logo

మావుళ్లమ్మ సేవలో కేంద్ర మంత్రి

పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గురువారం సందర్శించారు.

Published : 14 Jun 2024 04:44 IST

అమ్మవారికి నమస్కరిస్తున్న శ్రీనివాసవర్మ

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గురువారం సందర్శించారు. తొలుత ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆపై మంత్రి విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో స్వామివారిని దర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఉప ప్రధానార్చకుడు కొడమంచిలి కొప్పేశ్వరరావు, పండితులు వేదాశీర్వాదం చేసి శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్‌ బి.ఎం.నగేశ్, పర్యవేక్షకుడు పి.వాసు, తనిఖీదారు ఎన్‌.లోకనాథం పాల్గొన్నారు.


నిమ్మలకు ఆత్మీయ సత్కారం

పెదఅమిరం(కాళ్ల), న్యూస్‌టుడే: ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజును ఆయన స్వగృహంలో మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన్ను రఘురామ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని... శాలువాతో సత్కరించి అభినందించారు.

మార్కెట్‌ కమిటీల అధ్యక్ష పదవులకు రాజీనామాలు 

దెందులూరు, ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో వైకాపా హయాంలో నామినేటెడ్‌ పదవులు పొందిన వారు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలుండగా.. ఏలూరు, దెందులూరు, భీమడోలు, కలిదిండి కమిటీల అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేశారు. చింతలపూడి మార్కెట్‌ కమిటీ పదవీకాలం మే నెలతో ముగిసిందని.. కైకలూరు, నూజివీడు మార్కెట్‌ కమిటీల అధ్యక్షులు శుక్రవారం రాజీనామా చేస్తారని ఏడీ మహేంద్రనాథ్‌ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో 10 మార్కెట్‌ కమిటీలుండగా.. అత్తిలి, పెనుగొండ, ఆచంట కమిటీల పదవీకాలం ఈ ఏడాది మేతో ముగిసింది. మిగిలిన ఏడు కమిటీల్లో అయిదు కమిటీల అధ్యక్షులు రాజీనామాలు చేశారు. ఆకివీడు, నరసాపురం మార్కెట్‌ కమిటీల అధ్యక్షులు శుక్రవారం రాజీనామా చేస్తారని పశ్చిమగోదావరి జిల్లా మార్కెటింగ్‌ శాఖ ఏడీ తెలిపారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని