logo

ఇసుక రేవుల్లో నిద్దరోతున్న నిఘా!

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏలూరు జిల్లాలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్, ఇతర జిల్లా అధికారులు, పశ్చిమలో మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇసుక రేవుల పర్యవేక్షణకు వచ్చారు

Published : 16 Jun 2024 06:52 IST

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే- కుక్కునూరు, ఆచంట, పెనుగొండ గ్రామీణ :‘ఇసుక రేవుల్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.. పోలీసు, రెవెన్యూ సిబ్బందిని గస్తీ పెడతాం.. రీచ్‌లకు వెళ్లే రహదారులు ధ్వంసం చేసి అడ్డంగా ట్రెంచులు (కందకాలు) తవ్విస్తాం’ అంటూ కొద్ది రోజుల కిందట క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన జిల్లా అధికారులు హామీలు గుప్పించారు. న్యాయస్థానం సైతం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం దిద్దుబాటు చర్యలు కానరావడం లేదు. అరకొర పర్యవేక్షణ, కందకాల తవ్వకాలు తప్ప పూర్తి స్థాయిలో చర్యలు కనిపించడం లేదు. దీంతో మళ్లీ ఇసుక తవ్వకాలు మొదలు పెట్టినా నియంత్రించే పరిస్థితులు కనిపించడం లేదు. 

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏలూరు జిల్లాలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్, ఇతర జిల్లా అధికారులు, పశ్చిమలో మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇసుక రేవుల పర్యవేక్షణకు వచ్చారు. కుక్కునూరు, వేలేరుపాడు, ఆచంట మండలాల్లో ఇసుక రేవులను పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, రెవెన్యూ, పోలీసు సిబ్బందిని పహారా ఉంచుతామని తెలిపారు. వాహనాలు వెళ్లకుండా కందకాలు తవ్విస్తామన్నారు. ఇప్పటికి 20 రోజులు దాటినా దిద్దుబాటు చర్యలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. కందకాల తవ్వకం చేపట్టారు. ఏలూరు జిల్లాలో వీఆర్‌ఏలు (గ్రామ రెవెన్యూ సహాయకులు) తప్ప ఇతర రెవెన్యూ, పోలీసు సిబ్బంది గస్తీ ఉండటంలేదు. వారు కూడా పగలు తప్ప రాత్రి కానరారు. దీంతో రాత్రుళ్లు తవ్వకాలు చేసినా అధికారులకు కనీస సమాచారం అందదు. పశ్చిమలో వారానికి రెండు సార్లు అధికారులు వెళ్లి రేవులను పరిశీలించి మమ అనిపిస్తున్నారు. కనీస పర్యవేక్షణ లేనందునే వైకాపా పాలనలో ఇష్టారాజ్యంగా ఇసుక తరలించేశారు. 

తవ్వకాలు జరిగితే ఎలా గుర్తిస్తారు

కుక్కునూరు మండలం ఇబ్రహీంపేటలో తవ్వకాలు జరిగిన ఆనవాళ్లు

అధికారుల తీరు చూస్తుంటే న్యాయస్థానం చెప్పింది కాబట్టి తనిఖీలు చేశారే తప్ప దిద్దుబాటు చర్యలు తీసుకునే ఉద్దేశమే లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, పటిష్ఠ గస్తీ వ్యవస్థ లేకపోతే.. తవ్వకాలు జరిగితే ఎలా గుర్తిస్తారు? ఏ విధంగా అడ్డుకుంటారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినా.. కొత్త విధానంపై  స్పష్టత వచ్చే వరకు రేవులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

అధికారుల మాటలు తప్ప.. కానరాని సీసీ కెమెరాలు 

సిద్ధాంతంలో ఇలా..

ఎక్కడా ఏర్పాటు చేయలేదు.. ఇసుక రేవుల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా వెంటనే అధికారులు అప్రమత్తం కావడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఏలూరు జిల్లా ఇబ్రహీంపేట, వింజరం, బూరుగువాయి, దాచారం, రుద్రంకోట, పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లి రేవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. పశ్చిమ లోని రేవుల్లో  వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోలార్‌ విద్యుత్తుతో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏడాదిలోగా అవి కనుమరుగవగా.. రాత్రి వేళల్లో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా తరలిపోయింది. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి భారీగా తెలంగాణకు తరలించారు. ఎన్నికల నోటిషికేషన్‌ వచ్చాక కూడా అడ్డగోలుగా తవ్వుకుపోయారు. 

పరిశీలించి నెల కావస్తున్నా దిద్దుబాటు చర్యలు లేవు

ఆచంట మండలం కరుగోరుమిల్లి ఇసుక ర్యాంపు 

ఈ విషయమై ఏలూరు, పశ్చిమ కలెక్టర్లు ప్రసన్న వెంకటేశ్, సుమిత్‌ కుమార్‌లను వివరణ కోరగా ‘ప్రస్తుతం ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదు. సీసీ కెమెరాల ఏర్పాటుపై స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చాం. త్వరలోనే ఏర్పాటు చేస్తాం. గస్తీ పెంచి పర్యవేక్షణను పటిష్ఠం చేస్తాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని