logo

అధ్యక్షా.. ఇదీ మా ఎజెండా!

18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated : 24 Jun 2024 06:37 IST

నేటి నుంచి లోక్‌సభ సమావేశాలు

18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన డాక్టర్‌ కడియం కావ్య, పోరిక బలరాంనాయక్‌ ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. కావ్య పార్లమెంటులో తొలిసారి అడుగుపెట్టబోతుండగా.. ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న బలరాంనాయక్‌ రెండోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇద్దరూ తమ నియోజకవర్గాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి పార్లమెంట్‌లో గళం విప్పి నిధులు సాధిస్తారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. రెండు స్థానాల పరిధిలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించడంలో కీలకంగా వ్యవహరి స్తారని ఆశాభావం ఉంది.

ఈనాడు, మహబూబాబాద్‌

అప్పుడు అధికార హోదా.. ఇప్పుడు ప్రతిపక్షంలో.. 

మహబూబాబాద్‌ స్థానానికి 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో పోరిక బలరాంనాయక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరడంతో మంత్రివర్గంలో కేంద్ర సామాజిక, సాధికారిత సహాయ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షహోదాలో పార్లమెంటులో అడుగుపెడుతున్నారు. గతంలో ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ప్రగతి పనులకు నిధులు తీసుకొస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.

నాడు తండ్రి.. నేడు కుమార్తె

వరంగల్‌ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ ఎంపీగా ఎన్నికైన డాక్టర్‌ కడియం కావ్య తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. ఆమె తండ్రి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 2014లో వరంగల్‌ నుంచి భారాస(తెరాస) ఎంపీగా గెలిచి కొద్ది రోజులు పని చేశారు. కడియం సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు తీసుకొచ్చేలా కుమార్తెకు సలహాలు ఇచ్చే అవకాశం ఉంది.

రైలు కూత పెట్టాలి

గతంలో మణుగూరు వరకు మూడు రైళ్లు నడిచేవి.. ప్రస్తుతం మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ ఒకటే నడుస్తోంది. సింగరేణి ఉద్యోగులు, పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. రద్దయిన రైళ్లను పునరుద్ధరించేలా చొరవ చూపాలి. పాండురంగాపురం నుంచి సారపాక వరకు కొత్త రైల్వేమార్గాన్ని పూర్తి చేయించడంపై దృష్టి సారించాలి.. కాజీపేట నుంచి ముంబయి, సూరత్‌ వెళ్లేందుకు కొత్త రైళ్ల సదుపాయం కల్పించాలి. కాజీపేట నుంచి తిరుపతికి కొత్త రైలు నడిచేలా చూడాలి. డోర్నకల్‌ జంక్షన్‌ నుంచి మణుగూరు వరకు సింగిల్‌ లైన్‌ను డబుల్‌గా విస్తరించాలి. మహబూబాబాద్, కాజీపేట స్టేషన్లలో అదనపు ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టాలి. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై దృష్టిసారించాలి. 

విమానాలు ఎగిరేలా..!

హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా పేరొందిన వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు ప్రస్తావన తెరపైకి వస్తుందే కానీ, ముందడుగు పడడం లేదు. ఇక్కడి నుంచి విమానాలు ఎగిరేందుకు ఎన్నో సానుకూలతలున్నాయి. మామునూరు పాత ఎయిర్‌ స్ట్రిప్‌లో అవసరమైన స్థలం ఉంది. అదనంగా స్థల సేకరణ చేసేందుకు అధికారులు గుర్తించారు. వీలైనంత త్వరగా విమానాలు ఎగిరేలా ఇద్దరు ఎంపీలు చొరవచూపాలి. వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి పర్యాటకుల రాకపోకలు పెరిగితే.. నగరం మరింత అభివృద్ధి చెందనుంది. 

 పర్యాటకం.. పరిశ్రమలపై..

ఉమ్మడి జిల్లాలో పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా మేడారం జాతరకు జాతీయహోదా వచ్చేలా గళం విప్పాలి. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ముడి సరకు లభ్యత గణనీయంగా ఉన్నా అందుకు తగినట్లుగా ఏర్పాటు లేదు. నిరుద్యోగులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. మన ప్రాంతంలో వనరుల ఆధారంగా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి.

జాతీయ రహదారుల అభివృద్ధి

ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారులకు కొదవలేదు. కొన్ని చోట్ల విస్తరించాల్సి ఉంది. ముఖ్యంగా జగిత్యాల నుంచి వరంగల్‌ మీదుగా ఖమ్మం వెళ్లే 563వ జాతీయ రహదారిని వరంగల్‌ నుంచి ఖమ్మం వరకు విస్తరించాల్సి ఉంది. నాగ్‌పూర్‌- విజయవాడ కారిడార్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే(163జీ)కు సంబంధించి భూపాలపల్లి నుంచి వరంగల్‌ జిల్లాలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి. కురవి- కోదాడ(365ఎ), గుడెప్పాడ్‌- మహారాష్ట్రలోని సికోలి(353సీ) రహదారుల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. 

మీరు కూడా దృష్టిసారించాలి..

కరీనంగర్‌ ఎంపీగా భాజపా నుంచి ఎన్నికైన బండి సంజయ్‌ మోదీ క్యాబినెట్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. భువనగిరి ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయన పరిధిలో జనగామ శాసనసభ స్థానం అభివృద్ధికి కృషి చేయాలి. పెద్దపల్లి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహదేవ్‌పూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లో సమస్యల పరిష్కారానికి నిధులు తీసుకురావాలి.

నిధులు తెచ్చేందుకు కలిసి పోరాడుతాం

పోరిక బలరాంనాయక్, ఎంపీ మహబూబాబాద్‌

రెండోసారి ఎంపీగా ఎన్నికైన నాకు గతంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా పనులు ఎలా చేయించుకోవాలో తెలుసు. ఆ అనుభవంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తా.. వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా నూతనంగా ఎంపీగా ఎన్నికైన కడియం కావ్యతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాను. ఇద్దరం ఒకే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున కలిసిపోరాడుతాం.

 సమస్యలపై గళం వినిపిస్తా : -డా.కడియం కావ్య, ఎంపీ, వరంగల్‌

వరంగల్‌ నియోజకవర్గంలోని ఓఆర్‌ఆర్, విమానాశ్రయం, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌ ఏర్పాటు దిశగా పనిచేస్తాను. ఇంకా కేంద్రం నుంచి ఏవైతే పనులకు నిధులు వస్తాయో వాటిని తీసుకురావడంపై దృష్టిసారిస్తాను. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుకు కృషి చేస్తా.. లోక్‌సభలో మాట్లాడేందుకు అవకాశం వచ్చినప్పుడల్లా సమస్యలను లేవనెత్తుతా. వృత్తిపరంగా వైద్యురాలిని కాబట్టి నియోజకవర్గంలో వైద్యసేవలు మెరుగుపర్చడానికి పెద్దపీట వేస్తాను. ముఖ్యంగా మహిళల ఆరోగ్య విషయంలో ప్రాముఖ్యత ఇస్తాను. ఎంజీఎం వైద్యశాలను మరింతగా తీర్చిదిద్దుతాను. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని