logo

రేషన్‌ సరకుల్లో తూకం తప్పుతోంది!

పౌర సరఫరాల గోదాముల్లో తూకం తప్పుతోంది. గంపగుత్తగా రేషన్‌ దుకాణాలకు సరకులు తరలిస్తూ కోత పెడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి నెలా సరఫరా చేసే సుమారు 17 మెట్రిక్‌ టన్నుల బియ్యంలో వంద క్వింటాళ్లకు క్వింటా చొప్పున తూకం తక్కువగా వస్తోందని రేషన్‌ డీలర్లు లబోదిబోమంటున్నారు.

Published : 18 Jun 2024 02:32 IST

ఏలూరు పౌర సరఫరాల  గోదాములో తనిఖీ చేస్తున్న అధికారులు

చింతలపూడి, ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: పౌర సరఫరాల గోదాముల్లో తూకం తప్పుతోంది. గంపగుత్తగా రేషన్‌ దుకాణాలకు సరకులు తరలిస్తూ కోత పెడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి నెలా సరఫరా చేసే సుమారు 17 మెట్రిక్‌ టన్నుల బియ్యంలో వంద క్వింటాళ్లకు క్వింటా చొప్పున తూకం తక్కువగా వస్తోందని రేషన్‌ డీలర్లు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెనాలిలోని గోదాముల్లో తనిఖీలు చేయగా పలు అంశాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాన్నే గత అయిదేళ్లుగా రేషన్‌ డీలర్లు మొత్తుకుంటున్నా ఆ శాఖ అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం తూనికలు, కొలతల శాఖ అధికారులు ఏలూరుతో పాటు పలు గోదాముల్లో తనిఖీలు చేసి తేడాలను గుర్తించారు.

చింతలపూడి మండలంలోని ఓ రేషన్‌ డీలర్‌కు ప్రతి నెలా రెండు, నుంచి మూడు బస్తాల వరకు రేషన్‌ బియ్యం తేడా వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద తూకాల్లో మోసాలు చేస్తున్నారని సదరు డీలర్‌ మొత్తుకుంటున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.

విన్నపాలు పట్టించుకునేవారేరి?

ఒక్కో బియ్యం సంచిపై 580 గ్రాముల అదనపు బియ్యం (టేర్‌ వెయిట్‌) ఇవ్వాల్సి ఉంది. పౌరసరఫరాల గోదాముల ఇన్‌ఛార్జులు ఇవ్వడం లేదు. వాటిని స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గోదాముల్లో వేయింగ్‌ యంత్రంపై బియ్యం సంచులు ఉంచి.. ఈ పోస్‌లో డీలర్‌తో వేలిముద్ర వేయించుకున్న తర్వాత గోదాములో బియ్యం సంచులను లారీలోకి లోడింగ్‌ చేస్తున్నారని.. వేబ్రిడ్జి తూకాల్లోనూ తేడాలున్నాయని.. గోదాము నుంచి సరకు సరైన తూకంతో  బయటకు పంపితే తరుగు ఎందుకు వస్తుందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో మోసాలు

స్టేజ్‌-1 గుత్తేదారులు పౌరసరఫరాల గోదాములకు(ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు) బియ్యం సరఫరా చేస్తారు. అక్కడి నుంచి స్టేజ్‌-2 గుత్తేదారులు చౌక దుకాణాలకు పంపుతారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 13 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. 2,175 రేషన్‌ దుకాణాలున్నాయి. మొత్తం 11,98,695 రేషన్‌ కార్డులున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల పరిధిలో ప్రతి నెలా బరువు యంత్రాలను ఈ పోస్‌ యంత్రాలతో అనుసంధానం చేసి చౌకదుకాణం డీలర్‌కు ఎంత రేషన్‌ కోటా ఉందో అంత మేర బియ్యం తూకం వేసి సదరు డీలర్‌తో వేలిముద్రలు వేయించుకుంటున్నారు. అనంతరం తూకం వేసిన బియ్యం సంచుల్లో కాకుండా గోదాము నుంచి నేరుగా ఇస్తున్నారు. పౌరసరఫరాల గోదాము నుంచి ఒక సంచి 50 కిలోల చొప్పున లెక్క కట్టి డీలర్‌ కోటా ఎంత ఉందో అంత మేరకు స్టేజ్‌-2 వాహనానికి లోడ్‌ చేస్తారు. ఆ తర్వాత పౌర సరఫరాల గోదాములో వేబ్రిడ్జిలు ఉన్నాయి. అక్కడ కూడా ఈ పోస్‌ యంత్రాల్లో ఎంత తూకం వచ్చిందో అంతే వేబ్రిడ్జి కాటాలో తూకం వచ్చేలా ఎవరికి అనుమానం రాకుండా గుట్టుగా నడిపిస్తున్నారు. ఏలూరు జిల్లాలో కైకలూరు, నూజివీడు, ఏలూరు, ధర్మాజీగూడెం, పాతూరు, జంగారెడ్డిగూడెంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. వీటి నుంచి రేషన్‌ బియ్యం సరఫరా జరుగుతోంది.

ప్రతిఫలం పేదలకు చేరడం లేదు 

చౌక దుకాణంలో డీలర్‌ బియ్యం సంచులను తూకం వేసుకోగా ఒక్కో సంచిపై 2 కిలోల తరుగు వస్తోంది. క్వింటాకు 3 నుంచి  4 కిలోల చొప్పున తగ్గుతోంది. ఈ మేరకు ప్రజలకు అందించే బియ్యంలో డీలర్లు కోత పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన బియ్యం.. కార్డు దారులకు చేరేలోగా కిలోకు రూ.41 మేర ఖర్చవుతోంది. కానీ దాని ప్రతిఫలం పేదలకు సక్రమంగా చేరడం లేదు. తరుగు రూపంలో మిగుల్చుకున్న బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి అక్రమ వ్యాపారులకు చేరుతుందనే ఆరోపణలు ఉన్నాయి.

ఏలూరు జిల్లాలో..

మొత్తం రేషన్‌ దుకాణాలు 1,123
రేషన్‌కార్డులు 6,31,044
ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు 6 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని