logo

వేటకు వేళాయె!

కడలి అలలు దాటుకుని చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు లేక ఇన్నాళ్లూ బోసిపోయిన సముద్ర తీరంలో మళ్లీ సందడి రానుంది. సముద్రంలో చేపల వేటకు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు రెండు నెలలపాటు ప్రభుత్వం విరామం ప్రకటించింది.

Published : 14 Jun 2024 04:47 IST

నేడు అర్ధరాత్రి నుంచి ప్రారంభం

నరసాపురం (తూర్పుతాళ్లు), న్యూస్‌టుడే: కడలి అలలు దాటుకుని చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు లేక ఇన్నాళ్లూ బోసిపోయిన సముద్ర తీరంలో మళ్లీ సందడి రానుంది. సముద్రంలో చేపల వేటకు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు రెండు నెలలపాటు ప్రభుత్వం విరామం ప్రకటించింది. ఇది మత్స్యకారుల జీవనోపాధిపై దెబ్బకొట్టింది. నిషేధానికి శుక్రవారం అర్ధరాత్రితో గడువు ముగుస్తుంది. దీంతో వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు వలలు, పడవలను సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలోనే 19 కిలోమీటర్ల పరిధిలో తీరం విస్తరించి ఉంది. 9 గ్రామాల్లో సుమారు 1.20 లక్షలకుపైగా మత్స్యకారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం వేటపై ఆధారపడి జీవిస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మోటరైజ్డ్‌ బోట్లు 228 మాత్రమే ఉన్నాయి. ఇవి కాక 221 సంప్రదాయక బోట్లలో 9 గ్రామాల్లో 200 కుటుంబాలు పరోక్షంగా, 3 వేల కుటుంబాలకు పైగా ఐలా వలలు, మోచేతి వలలతో వేట సాగిస్తున్నారు. వీరందరికీ చేపల వేటే జీవనాధారం. మత్స్యకారులకు వేటకు మళ్లీ అవకాశం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిషేధం ముగిసిన తర్వాత గంగమ్మకు ఉత్సవం చేసి వేట ప్రారంభించడం ఆనవాయితీ. దీంతో మంచి రోజు, తిథి చూసి వేటకు సన్నద్ధం అవడానికి మరికొంత సమయం పట్టనుంది.

జిల్లాలో సముద్ర చేపల వేట చేసే మత్స్యకారులు బోట్లను సిద్ధం చేసుకుంటున్నారు. రెండు నెలల నుంచి వీటి నిర్వహణ లేకపోవడంతో పెద్ద, చిన్న బోట్లు సరిదిద్దుకోవడానికి సమయం పడుతుందని చెబుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని