logo

జనం ప్రాణాలతో ఆటలా?

పామర్రు-దిగమర్రు జాతీయ రహదారి 165 విస్తరణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది.

Updated : 14 Jun 2024 06:16 IST

మండవల్లి, కైకలూరు, న్యూస్‌టుడే: పామర్రు-దిగమర్రు జాతీయ రహదారి 165 విస్తరణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. నియోజకవర్గ పరిధిలో ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు మండలాల్లో విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. పనుల్లో నిబంధనలు పాటించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డును రెండు భాగాలు చేసి కల్వర్టుల నిర్మాణాలు చేపడుతూ భారీ గుంతలు తవ్వుతున్నారు. అయితే ఇక్కడ కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు, రోడ్డు భద్రతా చర్యలు కానరావడం లేదు. దీంతో భారీ వాహనాలు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నాయి. రోడ్డు నిర్మాణం చేసిన కొన్ని చోట్ల పాత రోడ్డుకు కొత్త దానికి మధ్య దిబ్బలు కనిపిస్తున్నాయి. వీటివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

  • జాతీయ రహదారి విస్తరణ పనుల్లో కైకలూరు మండలం పల్లెవాడ వద్ద కల్వర్టు నిర్మాణం చేసేందుకు రోడ్డుపై గుంత తవ్వి ఒక వైపు రాకపోకలు నిలిపివేశారు. అయితే ఇక్కడ ప్రమాద హెచ్చరికలు రాత్రి వేళల్లో కనిపించే విధంగా ఏర్పాటు చేయలేదు. దీంతో ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ గుంతలను గమనించక అదుపు తప్పి పల్టీ కొట్టింది. రూ.15 లక్షల విలువైన ఆయిల్‌ నేలపాలు కాగా చోదకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
  • మండవల్లి మండలం భైరవపట్నంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సోమవారం రాత్రి కనీస సూచిక బోర్డులు లేకుండా రోడ్డుపై భారీ వాహనాలు లారీపై నుంచి దిగేందుకు వీలుగా తారు గుట్టలు పోసి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి గుట్టలు కనిపించకపోవడంతో వాటిని బలంగా ఢీకొట్టాడు.. తలకు తీవ్ర గాయం కావడంతో రెండ్రోజులు కోమాలో ఉండి బుధవారం ఉదయం చనిపోయాడు. అదే రోజు రాత్రి ఆ గుట్టలను ఢీకొట్టి భార్యభర్తలు కూడా గాయాలపాలయ్యారు. మరో వ్యక్తి కారును ఎక్కించి త్రుటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

రాత్రి వేళల్లో ఎక్కువ 

రోడ్డు విస్తరణ పనుల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. రోడ్డుపై భారీగా గుంతలు తవ్వినా లేక మార్గాన్ని మరో వైపు మళ్లించిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసే వారికి ప్రమాద తీవ్రత తెలిసేలా రేడియం కలిగిన ఎరుపు, పసుపు రంగు చిత్రాలు సూచికగా ఉంచాలి. పగటి వేళల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు వ్యక్తులు నియమించి ప్రమాదాలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి. ఇవేమీ అమలు చేయకుండా కల్వర్టుల నిర్మాణ పనులు ప్రారంభించారు. వాటి నిర్మాణంలోని ఇనుప చువ్వల చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేయడంలోనూ అశ్రద్ధ చూపుతున్నారు. మరో పక్క నిర్మాణం పూర్తైన రోడ్డుపై ఎప్పుడు గుట్టలు పోస్తున్నారో తెలియక అమాయక ప్రజలు జీవితాలు కోల్పోతున్నారు.

గతంలో ప్రమాదాలు ఇలా..

  • భైరవపట్నంలో నిర్మాణం సాగిస్తున్న కల్వర్టు సమీపంలో ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో హైదరాబాద్‌ నుంచి భీమవరానికి వెళ్తున్న కారు గుంతలో పడిపోయింది. పెళ్లికి వెళ్తున్న ముగ్గురు కుటుంబ సభ్యులు కారులో ఇరుక్కుపోయి గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
  • కొర్లపాడు మలుపు వద్ద జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో మట్టిని తరలిస్తూ చోదకుడి తడబాటుతో టిప్పర్‌ లారీ పంట బోదెలోకి పల్టీ కొట్టింది. ఆ సమయంలో అటు వైపు వాహనాల సంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

నివారణకు చర్యలు తీసుకుంటాం..

‘జాతీయ రహదారి 165 విస్తరణ పనుల్లో రోడ్డు ప్రమాదాలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా గుంతలు తవ్వితే రేడియం స్టిక్కర్లతో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. పగటి పూట ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం. రోడ్డు నిర్మాణంలో ఉండటాన్ని గమనించి వాహనదారులు  వేగ నియంత్రణ పాటించాలి.’ అని ఎన్‌హెచ్‌ డీఈ సత్యనారాయణ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని