logo

సొమ్ము రాదు.. అప్పు పుట్టదు

జిల్లాలో 2023-24 రబీ సీజన్‌కు సంబంధించి 79,960 ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 3.30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.

Published : 14 Jun 2024 04:21 IST

అన్నదాతలకు రూ.240 కోట్ల ధాన్యం బకాయిలు

అదిగో ఇదిగో అంటూ కాలయాపన

ధాన్యం బస్తాలు (పాత చిత్రం) 

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో 2023-24 రబీ సీజన్‌కు సంబంధించి 79,960 ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 3.30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. స్థానిక అవసరాలకు పోను రైతుల నుంచి 2.40 లక్షల టన్నులు సేకరించాలని పౌరసరఫరాల సంస్థ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దాదాపు 2.10 లక్షల టన్నులు సేకరించారు. ధాన్యం విక్రయించిన సుమారు 25 వేల మంది రైతులకు ప్రభుత్వం రూ.439 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మే 31న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసేశారు. మే 30వ తేదీ వరకు కొంత మంది రైతులకు రూ.199 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత నుంచి బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదు. రైతులకు రూ.240 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఖరీఫ్‌ సాగుకు ఇబ్బంది.. ధాన్యం సొమ్ము అందకపోవడంతో అన్నదాతలు ఖరీఫ్‌ సాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పంటలు సాగు చేసే వారిలో ఎక్కువ శాతం మంది కౌలు రైతులే. వీరు ఏటా ఆయా సీజన్లలో అప్పులు చేసి సాగు పనులు చేపడుతుంటారు. రబీ ధాన్యానికి సంబంధించిన సొమ్ము అందని రైతులు ఖరీఫ్‌ సాగుకు అవసరమైన విత్తనాలు కొనుగోలు చేయడానికి ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. పాత అప్పు తీర్చకపోతే కొత్తగా అప్పు లభించే పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో విత్తనాలు కొనుగోలు చేయలేక, నారుమడులు పోయలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.  మరోవైపు కాలువలకు నీరొదలడంతో తోటి రైతులు నారుమడులు పోసుకుంటుంటే ధాన్యం బకాయిలు అందని అన్నదాతలు పడుతున్న వేదన వర్ణనాతీతం.
వెంటనే చెల్లించాలి.. రబీ ధాన్యం విక్రయించిన రైతులకు బకాయిలు వెంటనే ఇవ్వాలి. ఖరీఫ్‌ సాగుకు ఆర్బీకేల్లో విత్తనాలు కొనాలంటే ముందుగానే సొమ్ము చెల్లించాలి. ప్రభుత్వం నుంచి బకాయి సొమ్ము అందకపోవడంతో రైతులు సొమ్ము చెల్లించలేకపోతున్నారు. ఏదో విధంగా తంటాలు పడి విత్తనాలు కొనుగోలు చేసినా నారుమడులు పోసేందుకు కూలీలకు సొమ్ము చెల్లించడం కష్టంతో కూడుకున్న పని. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని

ధాన్యం బకాయిలను తక్షణమే చెల్లించాలి.  - కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

వారంలో సొమ్ము విడుదల.. రైతులు  విక్రయించిన రబీ ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.199 కోట్లు చెల్లించింది. మిగతా రైతులకు రాబోయే వారం రోజుల్లో సొమ్ము విడుదల అవుతుంది. అలాగే ధాన్యం రవాణాకు సంబంధించిన సొమ్ము కూడా వీలైనంత త్వరగా రైతులకు అందుతుంది. ఖరీఫ్‌ సాగుకు రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. - మంజుభార్గవి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు

  • ఏలూరు మండలం  జాలిపూడికి చెందిన కౌలు రైతు బి.లక్ష్మణరావు రబీలో పదెకరాల్లో వరి సాగు చేశారు. అష్టకష్టాలు పడి ధాన్యాన్ని ఆర్‌బీకేకు తరలించి విక్రయించారు. దాదాపు 40 రోజులు కావస్తున్నా సొమ్ము జమ కాలేదు.
  • ఏలూరు మండలం సుంకరవారితోటకు చెందిన సీహెచ్‌ పోతురాజు దాదాపు నెలా పదిహేను రోజుల కిందట ధాన్యాన్ని విక్రయించారు. సుమారు రూ.4 లక్షల వరకు అందాల్సి ఉండగా ఇంతవరకు పైసా కూడా అందలేదు. మరో వైపు ఖరీఫ్‌ సాగుకు వేళయింది. చేసిన అప్పు తీర్చకపోవడంతో కొత్తగా పుట్టే పరిస్థితి లేదు. విత్తనాలు కొని నారుమడులు పోసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని