logo

అభివృద్ధి పనులకు నిధులేవి?

మహబూబాబాద్‌ పురపాలక సంఘంలో మౌలిక వసతుల కల్పనకు గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50 కోట్ల ఎస్‌డీఎఫ్‌ నిధుల వరంగా భావించారు పట్టణ ప్రజలు.

Published : 24 Jun 2024 02:50 IST

మహబూబాబాద్, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ పురపాలక సంఘంలో మౌలిక వసతుల కల్పనకు గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50 కోట్ల ఎస్‌డీఎఫ్‌ నిధుల వరంగా భావించారు పట్టణ ప్రజలు. ఆ పనుల ఎంపికలో జాప్యం... సకాలంలో ప్రారంభించకపోవడం శాపంగా మారింది. కొత్త ప్రభుత్వం హయాంలో ఎస్‌డీఎఫ్‌లో మంజూరైన నిధులతో ప్రారంభం కాని పనులను నిలిపివేయాలంటూ ఇచ్చిన సంకేతాలతో అధికారులు ఆ పనులను అలాగే వదిలివేశారు. దీంతో పట్టణాభివృద్ధి కుంటుపడింది. మహబూబాబాద్‌ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం ఉదయం 10.30 గంటలకు కార్యాలయంలో నిర్వహిస్తున్న క్రమంలో ఈ అభివృద్ధి పనులపై చర్చ సమగ్రంగా జరిగి  నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకోవాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

నిలిచిపోయిన పనులు

పట్టణంలోని 36 వార్డుల్లో ఒక్కో వార్డుకు రూ. 50 లక్షల చొప్పున రూ. 18 కోట్ల నిధులను స్థానిక సమస్యల పరిష్కారానికి కేటాయించారు. మిగిలిన రూ. 32 కోట్ల నిధులను జిల్లా కేంద్రంలోని వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాదించారు. కళాక్షేత్రం, స్టేడియం, మినీ ట్యాంక్‌బండ్, తహసీల్దార్‌ కార్యాలయం భవనం, వరద కాలువల నిర్మాణాలకు కేటాయించారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య సమన్వయం కుదరక కొన్ని, నేతల మధ్య సమన్వయం లోపించి మరికొన్ని పనులను ప్రతిపాదించడం వల్ల వివాదాలు నెలకొని ఎంపికలో ఏడాదిపాటు జాప్యం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడం, ప్రభుత్వం మారిపోవడంతో అప్పటికే నిబంధనల మేరకు ప్రారంభించిన పనులకు మాత్రమే ఆమోదం లభించడంతో సుమారు రూ. 40 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులు నిలిచిపోయాయి. నిలిపివేసిన ఆ నిధులను వస్తేనే పట్టణంలో చాలా వరకు సమస్యలకు పరిష్కారం లభించనుంది.

పూర్తయినవాటికి బిల్లులు చెల్లించాలి

ఎస్‌డీఎఫ్‌ నిధుల పరిస్థితి ఇలా ఉంటే అప్పటికే టీయూఎఫ్‌ఐడీసీ,  పట్టణ ప్రగతి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సీడీపీ నిధులతో పూర్తి చేసిన పనులకు ఏడాది దాటినా బిల్లులు చెల్లించలేదు. సుమారు రూ. నాలుగు కోట్లకు పైగా నిధులు వస్తేనే మిగిలిన పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు.

  • ఆరేళ్ల కిందట ప్రారంభించిన పురపాలక సంఘం భవన నిర్మాణం పూర్తి చేయించేందుకు నిధులను విడుదల చేయించాలి.
  • ప్రత్యేక నిధులతో రూ. ఏడు కోట్ల నిధులతో చేపట్టిన కూరగాయల మార్కెట్‌ దుకాణ సముదాయ పనులు పూర్తి చేయించాలి.
  • వరద కాలువల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.
  • ఐదేళ్లుగా కొనసాగుతున్న నెహ్రూచౌరస్తా పత్తిపాక రహదారుల విస్తరణ పనులను పూర్తి చేయించాలి.

అధ్వానంగా అంతర్గత రహదారి

ఈ అంతర్గత రహదారి అంబేడ్కర్‌ కాలనీలోని రాజబోయిన లచ్చయ్య ఇంటి నుంచి దుప్పటి దర్గయ్య ఇంటి వరకు వెళుతుంది. యాభైకి పైగా గృహాలు ఉన్న ఈ ప్రాంతంలో మట్టిపై రోడ్డుపై నడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఎస్‌డీఎఫ్‌ నుంచి సుమారు రూ. 5 లక్షలు కేటాయించారు. టెండర్లు పూర్తయిన నిర్మాణ పనులు  ప్రారంభించలేదు. ప్రారంభించకుంటే నిలిపివేయాలని కొత్త ప్రభుత్వం ఆదేశించడంతో అంతర్గత రహదారికి మోక్షం లభించడం లేదు. దీంతో ఆ ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

దారి పొడవునా బురదే.. 

తాళ్లపూసపల్లి ప్రధాన రహదారి నుంచి 23 వార్డు పరిధిలోని శ్రీరాంభద్రన్న కాలనీ, మిల్ట్రీ కాలనీ, జర్నలిస్ట్‌ కాలనీ వెళ్లే అంతర్గత రహదారి ఇది. ఎస్‌డీఎఫ్‌ నుంచి మంజూరైన నిధులతో సీసీ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. రూ. 50 లక్షల ప్యాకేజీలో రోడ్డు నిర్మించాలనుకుంటున్న సమయంలో కొత్త ప్రభుత్వం పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే రూ. పది లక్షల అంచనా వ్యయంతో వేర్వేరుగా రెండు ప్రాంతాల్లో రహదారి నిర్మాణం పూర్తి చేశారు. ఈ రహదారి పనులు ప్రారంభించకపోవడంతో నిధులు నిలిచిపోయాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు  ప్రారంభిస్తాం

నోముల రవీందర్, కమిషనర్, పురపాలక సంఘం.

నిలిచిపోయిన ఎస్‌డీఎఫ్‌ ద్వారా చేపట్టాల్సిన పనులను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభిస్తాం. ఇప్పటికే ఆ పథకం ద్వారా వివిధ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, సీసీ డ్రైయిన్‌ల నిర్మాణం జరిగింది. నిలిచిపోయిన పనుల విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికీ తీసుకెళ్లాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని