logo

వైకాపా అండతో ఆడిందే ఆట.. పాడిందే పాట..

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో గత అయిదేళ్లలో వైకాపా నాయకుల అడ్డగోలు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సరస్వతీ నిలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చేశారు.

Published : 20 Jun 2024 04:20 IST

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో అడ్డగోలు వ్యవహారాలు
అనుచరగణానికి  ఫుడ్‌కోర్టు కాంట్రాక్టు
టెండర్లు పిలవకుండా అక్రమం.. అద్దె  చెల్లించకుండా పెత్తనం
ఇతర దుకాణాల్లోనూ చెల్లింపులు శూన్యం
ఈనాడు, ఏలూరు

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలోని ఫుడ్‌కోర్టు

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో గత అయిదేళ్లలో వైకాపా నాయకుల అడ్డగోలు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సరస్వతీ నిలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చేశారు.  ప్రాంగణంలోని ఫుడ్‌కోర్టును ఇష్టారాజ్యంగా ఓ వైకాపా నాయకుడికి అప్పగించి ఏళ్లు గడుస్తున్నా ఇతర గుత్తేదారులను రానివ్వకుండా గోల్‌మాల్‌ చేశారు. కనీసం అద్దె కూడా సవ్యంగా చెల్లించకుండా కాలం గడిపేస్తున్నా పట్టించుకునే నాథుడు లేరు. ప్రాంగణంలో ఉన్న మిగిలిన దుకాణాల నిర్వాహకులు విద్యుత్తు బకాయిలు కూడా చెల్లించకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారు.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో అన్ని విభాగాలు కలిపి 6 వేల మందికి పైగా విద్యార్థులున్నారు. వీరికి ప్రాంగణంలోనే అన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం దీనికి ప్రతి రెండేళ్లకోసారి టెండరు పిలవాలి. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక టెండరును స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడికి కట్టబెట్టారు. మళ్లీ 2023లో టెండర్లు పిలవడంతో చాలా మంది గుత్తేదారులు టెండర్లు వేశారు. అధికారపార్టీ అండతో పాత గుత్తేదారుకే కాంట్రాక్టు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో కొందరు వైకాపా పెద్దలు అతితెలివి ప్రదర్శించారు. భోజనం, శీతల పానీయాలు, అల్పాహారం.. ఇలా ప్రతి పదార్థాన్నీ రూ.10 లోపే అమ్ముతానని టెండరులో పేర్కొన్నారు. కొన్ని పదార్థాలకు కేవలం రూపాయినే ధరగా పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఏడాది క్రితం అధికారులు టెండర్లు రద్దు చేశారు.

టెండరు పిలవరు..అద్దె అడగరు

టెండరు ముగిసినా గత అయిదేళ్లుగా పాత గుత్తేదారునే కొనసాగిస్తున్నారు. వైకాపా అండతో టెండరు పిలవకుండా కాంట్రాక్టును పొడిగిస్తూ వచ్చారు. దీంతో గుత్తేదారు నాణ్యత లేని పదార్థాలను ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. నిబంధనల ప్రకారం ఫుడ్‌ కోర్టులో ఆహార నాణ్యత పరిశీలించేందుకే ఉండే కమిటీ ఈ అయిదేళ్లలో పరిశీలించింది లేదు. ఫుడ్‌ కోర్టు నిర్వహించినందుకు నెలకు     రూ.5.53 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా గత అయిదేళ్లలో సవ్యంగా చెల్లించింది లేదు. గత ఏడాది నుంచి అసలు చెల్లించకపోవటంతో ప్రస్తుతం రూ.50 లక్షల పైగా బకాయిలున్నాయి. వైకాపా ప్రభుత్వం అండ ఉండటంతో అధికారులు నోటీసులు ఇచ్చి మమ అనిపించారే తప్ప కనీస చర్యల్లేవు. గుత్తేదారు బంధువు పురపాలికలో కీలక పదవి ఉండటంతో ఫుడ్‌కోర్టులో మిగిలిన చెత్తాచెదారం తీసుకువెళ్లేందుకు పురపాలిక నుంచి చెత్తవాహనం వస్తుంది. పురపాలక సిబ్బంది ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఇక్కడ పని చేస్తుంటారు. పురపాలిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

ప్రభుత్వ ఆదాయానికి గండి

ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఫుడ్‌కోర్టు కాకుండా దాదాపు 10 వరకు ఫ్యాన్సీ, నోట్‌ పుస్తకాలు, కిరాణా వంటి ఇతర దుకాణాలున్నాయి. వీటికి గత నాలుగేళ్లుగా టెండర్లే లేవు. వైకాపా నాయకుల అనుచరులకు ఈ దుకాణాలు కట్టబెట్టారు. ఒక్కో దుకాణదారు నెలకు రూ.15వేల వరకు చెల్లించాల్సి ఉన్నా..అద్దె కూడా సవ్యంగా కట్టడం లేదు. మరో ఆశ్చర్యం ఏమిటంటే ఈ దుకాణాలకు రూ.లక్షల్లో విద్యుత్తు బకాయిలున్నా..చెల్లించడం లేదు. టెండర్లు పిలవకుండా, అద్దె, విద్యుత్తు బిల్లులు చెల్లింకుండా యాజమాన్యం మిన్నకుండటంతో దుకాణదారులు గత అయిదేళ్లుగా సొమ్ము చేసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ అంశమై ట్రిపుల్‌ ఐటీ ఏవో చంద్రశేఖర్‌ను వివరణ కోరగా గతంలో వేసిన టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో రద్దు చేశాం..మళ్లీ పిలిచేందుకు ఉన్నతాధికారులకు నివేదించాం. అద్దె బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చి వసూలు చేస్తాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని