logo

పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ కోరారు.

Published : 18 Jun 2024 02:36 IST

రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ

మాట్లాడుతున్న ఝాన్సీ

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ కోరారు. ఏలూరులోని టుబాకో మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాల్లో నిర్వహిస్తున్న ఏఐకేఎంకేఎస్‌ అనుబంధ రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై రెండు దశాబ్దాలు గడిచినా.. నిర్వాసితులకు నేటికీ న్యాయం జరగలేదన్నారు. 
జీవనోపాధి కోల్పోయి పునరావాస కాలనీల్లో వలస కూలీలుగా దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తక్షణమే మొదటి ప్రాధాన్యతగా నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలని, భూమికి భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పునరావాసం నిర్వాసితులకు భిక్ష కాదని, అది ప్రజాస్వామిక హక్కు అని.. దానిని సాధించుకోవడానికి  ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంకేఎస్‌ జాతీయ నాయకుడు శంభు మహతో, గుణాలన్, ఏఐఎఫ్‌టీయూ (న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్, కార్యదర్శి ఎం.లక్ష్మి, జనసాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.అరుణ తదితరులు మాట్లాడారు. అనంతరం 24 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర అధ్యక్షురాలుగా సింహాద్రి ఝాన్సీ, కార్యదర్శిగా డి.వర్మ, ఉపాధ్యక్షులుగా ఇల్లా రామిరెడ్డి, యు.వీరబాబు, కె.మోహన్, సహాయ కార్యదర్శులుగా షేక్‌ బాషా, ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, జి.సునీతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పలు తీర్మానాలను ఆమోదించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని