logo

అమ్మ రక్తం పంచుతోంది!

రక్తదానం చేయడం అంటే.. ఓ ప్రాణం నిలపడమే. ఆ సమయంలో రక్తమిచ్చిన వ్యక్తి బాధిత కుటుంబానికి దైవంగా కనిపిస్తారు. జీవితంలో ఇలాంటి సందర్భం రావడం అదృష్టంగా భావించాలి

Published : 14 Jun 2024 05:04 IST

భీమవరం పట్టణం, ఆచంట, కలిదిండి, ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: రక్తదానం చేయడం అంటే.. ఓ ప్రాణం నిలపడమే. ఆ సమయంలో రక్తమిచ్చిన వ్యక్తి బాధిత కుటుంబానికి దైవంగా కనిపిస్తారు. జీవితంలో ఇలాంటి సందర్భం రావడం అదృష్టంగా భావించాలి. రక్తదానం చేయడమంటే అసాధారణ ప్రక్రియ కాదు. మంచి ఆరోగ్యం... అంతకంటే మంచి మనసు ఉంటే చాలు. ఇది పురుషులకే సాధ్యమన్న భావన సరైందికాదని కొందరు స్త్రీమూర్తులు నిరూపిస్తున్నారు. రక్తహీనతను అధిగమిస్తూ.. దృఢచిత్తంతో బాధితులకు ఊపిరి పోస్తున్నారు. రక్తదానం చేయాల్సిన బాధ్యత తమకూ ఉందన్న సంకేతమిస్తూనే..  అది సుసాధ్యమేనన్న స్ఫూర్తిని నింపుతున్నారు. శుక్రవారం ప్రపంచ రక్తదాతల  దినోత్సవాన్ని పురస్కరించుకుని తరచూ రక్తదానం చేస్తున్న వారి గురించి  తెలుసుకుందాం.

సంకల్పం ఉండాలి

రక్తదానం చేయాడానికి లింగ భేదం ఉండదు. ఆరోగ్యం.. సంకల్పం ఉంటే మహిళలు రక్తదానం చేయవచ్చు. కలిదిండిలో హోప్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఆరేళ్ల కిందట రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో నేను రక్తమిచ్చా. ఇది నాలో నమ్మకాన్ని పెంచింది. మిత్రులు, బంధువుల వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఎవరికైనా అత్యవసరమని సమాచారం తెలిసినప్పుడు స్వచ్ఛందంగా వెళ్లి రక్తదానం చేస్తున్నా. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఇచ్చాను’ అంటున్నారు కలిదిండికి చెందిన బి.ఏసుమేరీ.

మా కుటుంబంలో అందరూ..

‘మా కుటుంబం 30 ఏళ్ల నుంచి రక్తదానం చేస్తోంది.  నా భర్త చిరంజీవి 105 సార్లు చేశారు. ఆయన ప్రోద్బలంతోనే నేను 40 సార్లు ఇచ్చా. మా ముగ్గురు కుమారులు, కుమార్తె..రక్తదానం చేస్తున్నారు. మా కుటుంబానికి ఇది ఓ అలవాటుగా మారింది’ అని చెబుతున్నారు ఏలూరు కొత్తపేటకు చెందిన గృహిణి బావిశెట్టి పద్మావతి.

అలవర్చుకుంటున్నా..

శస్త్ర చికిత్స చేసే సమయంలో.. క్షతగాత్రులకు రక్తం సమయానికి అందకపోవడం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటనలు తెలిసినప్పుడు హృదయం విలవిల్లాడిపోతుంది. వాట్సాప్‌ స్టేటస్‌లో సానుభూతి వ్యక్తం చేయడం కంటే ప్రత్యక్షంగా ఏదైనా చేస్తే మంచిదనిపించింది. ఇప్పటికి మూడు అత్యవసర సందర్భాల్లో రక్తదానం చేశా. క్రమంగా ఇది అలవడుతుంది. రక్తదానం చేసిన ప్రతిసారీ ఏదో అంతుచిక్కని సంతృప్తి కలుగుతుందని చెబుతున్నారు కలిదిండికి చెందిన కె.లావణ్య.

విద్యార్థి దశ నుంచే‘

ఏలూరు సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో చదివా. అప్పట్లో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన ఆవశ్యకతపై అవగాహన సదస్సులు పెట్టేవారు. అలా తెలుసుకున్నా. 12 ఏళ్లుగా రక్తదానం చేస్తూ ఉన్నాను. ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తున్నా’ అని చెబుతున్నారు ఏలూరు నగర పాలక సంస్థ మెప్మా సీవో ఎం.సురేఖ.

ఎంతో ఆరోగ్యకరం

‘మహిళలు రక్తదానం చేయటంతో వారికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. అందరూ అవగాహన పెంచుకోవాలి. 3 ఏళ్లు నుంచి రక్తదానం చేస్తున్నా. ప్రతి 6 నెలలకు చేస్తుంటా’ అని ఏలూరు నగరపాలక సంస్థ ఉద్యోగిని ఎస్‌కె గౌసియా తెలిపారు.

14 సార్లు రక్తదానం

‘ప్రముఖ సినీ కథానాయకుడు, పద్మవిభూషణ్‌ చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు 14సార్లు రక్తదానం చేశా. ఇటీవలే భీమవరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యనారాయణమూర్తి అనే వ్యక్తికి రక్తదానం చేశా. రక్తదానంపై అపోహలు వీడి... సామాజిక సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములవ్వాలి’ అని భీమవరం పట్టణానికి చెందిన తమ్మిశెట్టి రమానాగేశ్వరి అంటున్నారు. 

అటు ప్రచారం.. ఇటు రక్తదానం

ఆచంట, తణుకు పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్కరికి రక్తం అవసరమైనా ఆ సమాచారం తెలుసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తుంటాం. తద్వారా వారికి రక్తం సమకూరుస్తా. అవసరమైనప్పుడు నేనూ రక్తదానం చేస్తా. ఇప్పటి వరకు నేను నాలుగు సార్లు రక్తదానం చేశా. మహిళలు సైతం భయం వీడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆచంటకు చెందిన కె. అశ్విని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని