logo

ప్రాణహితకు పుష్కర కళ

ప్రతి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. ఈనెల 13 నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గుండా ప్రవహిస్తున్న ప్రాణహిత నదికి పుష్కరాలు నిర్వహించనున్నారు. నది తీరం, త్రివేణి సంగమం

Published : 11 Apr 2022 02:57 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

అర్జున్‌గుట్ట వద్ద

ప్రతి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. ఈనెల 13 నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గుండా ప్రవహిస్తున్న ప్రాణహిత నదికి పుష్కరాలు నిర్వహించనున్నారు. నది తీరం, త్రివేణి సంగమం భక్తజన జాతరగా మారనున్నాయి. రోజుకు లక్ష మందికి పైగా స్నానాలు ఆచరిస్తారని అంచనా..

ప్రధానాకర్షణగా కాళేశ్వరం..

పుష్కరాల్లో కాళేశ్వరం ప్రధానాకర్షణగా నిలవనుంది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదులు కలిసే త్రివేణి సంగమ స్థానం. కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి ఆలయం ఉండటంతో పుష్కర స్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడికి దైవ దర్శనానికి వస్తారు. వసతికి సత్రాలు, లాడ్జీలు, హోటళ్లు ఉన్నాయి. గోదావరి, ప్రాణహితపై వంతెనలు ఉండడంతో అర్జునగుట్ట, రాపన్‌పల్లి, మహారాష్ట్ర వైపు సులువుగా వెళ్లి స్నానాలు చేయవచ్ఛు.

కాళేశ్వరం నుంచి గోదావరి వంతెన మీదుగా 9 కిలోమీటర్ల దూరంలో సిరోంచ చేరుకోవచ్ఛు అక్కడి నుంచి ప్రాణహిత వంతెన మీదుగా 8 కిలోమీటర్ల దూరంలోని అర్జునగుట్ట ఉంటుంది. అర్జునగుట్ట, సిరొంచ నగరం ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించవచ్ఛు

తెలంగాణలో

* అర్జునగుట్ట వద్దకు వెళ్లేందుకు బబ్బెరిచెల్క నుంచి రహదారి సిద్ధం చేస్తున్నారు. తిరుగుపయనం అయ్యేందుకు వన్‌వే ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీల కోసం జైపూర్‌ ఎస్టీపీపీలో హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.

* వేమనపల్లి, తుమ్మిడిహెట్టి ఘాట్‌లకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం, మౌలిక వసతులు కల్పించనున్నారు.

* కాళేశ్వరంలో చలువపందిళ్లు, ఆలయం వద్ద క్యూలైన్లు సిద్ధం చేస్తున్నారు. జల్లు స్నానాలకు షవర్లు, పార్కింగ్‌ స్థలాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు సిద్ధం చేయనున్నారు.

తుమ్మిడిహెట్టి వద్ద ఘాట్‌

మహారాష్ట్రలో ఏర్పాట్లు..

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ, నగరం వద్ద పుష్కరాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం పుష్కరాల నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయించింది. రహదారుల విస్తరణ, మరమ్మతులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక కంపార్ట్‌మెంట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, పార్కింగ్‌, తదితర పనులు చేపడుతున్నారు. నదిలో ప్రమాదాలు నివారణకు రక్షణ కంచె నిర్మించారు. అలాగే వీఐపీల కోసం రెండు హెలిప్యాడ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. భక్తులు సేద తీరేందుకు నగరం వద్ద ఒకటి, సిరోంచలో రెండు భారీ షెడ్లు సిద్ధం చేశారు.

పుష్కర ఘాట్లు ఎక్కడెక్కడ అంటే..

* కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి

* మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం

* జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం

* మహారాష్ట్ర వైపు సిరోంచ, నగరం

సిరోంచ ఘాట్‌కు వెళ్లేదారి

నగరం వద్ద దుస్తులు మార్చుకునే గది


హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరం ఇలా చేరుకోవచ్చు..
కరీంనగర్‌ లేదా వరంగల్‌ మీదుగా రెండు వైపులా రావొచ్చు..
* హైదరాబాద్‌-కరీంనగర్‌- పెద్దపల్లి-మంథని- కాటారం-మహదేవ్‌పూర్‌- కాళేశ్వరం చేరుకోవచ్చు. ఇది 258 కి.మీ. ఉంటుంది.
* హైదరాబాద్‌- వరంగల్‌- పరకాల- భూపాలపల్లి- కాటారం-మహదేవ్‌పూర్‌ మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు.. ఇది 285 కి.మీ.
* కాళేశ్వరానికి వరంగల్‌, భూపాలపల్లి, మంచిర్యాల, చెన్నూరు, గోదావరిఖని నుంచి బస్సు సౌకర్యం ఉంది.

తుమ్మిడిహెట్టి చేరాలిలా..
* హైదరాబాద్‌- కరీంనగర్‌-మంచిర్యాల- బెల్లంపల్లి- కాగజ్‌నగర్‌-కౌటాల- తుమ్మడిహెట్టి.. 355 కిలోమీటర్లు
* వరంగల్‌-హుజూరాబాద్‌-పెద్దపల్లి-రామగుండం-మంచిర్యాల-బెల్లంపల్లి-కాగజ్‌నగర్‌-కౌటాల-తుమ్మడిహెట్టి.. 258 కి.మీ.

అర్జునగుట్టకు
* హైదరాబాద్‌-కరీంనగర్‌-పెద్దపల్లి-రామగుండం-ఇందారం క్రాస్‌-చెన్నూర్‌-అర్జునగుట్ట. 285 కి.మీ
* వరంగల్‌-పరకాల-భూపాలపల్లి-కాటారం-మహదేవ్‌పూర్‌-కాళేశ్వరం-సిరోంచ (మహారాష్ట్ర) మీదుగా చేరుకోవచ్చు.. 135 కి.మీ.

రైల్వే మార్గం..
* రైళ్ల ద్వారా వచ్చేవారు వరంగల్‌, కాజీపేట, రామగుండం, మంచిర్యాలకు చేరుకుని కాళేశ్వరం వెళ్లొచ్చు.

* తుమ్మిడిహెట్టి ఘాట్‌కు వచ్చేవారు సిర్పూర్‌, కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా వెళ్లవచ్చు.

ప్రముఖ ఆలయాలు..
పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు సమీప ఆలయాలకు వెళ్తారు. అర్జునగుట్ట, వేమనపల్లి  సమీపంలో చెన్నూరులోని జగన్నాథాలయం, శివాలయం, అలాగే తుమ్మిడిహెట్టి వద్ద కార్తిక్‌ మహారాజ్‌ ఆలయం, సిరోంచ, కాళేశ్వరంలో కాళేశ్వరముక్తీశ్వర దేవాలయం ఉంది. అలాగే సిరోంచలో ప్రాణహిత నది ఒడ్డున విఠలేశ్వర ఆలయం ఉంది.

పర్యాటక కేంద్రాలు..
కాళేశ్వరం నుంచి మేడారం, పాండవులగుట్టలు, రామప్ప, లక్నవరం, బొగత, తదితర పర్యాటక ప్రాంతాలకు వెళ్లవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీపంప్‌హౌస్‌, 9 కిలోమీటర్ల దూరంలో అన్నారం, 32 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ బ్యారేజీలకు సైతం చూడొచ్చు. సిరోంచలో నిజాం కాలం నాటి అద్దాలమేడ ఉంది.

మరిన్ని విశేషాలు..
* వార్దా, పెన్‌గంగ నదుల కలయికతో కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత పురుడు పోసుకుని మంచిర్యాల జిల్లా మీదుగా ప్రవహించి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ః నది జన్మస్థానం నుంచి త్రివేణి సంగమం వరకు 113 కిలోమీటర్లు పయనిస్తుంది. 

* కాళేశ్వరంలో దేవాదాయశాఖకు చెందిన 50 గదుల సత్రాలతో పాటు ప్రైవేటుగా లాడ్జింగ్‌, అద్దెకు 200 గదులు ఉన్నాయి. ఇప్పటికే చాలా బుకింగ్‌ చేసుకున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక నుంచి వివిధ ఆలయాల పీఠాధిపతులు రానున్నారు. ఇప్పటికే వారి పూజాకార్యక్రమాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

* కాళేశ్వరంలో పీహెచ్‌సీ, 16 కిలోమీటర్ల దూరంలో సీహెచ్‌సీ ఆసుపత్రి ఉంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని