logo

నిబంధనలు వదిలేసి.. నిధులు మళ్లించి!

వైకాపా పాలనలో సర్పంచులు.. వార్డు సభ్యులు ఉత్సవ విగ్రహాల్లా మారారు. పల్లె పాలనలో కార్యదర్శులే కీలకంగా వ్యవహరించేవారు. గ్రామాభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదన రూపొందించాలన్నా... దాన్ని తీర్మానించాలన్నా... గ్రామాల్లో పన్నులు వసూలు చేయాలన్నా... ప్రతి దశలోనూ పాలనా పరమైన బాధ్యతలన్నీ వారిపైనే ఉండేవి.

Published : 18 Jun 2024 02:47 IST

గాడి తప్పిన పంచాయతీ పాలన
వైకాపా నేతల కనుసన్నల్లో కొందరు కార్యదర్శులు

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే : వైకాపా పాలనలో సర్పంచులు.. వార్డు సభ్యులు ఉత్సవ విగ్రహాల్లా మారారు. పల్లె పాలనలో కార్యదర్శులే కీలకంగా వ్యవహరించేవారు. గ్రామాభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదన రూపొందించాలన్నా... దాన్ని తీర్మానించాలన్నా... గ్రామాల్లో పన్నులు వసూలు చేయాలన్నా... ప్రతి దశలోనూ పాలనా పరమైన బాధ్యతలన్నీ వారిపైనే ఉండేవి. ప్రభుత్వ సేవలన్నీ వారి ద్వారానే ప్రజలకు చేరేవి. అయితే కొందరు పంచాయతీ కార్యదర్శులు వైకాపా నేతలతో మిలాఖతై... నిబంధనలను గాలికి వదిలేశారు. ప్రజలకు సేవలందించాల్సిన వారు... నాయకుల అండదండలతో అడ్డుగోలుగా ప్రవర్తించారు. వారి మాటే వేదం అన్నట్లు... ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో... ఇకనైనా కార్యదర్శుల్లో మార్పు రావాలని ప్రజలు కోరుతున్నారు. వైకాపా నేతలతో అంటకాగిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

భీమవరం మండలంలో రాయలం పంచాయతీ కార్యాలయ భవనమిది. ఈ పంచాయతీ వార్షికాదాయం రూ.కోటి పైనే. కీలకమైన పంచాయతీని వైకాపా నేతలు మూడేళ్లపాటు ఇన్‌ఛార్జి కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. అతను ఓ వైకాపా ముఖ్య నేతతో నేరుగా సంబంధాలు పెట్టుకుని చక్రం తిప్పేవారన్న ఆరోపణలున్నాయి. సామాన్యులను ముప్పుతిప్పలు పెట్టే అతను... వ్యాపారులకు మాత్రం గంటల వ్యవధిలోనే పని చేసేవారు. గత మార్చిలో ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించగా... కొత్త కార్యదర్శికి నేటికీ రికార్డులు అందజేయలేదు. మార్చి నెలాఖరుకు పంచాయతీలో సుమారు రూ.3 కోట్లు నిల్వ ఉండగా- ఇప్పుడు రూ.60 లక్షలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది.

అక్రమాలకు ఆనవాళ్లు ఇవీ

  • భీమవరం మండలం యనమదుర్రు పంచాయతీ కార్యదర్శిపై కొన్ని నెలల కిందట పెద్దఎత్తున ఆరోపణలొచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వైకాపా నేతలకు పనులు చేసి పెట్టారంటూ కొందరు పాలకవర్గ సభ్యులే ఆరోపణలు గుప్పించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అప్పటి డీపీవో మల్లికార్జునరావు విచారణ చేపట్టి... ఆరోపణలన్నీ నిజమేనని తేల్చారు. అడ్డగోలు పనుల్లో పంచాయతీ కార్యదర్శి పాత్ర వాస్తవమని నిర్ధరించారు. సదరు కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తామని చెప్పి... కొన్నాళ్లకు ఆ డీపీవోనే బదిలీపై వెళ్లిపోయారు.
  • పాలకోడేరు మండలం పాలకోడేరు, మోగల్లు పంచాయతీ కార్యదర్శులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పటి కలెక్టర్‌ ప్రశాంతి ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ చేయించారు. పంచాయతీ నిధులను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తేలింది. వారిలో ఒకరిని సస్పెండ్‌ చేయగా... ఒకరిపై బదిలీ వేటు వేశారు.
  • పెంటపాడు మండలం అలంపురం కార్యదర్శి స్థానిక వైకాపా నాయకులు చెప్పిన దానికల్లా తల ఊపుతూ పాలనను గాలికి వదిలేశారు. అతనిపై ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెన్షన్‌కు గురŸయ్యారు.
  • పాలకొల్లు మండలం సగంచెరువు పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనమైంది.

అడ్డగోలుగా వ్యవహరిస్తే చర్యలు

పంచాయతీ కార్యదర్శులు నిబంధనల ప్రకారం పని చేయాల్సిందే. నాయకులు చెప్పారనో, ఇతర కారణాలతో అడ్డగోలుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. కార్యదర్శులపై ఫిర్యాదు వచ్చాక మొదట నోటీసు ఇచ్చి తర్వాత విచారిస్తాం. ఆరోపణలు నిజమని తేలితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కొత్త కార్యదర్శి విధుల్లో చేరిన వెంటనే అప్పటి వరకున్న రికార్డులను అతడికి అప్పగించి తీరాలి. అలా చేయని వారిపైనా చర్యలుంటాయి.

- ఆర్‌.విక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, భీమవరం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని