logo

బడి బస్సు.. భద్రతెంత?

పాఠశాల బస్సులు ప్రమాదాలకు గురవుతున్నా ఆ శాఖాధికారులు తూతూమంత్రంగా తనిఖీలు  చేస్తున్నారని        విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Updated : 14 Jun 2024 06:07 IST

 ఇంకా 242కి ఎఫ్‌సీలు చేయించలేదు 

పాఠశాల బస్సులు ప్రమాదాలకు గురవుతున్నా ఆ శాఖాధికారులు తూతూమంత్రంగా తనిఖీలు  చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆనక చూసీ చూడనట్లు వ్యవహరించడం షరామామూలేనని వాపోతున్నారు. కండీషన్లో లేని బస్సులు రహదారులపై నడుస్తున్నా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే:   ఆరు నెలల క్రితం వేగివాడ సమీపంలో ఓ కళాశాల బస్సు బోల్తా పడింది. అందులోని 37 మంది విద్యార్థుల్లో 17 మంది గాయపడ్డారు. స్టీరింగ్‌ పట్టేయడంతో బస్సు పడిపోయిందని గాయపడిన విద్యార్థులు తెలిపారు. అదృష్టవశాత్తు పిల్లలకు ఏమీ కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తుక్కు బస్సును మార్చాలని ఆందోళన చేశారు. 

జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు గురువారం ప్రారంభమయ్యాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే బడి బస్సులు అన్నింటికి ఎఫ్‌సీ (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌) పూర్తి చేయాలి. ఏలూరు జిల్లాలో 869 విద్యా సంస్థల బస్సులు ఉండగా.. నిబంధనల ప్రకారం ఏటా ఒకసారి రవాణా శాఖాధికారులు తనిఖీ చేసి ఎఫ్‌సీ (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌) ఇవ్వాల్సి ఉంటుంది. పాఠశాల బస్సులకు 32, కళాశాల వాహనాలకు 23 అంశాలను పరిగణనలోకి తీసుకుని రవాణా శాఖాధికారులు పరీక్షించి ఎఫ్‌సీ జారీ చేస్తారు. ఇది ఉంటేనే రోడ్డుపై తిరిగేందుకు అనుమతి ఉంటుంది. కానీ ఎఫ్‌సీ పరీక్షల్లో అనేక లోపాలు బయట పడటంతో అధికారులు వాటిని తిప్పి పంపించేస్తున్నారు. ఇలా ప్రతి వంద బస్సుల్లో 10 శాతం ఏదో ఒక లోపం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల నిర్వాహకులు బడులు తెరిచిన తరువాత కూడా వాహనాలను ఫిట్‌నెస్‌ పరీక్షలకు తీసుకెళ్లకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇంకా 242 పాఠశాల బస్సులకు నిర్దేశిత పరీక్షలు చేయించాల్సి ఉంది.

ఉల్లంఘనలతో విద్యార్థులకు రక్షణ కరవు 

ఫీజుల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు కొందరు విద్యార్థుల భద్రతను విస్మరిస్తున్నారు. సామర్థ్యం లేని బస్సులు... అనుభవం లేని డ్రైవర్లతో రహదారులపై నడిపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు భయాందోళనతో ఉండాల్సిందేనని తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనికితోడు నిబంధనల్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. బస్సుల్లో సౌకర్యాలు ఉండటం లేదు. కొన్నింటిని పర్మిట్లు లేకుండా తిప్పేస్తున్నారు. వెనుక వచ్చే వాహనాలను చూసేందుకు డ్రైవర్‌ వద్ద.. అద్దాలు ఉండటం లేదు. విద్యార్థులు సంచులు పెట్టుకునేందుకు అరలు ఉండవు. చోదకులు యూనిఫాం ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం లేదు. వేగ నియంత్రణ ఉండటం లేదు. ఫలితంగా ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా అటు అధికారులు, ఇటు పాఠశాలల నిర్వాహకులు నిర్లక్ష్యం వహించకుండా సామర్థ్య పరీక్షల విషయంలో, నిబంధనలు పాటించడంలోనూ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.   

బంధనలు పాటించకపోతే  జప్తు చేస్తాం

ఎఫ్‌సీ లేకుండా ఏ ఒక్క బస్సు నడిపినా జప్తు చేస్తాం. బాధ్యుల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేస్తాం. పాఠశాలలు పునఃప్రారంభమైనందున ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశాం. బస్సులకు సంబంధించి సాంకేతిక, భౌతిక స్వరూపాలపై సంతృప్తి చెందాకే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 
- ఎస్‌.శాంతకుమారి, జిల్లా రవాణా శాఖ ఉపకమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని