logo

పేదలకు మరింత చేయూత

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే సామాజిక పింఛన్ల సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దస్త్రంపై సంతకం చేశారు.

Published : 16 Jun 2024 04:27 IST

పింఛను సొమ్ము పెంపుతో లబ్ధి

వీరవాసరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే సామాజిక పింఛన్ల సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దస్త్రంపై సంతకం చేశారు. పెంచిన మొత్తంతో కలిపి పింఛన్ల సొమ్మును జులై 1వ తేదీ నుంచి ప్రభుత్వం చెల్లించనుందని అధికారులు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 2,38,321 మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.3 వేల చొప్పున రూ.71.49 కోట్లు పంపిణీ చేస్తున్నారు. పింఛను మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచడంతో జిల్లా పరిధిలో ప్రతినెలా రూ.23.83 కోట్ల వరకు అదనంగా ప్రభుత్వం చెల్లించనుంది. ఏప్రిల్, మే, జూన్‌ నెలల బకాయిలతో కలిపి మొత్తం రూ.7 వేలను జులైలో అందిస్తారు. అంటే రూ.166.82 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.

రూ.200 నుంచి.. గతంలో రూ.200 ఉన్న పింఛను మొత్తాన్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.1000కు, తరువాత రూ.2 వేలకు పెంచారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి విడతల వారీగా ఈ మొత్తాన్ని రూ. 3 వేలకు పెంచారు. తాజాగా దీనిని ఒకే విడతలో రూ.4 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దస్త్రంపై సంతకం చేశారు. 
20 కేటగిరీలకు.. సామాజిక భద్రతా పింఛన్లలో 26 కేటగిరీల వారు ఉన్నారు. వీరిలో 20 కేటగిరీలకు పింఛను పెంపును వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో వృద్ధులు, వితంతువులు, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళ, చర్మకారులు, మూడు రకాల కళాకారులు, ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం ఉన్న రూ.3 వేలను రూ. 6 వేలకు పెంచి అమలు చేయనున్నారు. పక్షవాతంతో, ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన వారికి ఇచ్చే మొత్తాన్ని రూ. 5 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులు, మరో నాలుగు రకాల రుగ్మతలతో బాధపడే వారికి ఇచ్చే పింఛనును రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని