logo

కొత్త గనుల తవ్వకాలకు చిక్కులు

గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం 2021 ప్రకారం సింగరేణిలో కొత్త గనుల తవ్వకాలకు చిక్కులు ఏర్పడుతున్నాయి.

Published : 24 Jun 2024 03:05 IST

భూపాలపల్లిలో నిరసన తెలుపుతున్న కార్మికులు, నాయకులు 

భూపాలపల్లి, న్యూస్‌టుడే: గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం 2021 ప్రకారం సింగరేణిలో కొత్త గనుల తవ్వకాలకు చిక్కులు ఏర్పడుతున్నాయి. ఈ చట్టంలో భూగర్భ గనులపై కేంద్ర ప్రభుత్వానికే పూర్తి అధికార బాధ్యతలని పేర్కొనడంతో సింగరేణిలో ప్రైవేటీకరణకు దోహదం చేసేవిధంగా ఉందని పలు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 2021 కంటే ముందు సింగరేణి ప్రాంతాల్లోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణి సంస్థకే నేరుగా ఎలాంటి వేలం లేకుండా కేటాయించేది. 2014 వరకు నిర్వహించిన వేలంలో సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను మినహాయించారు. ఆ తర్వాత 2016లో చట్టాన్ని సవరణ చేశారు. 2021లో కొత్త సవరణతో కూడిన బిల్లు  పార్లమెంటులో ఆమోదం పొందింది. దీని ప్రకారం ఇకపై ఏ కంపెనీ లేదా సంస్థకైనా బొగ్గు బ్లాక్‌లను వేలం ద్వారానే కేటాయించాల్సి ఉంటుంది. నేరుగా కేటాయించాలంటే 14 శాతం రాయల్టీ చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా 2022 నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు నిర్వహించిన వేలం పాటల్లో సింగరేణి సంస్థ పాల్గొన లేదు. సింగరేణి బ్లాక్‌ల అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తామని ప్రధానమంత్రి ప్రకటించినా.. రాష్ట్రంలో బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని మాత్రం  ఆపడం లేదు. 

ఉత్పత్తి వ్యయంలో...

ప్రైవేటు సంస్థలు తక్కువ వ్యయంతో బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారిస్తాయి. యాంత్రీకరణ, తక్కువ వేతనాలతో మానవ వనరులను సమకూర్చుకుంటాయి. వీటితో పోలిస్తే సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతనాల కారణంగా ఉత్పత్తి వ్యయం అధికం. దీనికి తోడు నేరుగా గనులను దక్కించుకోవాలంటే 14 శాతం రాయల్టీ చెల్లించాలి. దీంతో గనులు పొందినా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని సింగరేణి భావిస్తోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా బొగ్గు గనులకు వేలం ప్రారంభించడంతో సింగరేణి కార్మిక సంఘాలు నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తూ, వేలం పాట రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతంలోని శ్రావణపల్లి బ్లాక్‌ను ఈ వేలంలో చేర్చడంతో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

ఏడేళ్ల క్రితమే..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల బ్లాక్‌ను ఏడేళ్ల క్రితమే ప్రైవేటు సంస్థకు కేటాయించడంతో అప్పుడు సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 

సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం

మోటపలుకుల రమేష్, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి 

సింగరేణి బొగ్గు బ్లాక్‌లకు వేలం పాటలు నిర్వహించి ప్రైవేటు వ్యక్తులకే బొగ్గు తవ్వకాలు అప్పగిస్తే, సింగరేణి సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లనుంది. భాజపా స్వార్థం కోసం 110 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు గనులకు నష్టం జరగనుంది.

అసెంబ్లీలో తీర్మానం చేయాలి

కె.గట్టయ్య, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

సింగరేణి ప్రాంతాల్లోని బొగ్గు బ్లాక్‌లను వేలం వేయకుండా నిలుపుదల చేయాలని కోల్‌బెల్ట్‌ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. కేంద్ర ప్రభుత్వమే నేరుగా సింగరేణి సంస్థకు ఎలాంటి షరతులు లేకుండా గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వాలి. 

వేలం రద్దు చేయాలి

జోగ బుచ్చయ్య, ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు. భూపాలపల్లి

బొగ్గు బ్లాక్‌ల వేలం పాటలు వెంటనే రద్దు చేయాలి. గత భారాస ప్రభుత్వం వల్లనే సింగరేణిలో ప్రైవేటీకరణ మొదలైంది. సింగరేణి సంస్థకు పూర్తిగా నష్టం చేసిన భారాసకు కార్మికులు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు.  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బొగ్గు గనుల పర్యటన సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని