logo

జల సవ్వళ్లు.. ప్రమాదాల లోగిళ్లు!

ములుగు జిల్లా జలపాతాల ఖిల్లా... వర్షాకాలంలో కనువిందు చేస్తుండటంతో పర్యాటకులు తరలివస్తున్నారు..

Published : 24 Jun 2024 03:14 IST

జలపాతాల వద్ద రక్షణ చర్యలు చేపడితే మేలు

కుంటాల మాదిరి చేస్తే.. మేలు..: ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతం వద్ద పర్యాటకులు జలపాతం ప్రవాహం వైపు వెళ్లకుండా ఏర్పాటు చేసిన జాలి ఇది.. ఇలాంటివి మన ప్రాంతంలోని జలపాతాల వద్ద ఏర్పాటు చేయాలి. ప్రవాహం ఎక్కువ ఉన్న సమయంలో పర్యాటకులను వ్యూపాయింట్‌ వద్దకు మాత్రమే అనుమతి ఇస్తారు.  

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి:ములుగు జిల్లా జలపాతాల ఖిల్లా... వర్షాకాలంలో కనువిందు చేస్తుండటంతో పర్యాటకులు తరలివస్తున్నారు.. కొండల్లోంచి పాలనురగల్లాంటి నీటి బిందువులు జాలువారే దృశ్యాలు అబ్బురపరుస్తాయి.. పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి.. ఆనందంతో మైమరిచిపోతారు. కొందరు అత్యుత్సాహం చూపడంతో ప్రమాదాలకు గురవుతున్నారు.. ఏటా జలపాతాల వద్ద ఇటువంటి ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయే పరిస్థితి.. తాజాగా జలధారలు మొదలవడంతో పర్యాటకులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.. రక్షణపరంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో సూచిస్తూ కథనం..

 ఇవి బొగత జలపాతంలో అధికంగా ప్రమాదాలు జరిగిన ప్రాంతాలు.. రక్షణ సిబ్బంది కళ్లుగప్పి అటువైపు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.
తక్షణమే కంచె నిర్మించాలి. సూచికలు ఏర్పాటు చేయాలి.

ములుగు జిల్లాలో వాజేడు మండలంలోని బొగత జలపాతం, కొంగాల దుసపాటిలొద్ది, వెంకటాపురం మండలంలోని ముత్యంధార, ముత్తారం, గడిచెరువు తదితర జలపాతాలున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో భీముని పాదం జలపాతం సైతం వర్షాకాలంలో కనువిందు చేస్తుంది. ఇవన్నీ దట్టమైన అటవీ ప్రాంతాల్లో, గుట్టల్లో ఉన్నాయి. పర్యాటకులు సాహసం చేస్తూ వెళ్తున్నారు. సరైన మార్గాలు, వసతులు లేకపోవడం, సురక్షితం కాకపోవడంతో అటవీ అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లడం నిషేధించారు. కానీ, కొందరు చాటుమాటున ఇతర మార్గాల్లో అక్కడికి చేరుకుంటూ ప్రమాదాలకు గురవుతున్నారు. 

వీటికే అనుమతి..

బొగత, భీముని పాదం జలపాతాలకు వెళ్లేందుకే సందర్శకులు అనుమతి ఉంది. భారీ వర్షాలు, వరద లేని సమయాల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. అక్కడ అటవీ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పర్యాటకులను అప్రమత్తం చేస్తూ ప్రమాదాలను నివారిస్తున్నారు. 

వెంకటాపురం మండలం వీరభద్రవరంలో ముత్యంధార జలపాతం వద్దకు వెళ్లకుండా అటవీశాఖ అధికారులు ఇలా బోర్డులు, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇతర మార్గాల ద్వారా వెళ్తున్నారు. సీజన్‌లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి, నీళ్లలో దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మేలు..

కొంపముంతున్న సెల్ఫీలు

యువత ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం సాధారణంగా మారింది. జలపాతాల వద్ద జారికిందపడే బండలపై నిల్చుని, కొండ అంచుకు వెళ్లి ఫొటోలు, వీడియోలకు ఫోజులిస్తున్నారు. దీంతో ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. కొండ దిగువ ప్రాంతాల్లో లోతు అంచనా వేయకుండా పైనుంచి కిందకు దూకుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. 

వాజేడు-వెంకటాపురం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గడి చెరువు జలపాతం వద్ద ప్రమాదకరంగా ఫొటోలు దిగుతూ,
స్నానాలు చేస్తున్న పర్యాటకులు (పాతచిత్రం).. ఇక్కడ సిబ్బంది, రక్షణ చర్యలు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది.

ఈ చర్యలు చేపట్టాలి..

ఆదిలాబాద్‌లోని కుంటాల, ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్‌ జలపాతాలు, ఇతర ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మన ప్రాంతాల్లోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. నీళ్లలో దిగకుండా, ప్రవాహాల వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టాలి. అనుమతులు లేని జలపాతాల వద్దకు వెళ్లకుండా చూడాలి. ప్రత్యేక సిబ్బంది, నిత్యం గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలి. ప్రమాద ప్రాంతాల్లో, లోతు ప్రదేశాల్లో, అనుమతి లేని ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. 

వాజేడు మండలం దుసపాటిలొద్ది వద్ద గల్లంతైన వారి కోసం వలతో గాలిస్తున్న దృశ్యం(పాతచిత్రం)..
నీళ్లలో దిగకుండా కంచెలు ఏర్పాటు చేయాలి. సిబ్బంది పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలి.

గత సంఘటనలు ఇలా..

  • గతేడాది జులై 25న ములుగు జిల్లా వెంకటాపురం వీరభద్రవరం ముత్యంధార(జలపాతం) సందర్శనకు వెళ్లిన దాదాపు 84 మంది ఆ ప్రాంతంలో చిక్కుకున్నారు. మామాడిగండి వాగు ప్రవాహం అడ్డంకిగా ఉండటంతో అభయారణ్యంలోనే నిలిచిపోయారు. డయల్‌ 100 సమాచారంతో అప్రమత్తమైన జిల్లా పోలీస్‌ యంత్రాంగం రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు రక్షణ చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
  • 2022 అక్టోబర్‌ 23లో విజయవాడకు చెందిన కృష్ణ(27) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బొగత వద్ద నీళ్లలో మునిగి చనిపోయారు. అదే నెల 22న ముత్యంధార జలపాతంలో పడి హనుమకొండ జిల్లా కాజిపేటకు చెందిన హరి(32) అనే యువకుడు మృతిచెందాడు.  
  • రెండేళ్ల కాలంలో దుసపాటిలొద్ది జలపాతం వద్ద నలుగురు వ్యక్తులు మృతిచెందారు. 
  • బొగత వద్ద ఎనిమిదేళ్లలో దాదాపు 20 మంది వరకు మృత్యువాత పడ్డారు. 

నిషేధిత ప్రాంతాలకు వెళ్లొద్దు..

రాహుల్‌ కిషన్‌ జాదవ్, డీఎఫ్‌ఓ, ములుగు జిల్లా

వాజేడు మండలంలోని బొగత జలపాతానికి మాత్రమే పర్యాటకులను అనుమతిస్తున్నాం. మిగతా జలపాతాలన్నీ నిషేధిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. పర్యాటకులు అటువైపు వెళ్లవద్దు.. ఆ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధాన దారుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని