logo

భార్యను చంపి భర్త ఆత్మహత్య

వరంగల్‌ లేబర్‌కాలనీ (చెన్నారెడ్డి కాలనీ)లో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం స్థానికంగా విషాదాన్ని నింపింది.

Published : 10 Jul 2024 04:51 IST

అనాథలైన ముగ్గురు పిల్లలు

చరణ్, స్వప్న(పాతచిత్రం)

లేబర్‌కాలనీ, న్యూస్‌టుడే: వరంగల్‌ లేబర్‌కాలనీ (చెన్నారెడ్డి కాలనీ)లో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం స్థానికంగా విషాదాన్ని నింపింది. మిల్స్‌కాలనీ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మంద చరణ్‌ అలియాస్‌ చేరాలు(45).. భార్య స్వప్న(40)ను సోమవారం అర్ధరాత్రి రోకలిబండతో కొట్టి చంపి, మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చరణ్‌ భవన నిర్మాణ కార్మికుడిగా,  స్వప్న ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. వారికి కుమార్తెలు గ్రేసీ, మెర్సీ, కుమారుడు షాలోమ్‌ ఉన్నారు.  భార్యాభర్తల గొడవల కారణంగా మూడు మాసాలుగా చరణ్‌ ఇంటికి రావడం లేదు. ముందస్తు పథకం ప్రకారం సోమవారం ఇంటికి వచ్చిన చరణ్‌ సాయంత్రం పిల్లలను వరంగల్‌ ఉర్సు ప్రాంతంలోని స్వప్న పుట్టింటి వద్ద వదిలిపెట్టాడు. రాత్రి తిరిగి వచ్చాక భార్యతో గొడవపడి రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం గదిలో ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు పట్టుబడతానన్న భయంతో మంగళవారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉర్సు నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు విగతజీవులుగా ఉండటం చూశారు. ముగ్గురు పిల్లలు భోరుమని విలపించడం చూసిన స్థానికులు గుమికూడి 100కు డయల్‌ చేశారు. ఏసీపీ నందిరాంనాయక్, మిల్స్‌కాలనీ సీఐ మల్లయ్య ఘటనా స్థలికి చేరుకుని వారి మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరంలించారు. భార్యాభర్తల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు.  

రంగశాయిపేట: తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల దయనీయ పరిస్థితిని చూసి చలించిన సీఐ మల్లయ్య ముగ్గురు పిల్లలకు ఇంటర్మీడియట్‌ వరకు విద్య చెప్పించే బాధ్యతను తీసుకున్నారు.  స్వప్న సోదరుడు సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


తల్లిదండ్రుల గొడవలు.. పిల్లలకు శాపం

షాలోమ్, గ్రేసీ, మెర్సీ

అమ్మానాన్నల గొడవలు వారి పిల్లలకు శాపంగా మారింది. 16 ఏళ్ల పెద్ద కూతురు గ్రేసీˆ, 14 ఏళ్ల చిన్న కూతురు మేరీ కుమారుడు షాలోన్‌ 12 ఏళ్ల వయసులోనూ పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. కనీసం పోషకాహారం కూడా లేక వయసుకు తగ్గట్లు వారి ఎదుగుదల లేదు. చిన్నమ్మాయి మెర్సీకి గుండె సంబంధిత వ్యాధి ఉండగా, కుమారుడు షాలోమ్‌కు కళ్లు కనిపించవు. తల్లిదండ్రులు సఖ్యతగా లేకపోవడం మూలంగా వారికి సరైన వైద్యం కూడా కరవైంది. తమను సరిగ్గా చూడకపోయినా, గతంలో మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించిన తండ్రిని కాపాడుకున్న పిల్లలు ఈసారి ఓడిపోయారు. పిల్లలకు మృతుడు చరణ్‌ సోదరుడు కుమార్, తల్లి తరుపు బంధువులు పిల్లలకు బాసటగా నిలిచారు. స్థానిక కార్పొరేటర్‌ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్‌ కుందారపు రాజేందర్, స్థానిక పెద్దలు మామిడాల రమేశ్‌బాబు, జన్ను వివేక్‌ బృందం పిల్లలకు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని