logo

ప్రతి నెలా రెండుసార్లు జాబ్‌ మేళా

నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా కార్పొరేట్‌ సంస్థలు కల్పించే అవకాశాలను, ప్రభుత్వం నిర్వహించే జాబ్‌ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య అన్నారు.

Published : 24 Jun 2024 02:29 IST

జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య

నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా కార్పొరేట్‌ సంస్థలు కల్పించే అవకాశాలను, ప్రభుత్వం నిర్వహించే జాబ్‌ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య అన్నారు. నైపుణ్యాన్ని పెంచుకుంటే ఉద్యోగాలు సాధించడం సులువేనని పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధి కార్యాలయం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు చేస్తున్న కృషి, ఇప్పటి వరకు జిల్లాలో ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు.. తదితర అంశాలపై  ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఇలా ఉన్నాయి..  

న్యూస్‌టుడే, హనుమకొండ కలెక్టరేట్, రంగంపేట 

ప్ర: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు?
జ: ప్రైవేటు రంగంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రతి నెలా రెండు జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్, వరంగల్‌లోని పలు ప్రైవేటు సెక్టార్‌ కంపెనీలను ఇక్కడికి రప్పిస్తున్నాం. అందులో ఎంపికైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కూడా తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అవకాశం కల్పిస్తున్నాం. 

ప్ర:జిల్లాల విభజన తర్వాత ఎన్ని జాబ్‌మేళాలు నిర్వహించారు?
జ:జిల్లాలు విభజించినప్పటి నుంచి ఇప్పటి వరకు 82 జాబ్‌ మేళాలు నిర్వహించాం. దాదాపు 144 కంపెనీలు పాల్గొన్నాయి. 1384 మందికి ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాం. 

ప్ర:ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరుద్యోగులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారా? 
జ:జాబ్‌ మేళాకు వచ్చిన వారికి, దరఖాస్తు చేసుకున్న వారికి చరవాణిల ద్వారా సందేశం ఇస్తున్నాం. కళాశాలల్లో విద్యార్థులకు, ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. కార్పొరేట్‌ సంస్థల్లో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి వివరిస్తూ.. ఎంపికలకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో తెలియజేస్తున్నాం.

ప్ర: జిల్లాలోని స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల్లో ఇప్పటి వరకు ఎందరు శిక్షణ పొందారు?
జ:కొవిడ్‌-19కు ముందు ప్రధానమంత్రి కౌసల్‌ వికాస్‌ యోజన కింద నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ ఇప్పించాం. ప్రస్తుతం నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ అనేది డీఆర్‌డీఏ నిర్వహిస్తోంది. ప్రభుత్వం ఆదేశిస్తే మళ్లీ ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం.

ప్ర: ఎంప్లాయిమెంట్‌ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందా? 
జ:ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎంప్లాయిమెంట్‌ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే అదే రోజు కార్డులు జారీ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే 54 ఏళ్లు వచ్చే వరకు రెన్యువల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.  
ప్ర: నిరుద్యోగులకు మీరిచ్చే సందేశం ? 
జ:ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే వరకు ఎదురుచూడకుండా.. ప్రైవేటు రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు చేసి జీవితంలో స్థిరపడిన వారు అనేకమంది ఉన్నారు. నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేటు రంగంలో కూడా రాణించవచ్చు. ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా ఇస్తున్న ఉపాధి, నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని