logo

మహిళా సంఘాలకు.. వడ్డీ జమ

మహిళా సంఘాలు ఊరట చెందేలా రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.. 2023-24 సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలు చెల్లించిన రుణాల వడ్డీని తిరిగి వారి ఖాతాలో జమ చేసింది.

Published : 24 Jun 2024 03:02 IST

స్వయం సహాయక సంఘం సభ్యుల సమావేశం (పాతచిత్రం) 

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌: మహిళా సంఘాలు ఊరట చెందేలా రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.. 2023-24 సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలు చెల్లించిన రుణాల వడ్డీని తిరిగి వారి ఖాతాలో జమ చేసింది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో రూ.37.65 కోట్లను మహిళా సంఘాల ఖాతాల్లో వేశారు. అతివలు ఆర్థికంగా ఎదగడానికి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా ఏటా ప్రణాళిక ప్రకారం రుణాలు అందిస్తోంది. వాయిదాల ప్రకారం మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా కొంత అసలు, వడ్డీ చెల్లించాలి. పేద మహిళలకు వడ్డీ భారం కావొద్దనే ఉద్దేశంతో ప్రతి నెలా సక్రమంగా చెల్లించిన స్వయం సహాయక సంఘాల సభ్యుల ఖాతాలో ప్రభుత్వం తిరిగి వడ్డీ జమ చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్నేళ్లుగా వడ్డీ చెల్లింపులు నిలిచిపోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.కోట్లల్లో బకాయి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో మహిళా సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

35 వేల సంఘాలకు 

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లాల్లోని 35,501 స్వయం సహాయక సంఘాలకు రూ.37.65 కోట్ల వడ్డీ జమ చేశారు. ఏటా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు వందల కోట్లు రుణాలు అందిస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రభుత్వం వడ్డీ చెల్లింపుల్లో జాప్యం చేయడంతో మహిళా సంఘాల సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త ప్రభుత్వం నాలుగు నెలల వడ్డీ రాయితీ ప్రకటించింది. గతంలో ప్రభుత్వం పట్టించుకోలేదని.. మిగిలిన వడ్డీ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. ఇంకా చెల్లించాల్సింది రూ.కోట్లలో ఉంటుందని అంటున్నారు.. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో వడ్డీ జమ చేయాల్సి ఉంటుంది. 

ఖాతాల్లో వేశాం..

నరేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు పొంది నెలనెలా సక్రమంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ నిధులను సంబంధిత ఖాతాలో జమ చేశాం. ఇంకా పెద్ద మొత్తంలో వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే జమ చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని