logo

ధరణి సమస్యల పరిష్కారం వైపు అడుగులు!

రెవెన్యూ శాఖలో భూరికార్డుల ప్రక్షాళన తర్వాత గత ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. భూసమస్యలన్నీ వేగంగా పరిష్కరించడానికి, మధ్యవర్తుల ప్రమేయం..

Published : 24 Jun 2024 02:33 IST

పోర్టల్‌పై సిబ్బందికి సూచనలిస్తున్న బచ్చన్నపేట తహసీల్దార్‌ విశాలాక్షి(పాత చిత్రం) 

జనగామ టౌన్, న్యూస్‌టుడే: రెవెన్యూ శాఖలో భూరికార్డుల ప్రక్షాళన తర్వాత గత ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. భూసమస్యలన్నీ వేగంగా పరిష్కరించడానికి, మధ్యవర్తుల ప్రమేయం.. అధికారుల వద్ద జాప్యం లేకుండా తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు దీనిని ప్రారంభించింది. అయితే ఇందులో రిజిస్ట్రేషన్ల మాట అటుంచి ఇతరత్రా భూ సమస్యలు వస్తే నేరుగా కలెక్టర్‌ లాగిన్‌లోనే క్లియర్‌ చేయాల్సి రావడంతో పెద్ద ఎత్తున పేరుకుపోయి, యజమానులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణిలో పేరుకుపోయిన పెండింగ్‌ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటోంది. అమలు విధానంపై రాష్ట్ర స్థాయిలో కమిటీ నియమించింది.

ఆర్డీవోలు, తహసీల్దార్లకూ లాగిన్లు..

గతంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏ చిన్న సమస్య కూడా జిల్లా కలెక్టర్‌ స్థాయిలోనే క్లియరెన్స్‌ ఇచ్చే విధంగా ఉండటంతో, తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు సమస్యలు పేరుకుపోయాయి. కొత్త ప్రభుత్వం పోర్టల్‌లో కొన్ని మార్పులు చేసింది. ఆర్డీవోలు, తహసీల్దార్లకు కూడా పరిష్కరించే అధికారం ఇచ్చి లాగిన్‌ అవకాశం కల్పించింది. ముఖ్య అధికారాలను కలెక్టర్‌కు అప్పగించింది. తహసీల్దార్‌ పరిధిలో ఆధార్‌కార్డు, పేరు, కులం, స్త్రీ, పురుషులు, తండ్రి పేర్ల వంటి తప్పుల సవరణ, వారసత్వం, జీపీఏ(పాస్‌బుక్‌ ఉంటే), ఖాతానెంబర్‌ విలీనం వంటివి ఎమ్మార్వోకు ఇచ్చారు. పాస్‌బుక్‌ లేకుండా నాలా కన్వర్షన్, భూసేకరణతో వచ్చే సమస్యలు, మిస్సింగ్‌ సర్వే నెంబర్, ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన భూసమస్యలు ఆర్డీవో పరిధిలో అవకాశం కల్పించారు. పెండింగ్‌ మ్యుటేషన్లు, పాస్‌బుక్‌ లేకుండా అసైన్డ్‌ భూములు, వారసత్వం, పట్టాదారు పాస్‌పుస్తకాలు, కోర్టు కేసులు తదితర సమస్యలన్నీ జిల్లా కలెక్టర్‌ లాగిన్‌లో ఉంచారు.

నిమగ్నమైన అధికారులు..

మార్చి 1 నుంచి జిల్లాలో ‘ధరణి’ పెండింగ్‌ సమస్యలను పరిశీలించే ప్రక్రియ ప్రారంభించారు. అయితే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వారం రోజులకే ఆగిపోయింది. సుమారు రెండు నెలల తర్వాత కోడ్‌ ముగిసాక, ఈ నెల నుంచే అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరు లోపు పెండింగ్‌ ఫైళ్లు పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పెండింగ్‌ ఫైళ్లు క్లియర్‌ చేయడమో, తిరస్కరించడమో మొత్తానికి డిస్పోజల్‌ కావాలనే నిబంధనలతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో చిన్న తప్పులున్నా, క్షేత్ర స్థాయిలో తిరస్కరణకు గురవుతున్నాయని పలువురు భూయజమానులు, రైతులు వాపోతున్నారు. పరిష్కరించాలని కోరుతున్నారు. 

40 శాతం పూర్తి చేశాం.. 

రోహిత్‌సింగ్, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)

జిల్లాలో చేపట్టిన ధరణి పెండింగ్‌ సమస్యల పరిష్కారం వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే 40 శాతం మేరకు ఫైళ్లను క్లియర్‌ చేశాం. మరో వారం రోజుల్లోపు మిగతావి పరిష్కరిస్తాం. ప్రభుత్వ భూములు, ఇనామ్‌ భూముల వంటి వాటికి దరఖాస్తులు చేసుకుంటే తిరస్కరిస్తున్నాం. పేరు మార్పు, పురుషులు, మహిళల పేర్లు తప్పులుగా ఉన్నవి ఎక్కువగా వస్తున్నాయి. త్వరితగతిన తీరుస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని