logo

ఆశల పొద్దు పొడిచింది

 రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరింది. మంత్రి వర్గ కూర్పు సైతం కొలిక్కి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

Updated : 14 Jun 2024 06:34 IST

ఉమ్మడి జిల్లాలో లక్షల మందికి లబ్ధి

చంద్రన్న పాలనలో తొలిపొద్దు పొడిచింది
మెగా డీఎస్సీ, పింఛను పెంపునకు పచ్చజెండా
అన్న క్యాంటీన్, నైపుణ్య గణనకు ఆమోదం

ఈనాడు, ఏలూరు  రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరింది. మంత్రి వర్గ కూర్పు సైతం కొలిక్కి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అన్నమాట ప్రకారం మెగా డీఎస్సీ, ల్యాండ్‌టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి అయిదు సంతకాలు పెట్టారు. దీంతో ఉమ్మడి జిల్లాలో యువత, రైతులు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో అన్ని వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. 

నిరుద్యోగ యువతకు మెగా వరం

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు చంద్రబాబు  మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి..నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20వేల మంది ఉపాధ్యాయ కొలువుల కోసం సిద్ధమవుతున్నారు. వీరందరికీ ఆ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుంది. వైకాపా ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో కంటితుడుపు చర్యగా విడుదల చేసిన దగా డీఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేస్తారు. వైకాపా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఉమ్మడి జిల్లాకు 250 కొలువులు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 16 వేలకు పైగా పోస్టులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నివేదించారు. దీన్ని బట్టి ఉమ్మడి జిల్లాకు వెయ్యికిపైగా పోస్టులు కేటాయించే అవకాశాలున్నాయి.

నల్లచట్టం నుంచి విముక్తి

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం(ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు) రద్దు చేసేందుకు రెండో సంతకం చేశారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వం కలిసి భూములను కొట్టేసే విధంగా వైకాపా ప్రభుత్వం వివిధ సెక్షన్లు అందులో పొందుపరిచింది. ఆక్రమించుకున్న భూములకు కూడా న్యాయపరంగా సమస్యలు లేకుండా ఉండేందుకు పథకం వేశారు. సామాన్య ప్రజల స్థిరాస్తులకు సైతం ఇబ్బందులు కల్పించేలా ఉందని వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ చట్టం రద్దుతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల సాగు భూమున్న 2 లక్షలపై చిలుకు రైతులకు, నివాస స్థలాలు కలిగి ఉన్న లక్షల మంది ప్రజలకు ఊరట లభించనుంది. సామాన్యుల ఆస్తులు రక్షణ ఛత్రం కిందకు రానున్నాయి. 

పింఛనుదారులకు పెద్దకొడుకు వరం

ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు మూడో సంతకం సామాజిక పింఛన్ల పెంపు దస్త్రంపై చేశారు. ప్రస్తుతం రూ.3 వేలుగా ఉన్న పింఛను కానుకను ఒక్కసారే రూ.వెయ్యి పెంచి రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛను వర్తింపజేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5.03 లక్షల సామాజిక పింఛన్లు ఉన్నాయి. వీరందరికీ వచ్చే నెల నుంచి పెంచిన పింఛను లబ్ధి చేకూరనుంది.పెంచిన మొత్తం ప్రకారం ఉమ్మడి జిల్లాలో నెలకు రూ.50 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరనుంది.

అన్నం పెట్టే క్యాంటీన్ల పునరుద్ధరణ

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను సైతం వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా తొలగించింది. గతంలో పూటకు రూ.5 చొప్పున రూ.15 చెల్లిస్తే మూడు పూటలా ఆహారం అందించేవారు. నిరుపేదలు, యాచకులు, వివిధ పనులపై పట్టణాలకు వచ్చిన వారు తక్కువ ఖర్చుతో కడుపు నిండా భోజనం చేసేవారు. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి, కొన్ని చోట్ల రెండు చొప్పున ఏర్పాటు చేశారు. రోజుకు 20 వేల మంది భోజనం చేసేవారు. జగన్‌ సర్కారు క్యాంటీన్లను తొలగించినా పాలకొల్లులో గత అయిదేళ్లు అన్న క్యాంటీన్‌ను నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే మళ్లీ క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని  ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు తన నాలుగో సంతకం ఆ దస్త్రంపైనే పెట్టారు.

నైపుణ్య ప్రాప్తిరస్తు 

చదువు పూర్తి చేసిన విద్యార్థుల్లో ఏ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకునేందుకు నైపుణ్య గణన హామీ దస్త్రంపై అయిదో సంతకం చేశారు. దీంతో ప్రతిభకు తగిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు ఏటా 30 వేల మంది వరకు ఉంటున్నారు. వీరందరికీ ఈ కార్యక్రమంతో లబ్ధి చేకూరనుంది. 2014 తెదేపా హయాంలో ఉమ్మడి జిల్లాలో 30 వరకు ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులకు ఇంటర్వ్యూలు ఎదుర్కోవటం, పోటీ పరీక్షలకు సన్నద్ధత, కంప్యూటర్‌ పరిజ్ఞానం తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చే వారు. ఏడాదికి 4వేల మంది వరకు శిక్షణ పొందేవారు. వైకాపా పాలనలో చదువు పూర్తయిన వేలాది మంది విద్యార్థులు, యువతకు సరైన నైపుణ్యాలు లేక ఉద్యోగాలు రాక నానా అవస్థలు పడ్డారు. ఉన్న నైపుణ్య కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తెదేపా ప్రభుత్వం రావటంతో పూర్వవైభవం రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని