logo

క్రీడలపై నీలినీడలు!

ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 23న ‘అంతర్జాతీయ ఒలింపిక్‌ డే’ నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం ఆదేశాలతో ఆయా జిల్లాలకు చెందిన ఒలింపిక్‌ సంఘాలు వారి వీలునుబట్టి ‘ఒలింపిక్‌ డే’ పరుగు జరుపుతారు.

Published : 24 Jun 2024 03:17 IST

సంఘాల్లో వర్గ విభేదాలు.. ఒలింపిక్‌ పరుగు లేకపోవడంపై నిరుత్సాహం

గతంలో జరిగిన ఒలింపిక్‌ పరుగులో పాల్గొన్న క్రీడాభిమానులు 

ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 23న ‘అంతర్జాతీయ ఒలింపిక్‌ డే’ నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం ఆదేశాలతో ఆయా జిల్లాలకు చెందిన ఒలింపిక్‌ సంఘాలు వారి వీలునుబట్టి ‘ఒలింపిక్‌ డే’ పరుగు జరుపుతారు. కానీ! ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ ఏడాది ఆ ఊసేలేకుండా పోయింది. దీంతో క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువత తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం పరుగు ఉంటుందని వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాలకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు క్రీడాభిమానులు వచ్చారు. ఒలింపిక్‌ పరుగు లేదని తెలిసి నిరుత్సాహానికి గురయ్యారు. 

 వరంగల్‌ క్రీడావిభాగం,న్యూస్‌టుడే

రాష్ట్ర ఒలింపిక్‌ సంఘంలో..

క్రీడా రంగం ఎదుర్కొనే సమస్యలను ఒలింపిక్‌ సంఘం పరిష్కరిస్తుంటుంది. వివిధ క్రీడా సంఘాల సమస్యలు పరిష్కరిస్తూ.. వారి ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంత ప్రాధాన్యం కలిగిన ఒలింపిక్‌ సంఘంలో విభేదాలు తలెత్తాయి. రెండు నెలల క్రితం రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం పదవీకాలం ముగిసింది. దీంతో ఎన్నికలకు వెళ్తున్న విధానాన్ని ఓ వర్గం వ్యతిరేకించి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రాష్ట్రస్థాయిలో ఒలింపిక్‌ సంఘం రెండు వర్గాలుగా విడిపోయింది. 15రోజుల క్రితం న్యాయస్థానం స్టేటస్‌ కో విధించింది. దీంతో రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం ఆదేశాల మేరకు జిల్లాల ఒలింపిక్‌ సంఘాలు అంతర్జాతీయ ఒలింపిక్‌ డే సందర్భంగా నిర్వహించాల్సిన పరుగు నిలిపివేసినట్లు సమాచారం.
క్రీడాకారులకు శాపం: భవిష్యత్తులో కొత్తవారిని క్రీడల వైపు మళ్లించాలంటే ఆయా క్రీడా సంఘాల ఆధ్వర్యంలో నిరంతరం జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు జరగాలి. ఏడాది క్రీడా క్యాలెండర్‌ తయారు చేసి ఆ ప్రకారం పోటీలు నిర్వహించాలి. కొన్ని క్రీడా సంఘాలు ఫెడరేషన్‌ ప్రకటించిన విధానాన్ని పాటిస్తూ టోర్నీలు నిర్వహిస్తున్నాయి. కొన్ని క్రీడాంశాలకు చెందిన సంఘాలు వర్గాలుగా విడిపోయి కోర్టు మెట్లెక్కాయి. దీంతో గుర్తింపు కలిగిన సంఘం ఏదో తెలుసుకోవడం క్రీడాకారులకు కష్టంగా మారింది.
ః ఇటీవల హనుమకొండ, పైడిపల్లిలో ఒకే క్రీడకు సంబంధించి పోటీలు జరిగాయి. ఇదే క్రీడకు సంబంధించి మరో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. ఇలాంటి సమయంలో ఏవర్గం వారు నిర్వహిస్తున్న టోర్నీకి వెళ్లాలో క్రీడాకారులు తేల్చుకోలేకపోయారు. ఈ గందరగోళం మధ్య పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలకు దూరంగా ఉంచుతున్నారు. అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ విషయానికొస్తే హైదరాబాద్‌ క్రికెట్ సంఘం గుర్తింపు కలిగిన ‘వరంగల్‌ క్రికెట్ సంఘం’ వివిధస్థాయిల్లో పోటీలు నిర్వహిస్తోంది. మరో సంఘం టీసీఏ(తెలంగాణ క్రికెట్ సంఘం) ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం గమనార్హం. 

ఉమ్మడి జిల్లాలో ప్రతిభకు కొదవలేదు..

దేశం గర్వించదగ్గ క్రీడాకారులు ఉమ్మడి వరంగల్‌ జిల్లా సొంతం. ఇరిగేసి అర్జున్‌ పిన్న వయసులోనే చదరంగంలో గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించాడు. ప్రపంచ విజేత కార్ల్‌సన్‌తో పోటీ పడి సత్తా చాటాడు. ఒలింపియన్‌ వర్థినేని ప్రణీత(విలువిద్య), అర్జున అవార్డు గ్రహీత సిక్కిరెడ్డి(బ్యాడ్మింటన్‌), భారతస్టార్‌ అథ్లెటిక్స్‌ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్, ఈ ఏడాది పారిస్‌లో జరిగే పారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జీవన్‌జి దీప్తి ఇలా చాలా మంది ప్రతిభావంతులున్నారు. ప్రోత్సహిస్తే జాతీయ స్థాయిలో రాణించేవారు ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆటంకాలుగా మారుతున్నాయి.
నేతల జోక్యం: క్రీడా సంఘాల్లో రాజకీయ నేతల జోక్యం పెరిగిపోతోంది. మాజీ క్రీడాకారులు క్రీడా సంఘాల బాధ్యతలపై ఆసక్తి చూపకపోవడం దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని క్రీడా సంఘాల్లో 10, 20 ఏళ్లుగా ఒక్కరే ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లోదా కమిటీ సిఫార్సులను చాలా క్రీడా సంఘాలు పాటించడం లేదు. వరంగల్‌ క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు లోదా కమిటీ సిఫార్సుల మేరకు క్రికెట్ సంఘం ఎన్నికల్లో పోటీ చేయలేదు. క్రీడా రంగంలోకి, సంఘాల్లోకి కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం, సృష్టించడం చేయాల్సిన వారే నిబంధనలకు పాతర వేస్తున్నారని క్రీడా విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. 

వాయిదా వేశాం

కైలాస్‌యాదవ్, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి

 ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాం. క్రీడా రంగానికి, క్రీడాకారులకు అండగా ఒలింపిక్‌ సంఘం ఉంటుంది. రాష్ట్ర ఒలింపిక్‌ సంఘంలో తలెత్తిన సమస్యలు, కోర్టు ఆదేశాలతో ఒలింపిక్‌ డే పరుగు చేపట్టలేదు. ఈ నెల 29, 30న జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు జగదీష్‌యాదవ్‌ సమాచారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని