logo

8న మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం

నరసాపురం, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలాల పరిధిలోని మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం నిర్వహణకు సంయుక్త కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Published : 16 Jun 2024 04:25 IST

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలాల పరిధిలోని మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం నిర్వహణకు సంయుక్త కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నరసాపురం ఎంపీపీ మైలాబత్తుల సోని అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఫెర్రీ రేవు సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి రేవు వేలం పాట గడువు మార్చి నెల 31న ముగిసింది. ఈ నేపథ్యంలో రేవు పాట నిర్వహించేందుకు అనుమతించాలని జడ్పీ సీఈవోను అధికారులు కోరారు. సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పాట నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రస్తుత రేవు పాటదారునికే ఫెర్రీ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో రేవు పాటదారుడైన చక్రావధానుల ధవేజీ రోజువారీ పాట సొమ్ము సక్రమంగా చెల్లించకపోవడంతో రూ.48,75,800 మేర బకాయిలు పేరుకుపోయాయని ఎంపీడీవో రమణారావు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులైన నరసాపురం, సఖినేటిపల్లి ఎంపీపీలు మైలాబత్తుల సోని, వీరా మల్లికార్జునరావు, నరసాపురం, సఖినేటిపల్లి జడ్పీటీసీ సభ్యులు బొక్కా రాధాకృష్ణ, పి.అన్నపూర్ణలు రేవు పాట దారుడైన రెడ్డప్ప ధవేజీతో ఫోన్‌లో మాట్లాడారు. రేవు పాట బకాయి సొమ్ము రూ.35 లక్షలు ఈ నెల 21న చెల్లిస్తానని మిగిలిన మొత్తం రోజుకు రూ.75 వేల చొప్పున చెల్లిస్తానని పాటదారు తెలిపారు. రేవు పాట నిర్వహించేందుకు జడ్పీ సీఈవో నుంచి అనుమతి రావడంతో వచ్చే నెల 8న నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో అమలాపురం డీఎల్పీవో పి.బొజ్జిరావు, సఖినేటిపల్లి ఎంపీడీవో పీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని