logo

నీరందేనా.. పంట పండేనా..?

వానాకాలం ప్రారంభమైంది. రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. ఎక్కువగా చెరువులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తుండగా తాడ్వాయి మండలంలో చాలా చెరువులు సాగుకు యోగ్యంగా లేవు.

Published : 24 Jun 2024 02:40 IST

ఇది మేడారంలోని శివరాంసాగర్‌ చెరువు. గతేడాది వర్షాలకు మత్తడి కొట్టుకుపోయి చెరువులోని నీరంతా దిగువకు వెళ్లింది.
మత్తడికి మరమ్మతులు జరిగితేనే ఇందులో నీరు నిలిచి ఈ ఏడాది పంటలు సాగవుతాయి.

తాడ్వాయి, న్యూస్‌టుడే: వానాకాలం ప్రారంభమైంది. రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. ఎక్కువగా చెరువులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తుండగా తాడ్వాయి మండలంలో చాలా చెరువులు సాగుకు యోగ్యంగా లేవు. తూములకు లీకేజీలు, శిథిలావస్థల్లో మత్తళ్లు, కట్టకు బుంగలు పడటం, షట్టర్లు తుప్పుపట్టడం, కాల్వలు కొట్టుకుపోవడం తదితర సమస్యల కారణంగా తటాకాల్లో నీరు నిలిచే పరిస్థితి లేదు. నిధుల లేమి కారణంగా మరమ్మతులు చేయడం లేదు. దీంతో చెరువుల కింద సేద్యం ఈ సారి కష్టంగానే ఉండనుంది. 

పంట కాలువలు నిర్మించాలి 

మిషన్‌ కాకతీయ పథకంలో మండలంలోని చాలా తటాకాలకు మరమ్మతులు చేయించారేగానీ, పంట కాలువలను ఆధునికీకరించలేదు. ఫలితంగా చివరి భూములకు నీరందడం లేదు. పంట కాలువల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా.. నిధులు మంజూరు కావడం లేదు. అన్నదాతలు చాలాసార్లు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు, ప్రజాప్రతినిధులకు  వినతులు సమర్పించినా.. ఫలితం శూన్యం. బీరెల్లిలోని ఊర చెరువుకు 300 మీటర్ల మేర కాలువ నిర్మిస్తేనే ఉపయోగం. తక్కళ్లపాడు, జిన్నెలచెరువు, కుమ్మరికుంటలకు పంట కాలువలు నిర్మించాల్సి ఉంది.

ప్రతిపాదనలు పంపించాం..: సదయ్య, డీఈఈ, నీటిపారుదల శాఖ

రెండేళ్లుగా సాధారణ వర్షపాతం మించి నమోదు కావడంతో.. చెరువుల కట్టలు, మత్తడి, తూములకు సమస్యలు ఏర్పడ్డాయి. అన్ని చెరువులను సందర్శించి సమస్యలను గుర్తించాం. అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. చక్కరతోగు ప్రాజెక్టు పనులు పొందిన గుత్తేదారుపై ఒత్తిడి తీసుకొచ్చి రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తాం. నర్సాపురం గౌరారం వాగు చెక్‌ డ్యాం టెండరు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుంది.

లీకేజీలతో నీరంతా వృథా.. 

నర్సింగాపురం కాంభోజ చెరువు, మేడారం శివరాంసాగర్‌ చెరువు, నార్లాపురం తక్కళ్లపాడు చెరువుల తూములకు లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ మూడింటి కింద సుమారు 1,200 ఎకరాలు సాగవుతోంది. వీటి షట్టర్లు పనికిరాకుండా ఉన్నాయి. తూముల పక్కనే రంధ్రాలు ఏర్పడి నీరంతా వృథాగా పోతోంది. అడవుల నుంచి వచ్చే వాగులతో నీటి లభ్యత ఉన్నప్పటికీ ఫలితంగా లేకుంది.

నిధులున్నా.. నిష్పలం

తూములకు మరమ్మతు చేయాల్సిన గౌరారం వాగు చెక్‌ డ్యాం 

కొన్నిచోట్ల నిధులు లేక పనులు చేపట్టకపోగా, మరికొన్ని చోట్ల నిధులున్నా చేయడం లేదు. నర్సాపురం గౌరారం వాగు చెక్‌డ్యాం మరమ్మతులకు రూ.25 లక్షలు మంజూరయ్యాయి. టెండరు నిర్వహణ జాప్యంతో పనులు మొదలు కాలేదు. ఈ ఆనకట్ట, తూము, షట్టర్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. బయ్యక్కపేటలోని చక్కెరతోగు ప్రాజెక్టు మరమ్మతులకు రూ.19 లక్షలు మంజూరుకాగా, గుత్తేదారు పనులు ప్రారంభించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని