logo

పెట్టుబడి పెట్టించారు.. మరి లాభాలేవీ!

వివిధ పెద్ద సంస్థలతో అనుసంధానమై.. వారి నుంచి తక్కువ ధరకు సరకులు దిగుమతి చేసుకుని.. మార్జిన్‌ లాభాలకే అమ్మకాలు చేయాలనే లక్ష్యంతో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జిల్లాలో మహిళా మార్ట్‌లు ప్రారంభించారు.

Updated : 20 Jun 2024 04:43 IST

మహిళా మార్ట్‌ నిర్వహణ తీరుపై డ్వాక్రా మహిళల ఆవేదన
చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు పట్టణం, న్యూస్‌టుడే

జంగారెడ్డిగూడెంలోని మహిళా మార్ట్‌

వివిధ పెద్ద సంస్థలతో అనుసంధానమై.. వారి నుంచి తక్కువ ధరకు సరకులు దిగుమతి చేసుకుని.. మార్జిన్‌ లాభాలకే అమ్మకాలు చేయాలనే లక్ష్యంతో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జిల్లాలో మహిళా మార్ట్‌లు ప్రారంభించారు. వాటిలో పొదుపు మహిళల ఉత్పత్తులనూ విక్రయించే అవకాశం కల్పించారు. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధానంతో ఆన్‌లైన్‌లోనూ వ్యాపారం నిర్వహించుకునేలా రూపకల్పన చేశారు. పొదుపు మహిళలు తయారు చేసే పచ్చళ్ల దగ్గర నుంచి చింతపండు, తేనె ఇతర ఉత్పత్తులు విక్రయించుకునేలా సూపర్‌బజార్‌ల తరహాలో మార్ట్‌లు ఏర్పాటు చేశారు.

నూజివీడులో నష్టాల బాట..

నూజివీడు బాలుర ఉన్నత పాఠశాల పక్కన ఆరు నెలల కిందట మహిళా మార్ట్‌ ప్రారంభించారు. మొదటి మూడు నెలలు లాభాల్లో కొనసాగింది. ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోంది. ఇక్కడ ఏడుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి వేతనాల రూపేణా నెలకు రూ.63000 వరకు ఇవ్వాలి. గతంలో రోజుకి రూ.50000 వరకు విక్రయాలు ఉండేవి. ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు లావాదేవీలు పడిపోయాయి. ఇందులో 18 వేల మంది డ్వాక్రా మహిళలు సభ్యులుగా ఉన్నారు.

జిల్లాలో మొదటిసారిగా చింతలపూడిలో రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌ను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ప్రారంభించారు. ఇందులో మండలంలోని 1778 డ్వాక్రా సంఘాల్లోని సుమారు 18 వేల మంది మహిళలు ఒక్కొక్కరు రూ.200 నుంచి రూ.250 షేరు ధనంతో భాగస్వాములయ్యారు. అయితే అప్పట్లో మార్ట్‌ నుంచి వచ్చే ఆదాయాన్ని తిరిగి మీకే పంచుతామని చెప్పడంతో మహిళలు ఎగబడి సరకులు కొనుగోలు చేశారు. కానీ లాభాలను మాత్రం పంచడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలున్నాయి.

ఆదాయం ఘనం

చింతలపూడి మహిళా మార్ట్‌లో రోజుకి దాదాపు రూ.లక్షకు తగ్గకుండా ఏడాది పాటు వ్యాపారం సాగింది. ఎన్నికల కారణంగా గత నాలుగు నెలలుగా రూ.20వేల నుంచి రూ.30 వేల వరకే విక్రయాలు జరుగుతున్నాయి. మండలంలోని డ్వాక్రా మహిళలు గ్రూపుగా వచ్చి సరకులు కొంటూ వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందేలా సహకరించారు. ఎంత సరకు అమ్మారు? ఎంత ఆదాయం వచ్చిందనే విషయం డ్వాక్రా గ్రూపు సభ్యులకు తెలియని పరిస్థితి.

వచ్చేది రూ.23 మాత్రమే

జంగారెడ్డిగూడెం మహిళా మార్ట్‌ను 2022 అక్టోబరు 28న ప్రారంభించారు. 1,200 స్వయం సహాయక సంఘాలలోని 12 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఒక్కొక్కరు రూ.330 చొప్పున వాటా ధనంగా రూ.40 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. గత 20 నెలల్లో రూ.20.79 లక్షల ఆదాయం రాగా, రూ.18.05 లక్షలు ఖర్చయ్యింది. దీంతో ఇప్పటి వరకు ఈ దుకాణం ద్వారా వచ్చిన లాభం రూ.2.74 లక్షలు మాత్రమే. దీన్ని ఇంకా సభ్యులకు పంచలేదు. ఈ లెక్కన చూస్తే ఒక్కో సభ్యురాలికి సుమారు రూ.23 లాభం మాత్రమే వచ్చింది. దీనిపై మార్ట్‌ ఇన్‌ఛార్జి నాగేంద్రను సంప్రదిస్తే లాభాలు ఇంకా పంచలేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆడిట్‌ అనంతరం పంచుతామన్నారు.

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

‘మహిళా మార్ట్‌లో సరకుల లావాదేవీలకు సంబంధించి ఆడిట్‌ చేయాల్సి ఉంది. వచ్చిన లాభాన్ని డ్వాక్రా మహిళలకు అందించే విషయంలో జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’అని డీపీఎం రామోజీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని