logo

కేజీబీవీల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యా బోధన

పేదరికం, గ్రామీణ నేపథ్యం, అవగాహనా లోపం వంటి తదితర కారణాలతో మధ్యలోనే బడి మానేసిన చిన్నారులను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి విలీన మండలాల్లోని కస్తూర్బాగాంధీ విద్యాలయాలు.

Published : 20 Jun 2024 03:59 IST

 విద్యార్థినుల భవితకు బాట..
 ఏటా పెరుగుతున్న ప్రవేశాలు
వేలేరుపాడు, న్యూస్‌టుడే

పేదరికం, గ్రామీణ నేపథ్యం, అవగాహనా లోపం వంటి తదితర కారణాలతో మధ్యలోనే బడి మానేసిన చిన్నారులను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి విలీన మండలాల్లోని కస్తూర్బాగాంధీ విద్యాలయాలు. ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన సౌకర్యాలతో విద్యార్థినులు గత కొన్నేళ్లుగా చదువుతో పాటు ఆటపాటల్లో రాణించి ఔరా..! అన్పించుకుంటున్నారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారిలో అనేక మంది ఉన్నత చదువులు పూర్తి చేసిన పలువురు ఉద్యోగ వేటలో ఉండగా.. మరికొందరు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.

 పైసా ఖర్చులేకుండా..

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని భూదేవిపేట, వేలేరు, కుక్కునూరులో 2011లో కస్తూర్బాగాంధీ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో వాటికి పక్కా భవనాలు లేక రెండేళ్ల పాటు అద్దె ఇళ్లలో కొనసాగించారు. సరైన సౌకర్యాలు లేక విద్యార్థినులు బడి మధ్యలోనే మానేసేవారు. చేసేది లేక ఉపాధ్యాయినులు గ్రామాగ్రామాన కాలినడకన తిరిగి బాలికలను పాఠశాలలో చేర్పించే వారు. అనంతరం మూడు చోట్ల పక్కా భవనాలు నిర్మించడంతో పాటు ఆరు నుంచి పదో తరగతి వరకు ఏర్పాటు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ఒక్కో విద్యాలయంలో ఏటా 200 మంది చదువుకుంటున్నారు. రెండేళ్ల కిందట కుక్కునూరు, భూదేవిపేట విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ కోర్సులు సైతం ప్రారంభించడంతో పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థినులు పైసా ఖర్చు లేకుండా ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు.

మెరుగైన సౌకర్యాలు

విద్యార్థినులకు పాఠ్య, పుస్తకాలు, పెన్నులు, ఏడాదికి నాలుగు జతల ఏకరూప దుస్తులు, బూట్లు, టైలు, దుప్పట్లు, ట్రంకు పెట్టె ఉచితంగా ఇస్తారు. వాటితో పాటు ప్రతి నెలా సబ్బులు, తలనూనె, టూత్‌పేస్ట్, ఇతర కాస్మోటిక్స్, ఉదయం అల్పాహారంతో పాటు మినరల్‌ వాటర్, పాలు, బూస్ట్, హార్లిక్స్, మధ్యాహ్నం పప్పు, గుడ్డు, మజ్జిగతో కూడిన రుచికరమైన భోజనం వండి పెడతారు. అంతేకాకుండా శారీక సమస్యలపై అవగాహన కల్పించేందుకు 24 గంటల పాటు ఓ ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటుంది. విద్యాలయం ఆవరణలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు, కూరగాయల తోటలను పెంచే బాధ్యతను చిన్నారులకు అప్పగించడంతో వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ క్రమంలో 2017- 18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే భూదేవిపేట విద్యాలయాన్ని స్వచ్ఛ విద్యాలయంగా ఎంపిక చేసి నాటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా రూ.10 వేలు నగదు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ప్రత్యేక తరగతులతో..

ఆరు నుంచి పదో తరగతి విద్యార్థినులకు బోధించడంలో ఉపాధ్యాయినులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రోజూ తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేపి సుమారు రెండు గంటల పాటు చదివించడంతో పాటు యోగాసనాలు వేయిస్తుంటారు. ఉదయం 9 గంటలకు తరగతులు ప్రారంభమై మధ్యహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. రుచికరమైన భోజనం పెట్టి తిరిగి 1.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిస్తారు. అనంతరం గంట పాటు ఆటపాటలు, మొక్కల సంరక్షణ వంటి పనులు పూర్తి చేయిస్తారు. రాత్రి 7 గంటలకు భోజనం, తొమ్మిది గంటల వరకు స్టడీ అవర్‌ ఉంటుంది. పదో తరగతి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నారు. మధ్యలో వారికి అలసట రాకుండా ఆటవిడుపుగా కంప్యూటర్‌ బోధన, కుట్లు, అల్లికలు, బొమ్మల తయారీ వంటి వృత్తి నైపుణ్యం పనులు నేర్పిస్తున్నారు.

ఆటల్లో మేటి..

విద్యార్థినులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణిస్తున్నారు. స్థాయి ఏదైనా తమదే విజయం అనేలా అన్ని రకాల క్రీడా పోటీల్లో ప్రతిబర్చి పతకాలను సాధించారు. జోనల్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పలు క్రీడా పోటీల్లో పతకాలు సాధించి తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2017లో నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పలువురు విద్యార్థినులు పాల్గొని బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ‘విద్యార్థినులు ఎటువంటి ఆందోళనలకు గురికాకుండా రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం’అని సర్వశిక్షా అభియాన్‌ ఏపీసీ బి.సోమశేఖర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని