలు  వాడుతున్నాం.

డోర్నకల్‌


తల్లులకు రోజువారీగా ప్రణాళిక ఉండాలి..

- డా.ఆర్‌.అరుణ్‌జ్యోతి, శాస్త్రవేత్త (హోంసైన్స్‌), కేవీకే, మామునూరు

ఆరోగ్యానికి హాని చేసే జంక్‌ఫుడ్‌కు అందరూ దూరంగా ఉండాలి. పాఠశాలకు పంపించే లంచ్‌బాక్స్‌లో పిల్లలకు ఇష్టమైన పోషక విలువలున్న ఆహారాన్ని ప్యాక్‌ చేయాలి. తల్లులు రోజువారీ  మెనూ ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రాధాన్య క్రమంగా బాక్స్‌లో పెట్టాలి. అప్పుడే వారికి అవసరమైన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటూ చదువులో రాణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని