logo

నాన్న మాట.. గెలుపు బాట!

భీమవరం అర్బన్, కలిదిండి, ఉంగుటూరు, న్యూస్‌టుడే: బిడ్డను తనకంటే ఎత్తున నిలిపేందుకు జీవితాంతం పోరాడే అలుపెరుగని యోధుడు నాన్న.

Published : 16 Jun 2024 04:40 IST

నేడు ప్రపంచ పితృ దినోత్సవం

భీమవరం అర్బన్, కలిదిండి, ఉంగుటూరు, న్యూస్‌టుడే: బిడ్డను తనకంటే ఎత్తున నిలిపేందుకు జీవితాంతం పోరాడే అలుపెరుగని యోధుడు నాన్న. తన గుండెలపై తొలి అడుగులతో  నడక.. నడత నేర్పిస్తూ ఉజ్వల భవితకు దారి చూపే దిక్సూచి. బయటకు గంభీరంగా కనిపించినా... ఆయన మనసంతా ఎనలేని ప్రేమ. కొండంత కష్టాన్ని పంటి బిగువున అదిమిపెట్టి చెరగని చిరునవ్వుతో ప్రతి మలుపులోనూ కొండంత స్ఫూర్తి నింపుతూ.. గెలుపు దిశగా మనల్ని నడిపించేది నాన్నే. ప్రపంచ పితృ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ఫూర్తిదాయకమైన నాన్న మనసును అక్షరాల్లో చదివేద్దామా మరి.

ఆయన అండతోనే..

మా స్వస్థలం ఏలూరు. నాన్న కానాల రామకృష్ణారావు న్యాయవాది. డబ్బు తీసుకుని చేసేది సేవ కాదు అనేవారు. ఆయన వద్దకు వచ్చే పేదల కేసులను ఫీజు తీసుకోకుండానే వాదించేవారు. ఆయన ఇప్పటికీ సామాన్య న్యాయవాదిగానే ఉండిపోయినా వృత్తిలో తనకెంతో ఆత్మసంతృప్తి లభించిందని చెబుతారు. మనస్ఫూర్తిగా కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుందనేవారు. వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు నిరాశపడకుండా అలా ఎందుకు జరిగిందో పరిశీలించుకొని లోపాలను అధిగమించాలని సూచించేవారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యంతోనే 2022లో గ్రూప్‌-1 పరీక్షల్లో విజయం సాధించా. ప్రతి విషయంలో  నన్ను ముందుండి నడిపించింది నాన్నే అని చెబుతున్నారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో శిక్షణ ఉపకలెక్టర్‌గా వ్యవహరిస్తున్న కానాల సంగీత్‌ మాధుర్‌.

సేవకురాలిగా తీర్చిదిద్ది..

చిన్నప్పుడే అమ్మ దూరమైంది. ఆ క్షణం నుంచి నాన్నే నాకు అమ్మ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పల్లె వైద్యుడిగా నిరుపేదలకు ఉచిత వైద్యం అందించారు. ప్రమాదాల్లో ఎవరైనా చనిపోయినా.. గాయపడినా అడగకుండానే ఆర్థిక సాయం చేశారు. ఈ క్రమంలో అప్పటి మంత్రుల నుంచి ఆపద్బాంధవుడు అవార్డు అందుకోవడం నాలో స్ఫూర్తి నింపింది. ‘సాటి వారికి సాయం చేస్తేనే మనం మనిషిగా బతికున్నట్లు’ అని నాన్న చెప్పిన మాట నా మనసును తాకింది. ఆయన స్ఫూర్తితోనే అయిదో తరగతి చదువుతుండగానే రెండు ప్రభుత్వ బడులు, ఒక కళాశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశా. ఇప్పటి వరకు రూ.20 లక్షలకుపైగా నిరుపేదలకు ఆర్థికసాయం అందించా. అమరావతికి రూ.10 లక్షలు వితరణగా ఇచ్చా. నాన్న నా పేరిట డిపాజిట్‌ చేసిన సొమ్ము నుంచే ఇదంతా చేశా. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ రెండో ఏడాది చదువుతున్నా. డాక్టరు అయ్యాక.. నాన్న బాటలో పల్లెలోనే ఉండి పేదలకు సేవలందిస్తా.. అంటూ భావోద్వేగంతో చెబుతున్నారు ముదినేపల్లికి చెందిన అంబుది వైష్ణవి.

అన్నీ తానై..

గుటూరు మండలం చేబ్రోలుకు చెందిన ఐనాల శ్రీనివాసరావు, కృష్ణకుమారి దంపతుల రెండో సంతానం హేమ రంగ వీరేంద్ర. పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. మాటలు సరిగా రావు. కాలకృత్యాలకు వెళ్లాలన్నా మరొకరి సహాయం అవసరం. తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. చిన్న వయసు నుంచి శ్రీనివాసరావు తన కుమారుడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. చిన్నప్పుడు భవిత కేంద్రానికి కొన్ని రోజులు పంపించారు. తర్వాత ఏలూరు కోటదిబ్బలోని ప్రేమాన్విత శిశు సంరక్షణ కేంద్రం, కొవ్వూరులోని ప్రైవేటు శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. హేమ రంగ వీరేంద్రకు తరచూ ఫిట్స్‌ వస్తుండటంతో ఇంటికి పంపించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నీతానై కుమారుడిని సాకారు. ఉదయం లేచిన నాటి.. మళ్లీ రాత్రి నిద్రించేవరకు ప్రతి పనినీ ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రస్తుతం హేమ రంగ వీరేంద్రకి 21 సంవత్సరాలు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని