logo

మహిళ దారుణ హత్య

భార్యాభర్తల మధ్యలో వచ్చిన మనస్పర్థలు, గొడవలను ఆసరాగా చేసుకొని పంచాయతీ పెద్ద మనిషిగా వచ్చిన వ్యక్తి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు.

Published : 24 Jun 2024 02:35 IST

న్యాయం చేయాలంటూ నిందితుడి ఇంటి ముందు ధర్నా 

 మంజుల (పాతచిత్రం)  

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: భార్యాభర్తల మధ్యలో వచ్చిన మనస్పర్థలు, గొడవలను ఆసరాగా చేసుకొని పంచాయతీ పెద్ద మనిషిగా వచ్చిన వ్యక్తి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. తర్వాత గొంతు నులిమి హత్య చేశాడని ఆమె బంధువులు నిందితుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, మృతురాలు బంధువులు తెలిపిన కథనం మేరకు.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ తిరుమలనంద కాలనీకి చెందిన మంజులకు 2005లో హనుమకొండ నాగేంద్రనగర్‌కు చెందిన అశోక్‌తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అశోక్‌ కూలీగా, మంజుల కోర్టు స్వీపర్‌గా పని చేస్తున్నారు. వీరి మధ్య గొడవలు రావడంతో వేరుగా ఉంటున్నారు. సర్దిచెప్పడానికి పంచాయతీ పెద్ద మనిషిగా వచ్చిన అదే కాలనీకి చెందిన వక్కల వెంకటస్వామి మంజులకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకొని, గత రెండేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ నెల 21న రాత్రి మంజుల, వెంకటస్వామితో చరవాణిలో ఏదో విషయమై ఘర్షణ పడ్డారు. కొద్దిసేపటికి వెంకటస్వామి ఆమె ఇంటికి వచ్చి ఆమెను గొంతు నులిమి చంపాడు. ఇంట్లో నిద్రిస్తున్న మంజుల పిల్లలు ఈ ఘటనను చూడడంతో ఎవరికైనా చెబితే మిమ్మల్ని కూడా చంపుతానని వెంకటస్వామి వారిని బెదిరించాడు. పిల్లలు తాతయ్య (మంజుల తండ్రి) రంగయ్యకు సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం హత్యా నేరం కింద కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితుడు వెంకటస్వామి పరారీలో ఉన్నాడు. 

నిందితుడి ఇంటి ముందు ధర్నా 

మృతురాలి కుటుంబానికి న్యాయం చేయలంటూ నాగేంద్రనగర్‌లోని నిందితుడు వక్కల వెంకటస్వామి ఇంటి ముందు బంధువులు ఆదివారం రాత్రి ధర్నాకు దిగారు. నిందితుణ్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణరెడ్డి సిబ్బందితో వెళ్లి సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. అర్ధరాత్రి వరకు కూడా అక్కడే బైఠాయించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని