logo

నమ్మాం.. మోసపోయాం..

జిల్లాలో మొత్తం 605 సచివాలయాలు ఉండగా, వాటి పరిధిలో 10,610 మంది వాలంటీర్లు పనిచేస్తుండేవారు. ఎన్నికల ముందు వరకూ ఎటువంటి ఒడుదొడుకులు లేని వీరి ఉద్యోగాలు, ఎన్నికల నోటిఫికేషన్‌తో వివాదాస్పదమయ్యాయి.

Published : 20 Jun 2024 04:06 IST

వైకాపా నేతల మాటలతో ఎన్నికల ముందు రాజీనామాలు
ఎన్నికల్లో ఘోర ఓటమితో వాలంటీర్ల నైరాశ్యం

వైకాపా నాయకుల ఒత్తిడితో రాజీనామా చేశాం.. మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని

కుక్కునూరులో తెదేపా నాయకులకు వినతిపత్రాలు అందజేస్తున్న మాజీ వాలంటీర్లు

  •  కుక్కునూరు మండలంలో 80 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. వీరంతా రాజీనామా చేసి ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా పనిచేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. అందుకు స్పందించిన కొందరు ఎన్నికల ముందు రాజీనామాలు చేసి, వైకాపాకు అనుకూలంగా పనిచేశారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందడంతో రాజీనామా చేసిన వారంతా ఇప్పుడు అధికారులు, అధికారపార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. తమను ఒత్తిడి చేసి రాజీనామా చేయించారనీ, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు పార్టీనాయకులు, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
  • కొయ్యలగూడెం, ఉంగుటూరు మండలాల్లోనూ వాలంటీర్లు అక్కడి ఎంపీడీవోలు, అధికారపార్టీ నాయకులకు వినతిపత్రాలు అందజేశారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలతో విధులకు దూరంగా ఉంటున్న మమ్మల్ని వైకాపా నాయకులు ఒత్తిడిచేసి రాజీనామా చేయించారనీ, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

కుక్కునూరు, న్యూస్‌టుడే

జిల్లాలో మొత్తం 605 సచివాలయాలు ఉండగా, వాటి పరిధిలో 10,610 మంది వాలంటీర్లు పనిచేస్తుండేవారు. ఎన్నికల ముందు వరకూ ఎటువంటి ఒడుదొడుకులు లేని వీరి ఉద్యోగాలు, ఎన్నికల నోటిఫికేషన్‌తో వివాదాస్పదమయ్యాయి. రాజకీయ వివాదాలు వీరిని చుట్టుముట్టటంతో ఎన్నికల సంఘం విధులకు దూరంగా ఉంచింది. దీంతో వీరి సేవలు ద్వారా ఎన్నికల్లో ఓట్లు సంపాదించాలని ప్రణాళికలతో ఉన్న వైకాపాకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రాజీనామా చేసి, పార్టీకి పనిచేయాలనీ, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి నియామకాలు చేపడతామని హామీ ఇచ్చింది. నాయకుల ఒత్తిడితో కొందరు వాలంటీర్లు రాజీనామా చేసి ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఎన్నికల్లో వైకాపా ఘోరపరాజయం పాలైంది. దీంతో వీరి పునర్నియామకాలు ప్రశ్నార్థకమయ్యాయి. తీవ్ర నైరాశ్యంలో ఉన్న వీరంతా ఇప్పుడిప్పుడే కోలుకొని, తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు. తమను విధుల్లోకి తీసుకోవాలని అధికారులు, కూటమి నాయకులను ప్రాధేయపడుతున్నారు. జిల్లాలో రాజీనామాలు చేసిన వారి సంఖ్య దాదాపు 6వేల మంది వరకూ ఉంటుందని సమాచారం. ఎన్నికల్లో తాము నమ్ముకున్న పార్టీ ఓటమిపాలవటంతో ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు.

ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు

‘వాలంటీర్ల వ్యవస్థ రద్దుచేయం..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.10వేలు వేతనం ఇస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రతిపక్షనేతగా చంద్రబాబు ప్రకటించారు. కూటమి అధికారంలోకి వస్తుందని భావించిన వారు ఏదో ఒక సాకుతో రాజీనామాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా వైకాపాకు వీరవిధేయులైన వారు మాత్రం రాజీనామా చేసి ఎన్నికల్లో ఆ పార్టీ  గెలుపు కోసం శాయశక్తులా కృషిచేశారు. వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వైకాపాను నమ్మి మోసపోయాం.. మన్నించండి అంటూ..కొన్ని చోట్ల కూటమితో సన్నిహితంగా ఉండే తమ బంధువుల సహాయంతో తిరిగి విధుల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు