logo

పాలక.. ప్రగతి పట్టాలెక్కాలిక!

పచ్చదనం.. ప్రశాంతత పెనవేసుకున్న పశ్చిమలో ప్రగతి పనులకు గత పాలకులు మొండిచెయ్యి చూపారు. అయిదేళ్ల పాటు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. ఫలితంగా పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి.

Updated : 18 Jun 2024 04:48 IST

అయిదేళ్లలో అభివృద్ధి పనులకు నిధులివ్వని పాలకులు 
డబుల్‌ ఇంజిన్‌ సర్కారుపై జిల్లా వాసుల ఆశలు

పచ్చదనం.. ప్రశాంతత పెనవేసుకున్న పశ్చిమలో ప్రగతి పనులకు గత పాలకులు మొండిచెయ్యి చూపారు. అయిదేళ్ల పాటు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. ఫలితంగా పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. అభివృద్ధిని విస్మరించిన పాలకులను ఓటర్లు ఇంటికి సాగనంపారు. ఎన్డీయే అభ్యర్థులపై నమ్మకం ఉంచి భారీ ఆధిక్యంతో గెలిపించారు. ప్రస్తుత పాలకులు ప్రగతి బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకొని ముందుకు సాగితే... జిల్లాకు వన్నె తెచ్చే మరిన్ని ప్రాజెక్టులు సాధించవచ్చు. అసంపూర్తి పనులను పూర్తి చేయొచ్చు.

- న్యూస్‌టుడే, పాలకొల్లు

‘శ్రావణ’ శోభ సంతరించేనా?

ఎన్టీయే అధికారంలోకి రాగానే టిడ్కో గృహాల పనులు పూర్తి చేసి వచ్చే శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలు చేయిస్తామని చంద్రబాబునాయుడు పాలకొల్లు పర్యటనలో ప్రకటించారు. అనుకున్నట్టే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. శ్రావణ మాసానికి టిడ్కో గృహాలు సిద్ధం చేస్తే ఉమ్మడి జిల్లాలో సుమారు 10 వేల కుటుంబాల్లో శ్రావణ శోభ వికసించనుంది. దీనికి మరో 2 నెలల వరకు సమయం ఉండటంతో... అపరిష్కృత పనులను పూర్తి చేయవచ్చని పలువురు లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.

‘గట్టు’మేల్‌ తలపెట్టాలి

గోదావరి జిల్లాలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను వరదల నుంచి రక్షించే ఏటిగట్టు ఆధునికీకరణకు వైకాపా చిల్లిగవ్వ ఇవ్వలేకపోయింది. దీనివల్ల ఏటా వరదల సమయంలో గోదావరి ఉద్ధృతి తీరప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వైకాపా ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 60 కిలోమీటర్ల పరిధిలో 8 బలహీన ప్రాంతాలను గుర్తించి రూ.161 కోట్లతో ప్రతిపాదనలు పంపగా - సర్కారు పైసా కూడా విదల్చిన పాపాన పోలేదు. ఏటిగట్టును అభివృద్ధి చేసి బీటీ రోడ్డు నిర్మించినా... చించినాడ నుంచి సిద్ధాంతం వరకు దగ్గర దారి ఏర్పడుతుంది. వచ్చేదంతా వరదల కాలం.. ఈలోపు గట్టు బలహీన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని తీర ప్రజలు కోరుతున్నారు.

‘రయ్‌’మంటూ దూసుకెళ్లేలా...

ప్రగతికి చిహ్నాలు రహదారులు. జిల్లాలోని 11 ప్రధాన రహదారుల అభివృద్ధి, వంతెనల పునర్నిర్మాణ పథకం(ఏపీఆర్‌బీఆర్‌పీ) కింద న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు రుణం(ఎస్‌డీబీ) 2022 మార్చిలో మొదట విడతగా రూ.200 కోట్లు మంజూరు చేసింది. దీనిలో 70 శాతం కేంద్ర ప్రభుత్వం వాటా కాగా, మిగతా 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలి. మొత్తం 11 పనుల పూర్తికి రూ.140 కోట్లకు ఓ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 30 శాతం నిధులను వైకాపా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది. కొత్త ప్రభుత్వం ఆయా పనులపై దృష్టి పెడితే అర్ధాంతరంగా ఆగిన రహదారుల పనులు పునఃప్రారంభమవుతాయని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. ఇదే జరిగితే తణుకు- భీమవరం, పాలకొల్లు- ఆచంట, మేడపాడు- చించినాడ, చించినాడ- నరసాపురం, కానూరు- లంకలకోడేరు, పెనుమంట్ర- వీరవాసరం, ఏలూరు- జంగారెడ్డిగూడెం, దెందులూరు- పంగిడిగూడెం, ఏలూరు- పెరికేడు రహదారులు మెరిసిపోనున్నాయి.

ప్రాజెక్టుతో ‘ఉభయ’ కుశలోపరి

కోటిపల్లి- నరసాపురం రైలు ప్రాజెక్టు ఉభయ గోదావరి జిల్లాల ప్రజల పాతికేళ్ల కల. ఈ ప్రాజెక్టు సైతం గత ప్రభుత్వ నిర్వాకం వల్లే నిలిచిపోయింది. 57 కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ.2,125 కోట్లతో నిర్మించాల్సిన ఈ రైల్వే ప్రాజెక్టుకు రాష్ట్రం వాటా రూ.525 కోట్లు ఇవ్వాల్సి ఉండగా- వైకాపా సర్కారు రూ.2.69 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొంది. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలోనూ ఎన్టీయే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పట్టాలెక్కడంతో ఈ ప్రాజెక్టును పట్టాలపై పరుగెత్తించాల్సి ఉంది. నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ కేంద్ర సహాయమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున... ఆయన సారథ్యంలో ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని