logo

బుక్కెడు బువ్వకు భరోసా!

అన్నార్తులు, పేదల క్షుద్బాధ తీరనుంది. మూడు పూటలా కడుపు నిండా ఆహారం అందనుంది. వైకాపా పాలనలో మూతపడిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Updated : 16 Jun 2024 06:22 IST

అన్న క్యాంటీన్ల ప్రారంభానికి అధికారుల సన్నాహాలు 

తంగెళ్లమూడిలో అన్న క్యాంటీన్‌ (పాత చిత్రం)

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: అన్నార్తులు, పేదల క్షుద్బాధ తీరనుంది. మూడు పూటలా కడుపు నిండా ఆహారం అందనుంది. వైకాపా పాలనలో మూతపడిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అన్నపూర్ణ లాంటి క్యాంటీన్లలో రూ.5కే ప్రజలు అన్ని రుచులను ఆస్వాదించనున్నారు. 
అప్పట్లో నిత్యం వేల మంది.. గత తెదేపా పాలనలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 24 అన్న క్యాంటీన్లు నిర్వహించేవారు. ఏలూరు నగరంలో నాలుగు కొనసాగేవి. నిత్యం 30 వేల నుంచి 35 వేల మంది భోజనం చేసేవారు. ఒక్కో పూటకు రూ.5 చొప్పున అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. ఆటో, రిక్షా డ్రైవర్లు, హమాలీలు, కూలీలు, చిరుద్యోగులు.. ఇలా ఎంతో మంది వీటిని ఆశ్రయించి ఆకలి తీర్చుకునేవారు. ఏలూరు, పట్టణ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి బంధువులు.. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు మధ్నాహ్నం కాగానే క్యాంటీన్లలో భోజనం చేసేవారు. హోటళ్లు, మెస్‌లకు వెళ్లి ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి తినలేని వారికి అన్న క్యాంటీన్‌ భరోసాగా ఉండేది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటిని మూసివేయడంతో నిరుపేదలకు అన్నం ముద్ద దొరక్కుండాపోయింది. ఇతర ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చిన పేదలు ఆకలి తీర్చుకునేందుకు ఎక్కువ డబ్బులు వెచ్చించి హోటళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. 
యుద్ధప్రాతిపదికన.. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో  క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఆ దస్త్రంపై సంతకం చేశారు. యుద్ధ్దప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. గతంలోని అన్న క్యాంటీన్ల భవనాలను వైకాపా ప్రభుత్వం సచివాలయాలకు కేటాయించింది. కొన్నింటిని ఇతర కార్యాలయాలకు వినియోగించింది. తాజా పరిణామాల నేపథ్యంలో మార్పు చేస్తున్నారు. ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేసి క్యాంటీన్లకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. దీనిపై నగర కమిషనర్‌ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ నగరంలో గతంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను సిద్ధం చేస్తున్నామని, త్వరితగతిన ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని